"వస్తున్నా!"

    మరో నిముషం గడిచాక తలుపు తెరువబడింది. రవి తొట్రుపాటును అణగత్రొక్కుకుంటూ , తనని తాను సంభాళించుకోలేని స్థితిలో త్రొక్కిసలాడుతూ, చివరకు ధైర్యంచేసి తలవంచి చూసి "రాగిణీ! నీ వచ్చాను" అన్నాడు.

    "లోపలకు రండి."

    అతను లోపలకు వెళ్ళాక రాగిణి తలుపులు గడియవేసింది. "ఇదేమిటి?" అని తెల్లబోయి మరుక్షణంలో ఓ తువ్వాలు తీసి అతనికి అందిస్తూ, "తుడుచుకోండి" అంది.

    అతను దిగజారిపోతున్న చెమటను ఆతృతతో తుడుచుకుని కుర్చీలో కూలబడి "అబ్బా!" అన్నాడు.

    "ఏమిటీ రాత్రివేళ ఆగమనం?"

    "ఎందుకో నిన్నెప్పుడూ రాత్రులే చూడాలని వుంటుంది రాగిణీ!"

    "ఏమో అలా?"

    "నీ ముఖం చీకట్లో బాగుంటుంది కాబోలు!"

    "అంత మాత్రమే అయితే ఫర్వాలేదు."

    "రాగిణీ!" అన్నాడు కొంచెం ముందుకు వంగి.

    "కొంచెం పాలు వున్నాయా? ఆకలి వేస్తోంది."

    ఆమె ఆశ్చర్యంతో "అదేమిటి? మీరు భోజనం చేయలేదా?" అనడిగింది.

    "ఉహు! నేను సినిమానుంచి వచ్చేసరికి లాయర్స్ క్లబ్ కట్టేశారు. నేను హోటళ్ళలో ఏమీ తిననని నీకు తెలుసుకదా? ఒకసారి ఏదో తీపివస్తువులు తినేసరికి వాంతులు అయి అయిదురోజులు తీవ్రంగా జ్వరం కాసింది."

    రాగిణి గాద్గదికంగా "నిజం చెప్పండి? మీకే గనుక అమ్మ వున్నట్లయితే ఇలా ప్రవర్తించేవారా? వేళగాని వేళప్పుడు ఇలా చెడుతిరుగుళ్ళు తిరగనిచ్చేదా?" అంది.

    "మా చిన్నక్క మా అమ్మను మరిపించగలదు" అన్నాడతను ఆనందంతో కనులు సగంమూసి.

    "కానీ, ఆమె అత్తగారింట్లో వుంది కదా? మిమ్మల్ని దగ్గరకు చేర్చుకుని అవీ ఇవీ అడగటానికి ఆవిడకు తీరదు కదా?"

    "ఆమె విషయం నీకు తెలీదు రాగిణీ! అటువంటి మాతృమూర్తి ని నేనెక్కడా చూడలేదు. ఆమె వాత్సల్యంతో నాకు తల్లిలేని లోటు తీర్చింది. కానీ ఏ రెండు మూడు నెలలకో ఒకసారి ఆమెను నేను చూడగలిగేది. అదే విచిత్రం."

    రాగిణి నేలచూపులు చూస్తూ ఊరుకుంది. తరువాత నాలిక కొరుక్కుని "మందమతిని. ఉండండి, కుంపటి రాజేసి పాలు వెచ్చబెడతాను" అని గబగబ లోపలకు వెళ్ళిపోయింది.

    ఆమె పాలగిన్నె కుంపటిమీద పెట్టి విసురుతూ కూర్చుంది. అతను కొంచెం ఇవతలగా పీటమీద కూర్చుని కబుర్లు చెబుతున్నాడు.

    "భలేవారే! వెళ్ళండి, ఈ పొగలో మీరెందుకు? నే తెచ్చి యిస్తాగా!" అంది రాగిణి.

    "ఉహుఁ నేను వెళ్ళను. ఇవాళ ఈ దృశ్యం ఏం చక్కగా వుంది? నువ్వలా విసురుతూ కూర్చోవడం, నేనిలా నీప్రక్కన కూర్చుని కబుర్లు చెబుతూవుండడం. ఈ సీను ఎవరైనా తలుపు కంతలోనుంచి చూడాలి... వహ్వా" అంటూ అతను నవ్వడం సాగించాడు.

    ఆమె అతన్ని కోపంగా మింగేసేటట్లు చూసి, 'ఏం బుద్ధులమ్మా? ఇదేనా ఏమిటి మీరు చదివిన ప్లీడరీ?" అంది.

