నిజానికి మరోగంటతర్వాత తనే గెస్ట్ హౌస్ లో అడుగుపెట్టి నానీని చంపాలనుకున్నాడు. హోంమినిష్టర్ ప్రాపకంలో వుండగా నానీ ప్రాణాలు తీస్తే ఆ నేరాన్ని కప్పిపుచ్చుకునే బాధ్యత అతడిదే అవుతుందని భావించాడు. కాని ఇంతలో నానీని మరెవరో బయటికి తీసుకొచ్చారు.

 

    "స్పీడు పెంచు" టాక్సీ డ్రైవర్ని హెచ్చరించాడు రాజారావు. ఇన్ని ప్రయాసలు పెడుతున్న నానీ విషయంలో సహనాన్ని కోల్పోతున్నాడు.

 

    తనను తీసుకెళుతున్నదెవరో, తానెలాంటి వూబిలో కూరుకుపోతున్నాడో తెలీని నానీ బండి నడుపుతున్న రాందేవ్ ప్రశ్నలకి ఒక్కోజవాబు చెపుతున్నాడు ఆ స్థితిలోకూడా...

 

    పగలు ప్రెస్ కాన్ఫరెన్స్ లో అప్పారావు చెప్పినదంతా అబద్ధమని గ్రహించేసిన రాందేవ్ ఇన్నాళ్లకి ఓ ఏనుగు కుంభస్థలాన్ని కొట్టే పదునైన అవకాశం వచ్చినందుకు ఉద్వేగపడుతూనే బండిని వేగంగా నడుపుతున్నాడు.

 

    `టౌన్ లోని నిర్మానుష్యంగావున్న రోడ్డువైపు వెళుతూ ఆలోచిస్తున్నాడు. తను వెంటనే సురక్షితమైన ప్రదేశంలో తలదాచుకుంటే తప్ప ఈ వార్త వెలుగు చూడదు.

 

    అతడి అనుమానాన్ని బలపరుస్తూ వెనక టాక్సీచప్పుడు.

 

    అది మామూలుగా ప్రయాణం చేస్తున్నట్టు లేదు. వెంటాడుతూందని గ్రహించడానికి మరో అరక్షణం పట్టింది.

 

    "నానీ... నన్ను గట్టిగా పట్టుకో..." ఏక్సిలేటర్ తిప్పి వేగాన్ని పెంచుతూ థియేటర్ పక్కనున్న రోడ్డువైపు మళ్ళించాడు.

 

    వెనక టాక్సీకూడా అదే రోడ్డుపైకి తిరిగింది.

 

    ఆ క్షణంలో రాందేవ్ తీసుకున్న తప్పుడు నిర్ణయం సరాసరి పత్రికాఫీసుకి వెళ్ళాలనుకోవడమే.

 

    భైక్ ని ఖాళీస్ట్రీట్ లోకి డ్రైవ్ చేశాడు. అంతసేపూ వెనకవస్తున్న టాక్సీలని అనుమానించాడుగాని... కొన్ని క్షణాలక్రితమే పత్రికాఫీసుని చేరిన ఓ జీప్ తనకోసం తనకభిముఖంగా ప్రయాణంచేస్తూ వస్తుందని వూహించలేకపోయాడు.

 

    మరో రెండునిముషాలు గడిచిందో లేదో ఓమూల ఆగిన జీపులోంచి రివాల్వర్ పేలిన శబ్ధం.

 

    గాలిని చీల్చుకుంటూ వచ్చిన తూటా రాందేవ్ భుజాన్ని చేరింది.

 

    కొద్దిగా బేలన్స్ తప్పబోతూ కంట్రోల్ చేసుకున్న రాందేవ్, ఈసారి మరో తూటా పొట్టలోంచి దూసుకుపోయేసరికి కళ్ళు బైర్లు కమ్మినట్టయింది.

 

    రక్తం ఫౌంటెన్ లా చిమ్ముతూ రోడ్డుపై పడుకుంటే బండిని అదుపు చేసేశక్తి కూడగట్టుకుంటూ సందులో నుంచి కుడిపక్కకి ఓకిలోమీటరు దూరందాకా ప్రయాణం చేశాడు.

 

    సత్తువ సన్నగిల్లిపోయిందప్పటికే. ప్రాణాలు పోతున్నట్టుగా అనిపిస్తుంటే బండిని ఓ వారగా ఆపి నేలపై పడిపోయాడు.

    "నా...నీ..."

 

    తనేమౌతానోనని ఆ పసికందు కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాడని రాందేవ్ కి తెలీదు. తెలుసుకునే వ్యవధిలేదు. కెమెరాలోని రీల్ ని తీసి నానీకి అందించాడు. "ఇది... ఇది... తీసుకెళ్ళి పోలీసులకందించు. వీళ్ళకు కనిపించకు. పారిపో...."