    "ప్లీడరీలో ఇటువంటి విషయాలు కూడా చెబుతారా తెలివితక్కువ వెధవలు అలా చూసినవాళ్ళను ఏం చేయాలో చెబుతారు."

    "మంచి మాటే" అని రాగిణి విసుగ్గా గొణిగింది.

    "రాగిణీ! అదేమిటో ఆశ్చర్యం. నేనెప్పుడు నీ దగ్గరకు వచ్చినా హఠాత్తుగానే వస్తుంటాను."

    "ఆశ్చర్యం సంగతి అలావుంచి ఇవేళ తమరు ఇక్కడికి వచ్చినందుకు కారణం చెప్పండి?" అని రాగిణి ఒక నిముషం విసరటం ఆపి అతన్ని పరిశీలనా దృష్టితో చూసింది.

    "బాగుంది. కారణం చెప్పకపోతే వెళ్ళగొడతావా ఏమిటి? నేను చాలా అలసిపోయి వచ్చాను. ఇక్కడినుంచి కదలను సుమా!"

    రాగిణి నిట్టూర్పును అతి కష్టంమీద అణచుకుని "అబ్బ! ఏం మాటలు మాట్లాడుతారు? ఇంటికి వచ్చినవారిని బయటకు సాగనంపటమా? అంతకంటే చచ్చిపోతాను." అంది వ్యధతో.

    "ఏమో, రెండు మాటలూ నువ్వే అంటావు. సరే, వెనుకటికి నన్ను వెళ్ళగొట్టిన వ్యక్తిపేరు రాగిణి కాదని నమ్ముతాను."

    ఆమె దెబ్బతిన్న హరిణిలా బెదిరిపోయి, నిగ్రహంమీద కంఠం అదుపులోకి తెచ్చుకుని "మీ కాళ్ళమీద పడతానుగానీ అవతలకు వెళ్ళండి. ఈ రాత్రి నన్ను ఏడిపించటానికి వచ్చారా ఏం?" అంది.

    అతను పెంకిఘటం కాకపోయినా కదల్లేదు. నిండుగా నవ్వడానికి ఓ వ్యర్ధ ప్రయత్నం చేసి, సాఫీగా ఇలా అన్నాడు "నువ్వానాడు ఎ పరిస్థితుల్లో సాగనంపావో గుర్తించాను కానీ ఇంతవరకూ నేరం నీమీదే ఆపాదిస్తూ వచ్చాను. ఇవేళ పూర్తిగా కరిగిపోయాను."

    "కరిగిపోయారా? మీకే తెలియాలి."

    అతను మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఏదో స్మరించి నేత్రాలు ఉజ్వలంగా ప్రకాశించాయి. పాలగిన్నె క్రింద నిప్పుకూడా రాజుకుంది. క్రమక్రమంగా కాంతితగ్గి, రమారమి సుషుప్తావస్థలోకి వచ్చి, ఏదో చురుకు తగిలినట్లు చైతన్యాన్ని స్వీకరించాయి.

    "నేను సినిమానుంచి గదికి పోయేసరికి తలుపులే గనుక తీసివుంటే నిన్ను చూడకుండా వెళ్ళిపోయేవాడ్నే!"

    "మీకెందుకంత మొండి పట్టుదల నన్ను చూడకూడదని?"

    "పట్టుదల లేకపోతే, ఎ ఉత్సాహంతో బ్రతకమంటావు నువ్వే చెప్పు?"

    "ఆహా!" అని రాగిణి పరిహాసంగా నవ్వింది. "కబుర్లు మీరే చెప్పాలి. ఎందుకు మహాశయా అవతలవాళ్ళ మతుల్ని గందరగోళపరిచే పలుకుల్ని విసురుతారు? మీ చిన్నక్కగారితోకూడా ఇలాగే మాట్లాడతారా?" అని కుంపటి మీదనుంచి దింపిన పాలగిన్నెలోంచి పాలు ఓ గిన్నెలోపోసి అందించి "పంచదార సరిపోయిందో లేదో చెప్పండి" అంది.

    "చిన్నక్కతోనా? ఇంతకంటే పదునైనమాటలు మాట్లాడతాను. కానీ వట్టి దద్దమ్మగా మాట్లాడానని నన్ను నేను రుజువుచేసుకుంటాను."

    "అంత తెలివి గలవారా వారు?"

    "ఆవిడ తెలివిని గురించి, శక్తి సామర్ధ్యాలగురించి చెప్పేటందుకు నేను ఎంతటివాడ్ని?"