 

    "యిందులో ఏముంది...?" భయంతో వెక్కిపడుతూనే అడిగాడు.

 

    "నిజం"

 

    నానీకి ఇష్టమైందీ నిజమే.

 

    "ఓ నిజాన్ని బ్రతికించే మం...దు."

 

    రాందేవ్ ప్రాణాలు కడంటిపోతున్నా ఆ వాక్యం నానికి ఊపిరి పోసినట్టయింది.

 

    పేంటుజేబులో పెట్టుకున్నాడు.

 

    అక్కడికి ముందుగా చేరింది రాజారావు.

 

    "వె...ళ్ళి...పో..." రాందేవ్ దూరంగా నిలబడ్డ టాక్సీని చూస్తూ అరిచాడు.

 

    నానీ కదలబోతూ సందుకి మరోపక్క ఆగిన జీపుని చూశాడు.

 

    అందులోంచే ఇందాక రివాల్వర్ పేలింది.

 

    ఓ భారీవిగ్రహం బయటకు వచ్చింది దూకుడుగా.

 

    హోంమినిష్టర్ అప్పారావుకి అతి ముఖ్యమైన అనుచరుడిగా ఎన్నో హత్యలు చేసికూడా ఇంకా విచ్చలవిడిగా తిరిగే ఆ వ్యక్తిపేరు 'హరి' అనికానీ, ఆ పట్టణంలో అతడి పేరువిన్న పోలీసు బలగం సైతం హడలిపోతుందనిగాని తెలీని నానీ ఓ లిప్తపాటు ఆ వ్యక్తినే చూశాడు.   

 

    మరుక్షణం రాందేవ్ మాటలు గుర్తుకురాగా వెనక్కి పరుగెత్తబోయాడుగాని రాజారావు తనవైపే రావడం కనిపించింది.

 

    ఇప్పుడు తన ప్రాణాలకోసం రెండు బలమైన శక్తులు రెండువేపుల్నుంచీ వెంటాడుతున్నాయని అమాయకంగానైనా గ్రహించిన నానీ కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి.

 

    ఇలాంటిస్థితిలో అమ్ముంటే భయంతో గువ్వలా అక్కున ఒదిగిపోయేవాడు.

 

    తనంటే ఇష్టపడిన నాన్న వున్నా రక్షించమని కాళ్ళని చుట్టేసేవాడు.

 

    "ర్రే...య్...! ఆగు" అప్పటికే స్పృహ తప్పివున్న రాందేవ్ కెమెరాలో రీలు లేదని గ్రహించిన హరి గట్టిగా కేకపెట్టాడు.

 

    నానీ పేంట్ తడయిపోయింది.

 

    వెనుకగావున్న ఓ చిన్నసందులోకి నానీ పరుగెత్తాడు ప్రాణభీతితో.

 

    "అమ్మా... అమ్మా" వెక్కిపడుతూనే అమ్మని తలుచుకుంటున్నాడు. "భయమేస్తోందే అమ్మా! నన్ను చంపుతారంటే... తాతయ్యకి మందు తీసుకెళ్ళాలమ్మా. నీరసంగా వుందమ్మా."

 

    వెనుక మృత్యువుపాశాల్లా దూసుకొస్తున్న యమకింకరుల బూట్లచప్పుడు.

 

    నానీకి తెలీదు రాజారావు సందు మొదలే విస్మయంగా ఆగిపోతే హరి మాత్రం వేగంగా నానీని అనుసరిస్తున్నాడని.  

 

                                                      *    *    *

 

    తూర్పురేఖలు విచ్చుకున్నా ఇంకా అరుణుడు అరుదెంచని ప్రభాత సమయాన...

 

    హరిత ఒంటిపై పడుకున్న 'షవర్' ప్రత్యూష పవనాలు చిలికే తుషార బిందువుల స్పర్శను గుర్తుచేసే వేళ... గదిలో ఫోన్ రింగవుతున్న చప్పుడు వినిపించింది.

 

    ఇంత తెల్లవారుజామునే ఎవరు ఫోన్ చేసిందీ అర్థంకాక రాయంచలా పడకగదిలోకి నడిచింది.

 

    ఆమె వంటి పసిమిఛాయపైనుంచి మృదువుగా జారుతున్న నీటిబొట్లు వెస్టుఫాలియా సతీమణి 'జిరోపన్' నిరంతరం స్నానమాడిన 'రెడ్ వైన్'ని తలపుకు తెస్తుంటే తడిగావున్న కురుల్ని సవరించుకుంటూ రిసీవర్ని అందుకుంది. "హల్లో..."