"ఉండేది రాయకొండలో అయినా ప్రస్తుతం చావుబ్రతుకులమధ్య టౌన్ హాస్పిటల్లో వున్నాడు."

 

    విభ్రమంగా చూశాడు యశస్వి.

 

    "అవును... నిన్నరాత్రి ఆయనపై హత్యాప్రయత్నం జరిగింది. అర్థరాత్రి దాటాక రక్తపుమడుగులో పడివున్న రాందేవ్ ని ఓ పోలీస్ పెట్రోలింగ్ వేన్ లో హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. అప్పటినుంచీ స్పృహలోకి రాలేదు. బట్! డాక్టర్స్ ఇంకా ప్రయత్నిస్తూనే వున్నారు. ఉదయం వెళ్ళాను. పరిస్థితి అనుమానంగానే వుందంటున్నారు. నిజానికి ఇప్పుడు బయలుదేరబోతున్నది అక్కడికే"

 

    "దెన్... వై డోంట్ వియ్ మేకే మూవ్?" యశస్వి లేచాడు.

 

    కాఫీలు అయ్యాక వెళదామని వారించబోయింది రతి.

 

    కానీ హరిత నచ్చచెప్పింది. "ఆయన చెప్పగలిగే పరిస్థితిలో లేకపోయినా అక్కడవున్న ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చిన విలేఖర్లు ఎవరన్నా కలిసే అవకాశంవుంది. మరేంలేదు రతీ! నానీ ఒక ప్రమాదంలో చిక్కుకోబోతున్నాడని మా అనుమానం."

 

    "హోం మినిష్టర్ అప్పారావుగారి గెస్టుహౌస్ కి వెళ్ళి ఆరా తీయొచ్చుగా" రతి అంది.

 

    "నానీని తన అవకాశవాదంతో వినియోగించుకున్న అప్పారావు అంత సులభంగా వివరాలు ఇస్తాడని మీరెలా అనుకుంటున్నారు" యశస్వి అన్నాడు సాలోచనగా.

 

    ఆ తర్వాత రతి మాట్లాడలేదు.

 

    మరో నలభైనిముషాలలో టౌన్ గవర్నమెంట్ హాస్పిటల్ చేరుకున్నారు.

 

    కారు దిగిన రతి కారిడార్ లోనే షాక్ తిన్నట్టు ఆగిపోయింది.

 

    రాందేవ్ శవాన్ని స్ట్రెచర్ పై బయటికి తీసుకొస్తున్నారు సరిగ్గా అప్పుడే.

 

    తెరిచివున్న రాందేవ్ కళ్ళలో ఏదో చేయలేకపోయిన అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. రతి కళ్ళలోని నీళ్ళను చూస్తూ అంటున్నారెవరో . "టేకిట్ ఈజీ మేడమ్... అర్థరాత్రివేళ అత్యాచారాలు జరిగేది ఆడవాళ్ళమీదే కాదు. అసాధారణమైన వాస్తవాన్ని పైకి తీయాలనుకున్న జర్నలిస్టులపై కూడా."

 

    అప్పుడు చూశాడు యశస్వి.

 

    ఆ మాటలంటున్నది మాసిన గెడ్డంతో చూడటానికి భిక్షగాడిలా వున్న వయసుమళ్ళిన ఓ వ్యక్తి. బాగా తాగినట్టు అతడిరెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. నిట్టూరుస్తూ ఓ స్తంభానికి జారగిలబడి అంతంకాని అవినీతి పేరుకుపోయిన వ్యవస్థ గుండెలోతుల్లోకి దిగులుతోకాక జుగుప్సగా చూస్తున్నట్లున్నాడు.

 

    "నాకు తెలుసు... అన్నయ్య  ఇలాంటి ఆపదలో ఎప్పటికైనా చిక్కుకుంటాడని..." గొణుగుతున్నట్లుగా అంది రతి కళ్ళొత్తుకుంటూ.

 

    "నీకే కాదమ్మా... తోటి జర్నలిస్టులమైన మా అందరికీ తెలుసు. కానీ వుడుకురక్తం. చెబితే విన్నాడా? ఈ దేశంలో నాగర్ వాలా కేసుల మొదలుకొని ఇప్పటి ఫెయిర్ ఫాక్స్, బోఫోర్స్ గొడవలదాకా వాస్తవాన్ని వెలికితియ్యడంలో జర్నలిస్టులపాత్ర ఎంతున్నాఆ స్కౌండ్రల్స్ ని రక్షించే సాయకులున్నంతకాలం అలాంటి రాజకీయం, దాన్ని కాపాడే కేపిటలిజమ్ బ్రతికున్నంతకాలం మనం న్యూస్ రాసే విలేఖర్లుగానే బ్రతకాల్రా అంటే 'నిజం ''నిజం' అంటూ న్యూసెన్స్ సృష్టించబోయాడు. పోయాడు..." భుజాలదగ్గర చిరిగిన లాల్చీపక్కజేబులో నుంచి ఓ చిన్నబాటిల్ అందుకుని గడగడా తాగాడు మిగిలివున్న విస్కీని.

 

    ఇక అక్కడ నిలబడే అవసరం లేదన్నట్టు ఉద్రేకంగా రెండడుగులు ముందుకేసి "అయినా వీడికెందుకమ్మా... నన్ను చూసైనా నేర్చుకోవచ్చుగా. నా బ్రతుకు గమనించయినా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవచ్చుగా. ఎందుకు లోతుగా వెళ్ళాలనుకోవడం" అంటూ చివరగా రాందేవ్ శవం దగ్గరకొచ్చాడు.

 

    కళ్ళనుంచి ఉబికివస్తున్న కన్నీళ్ళను దాచుకోవడానికేమో మోచేతిని కళ్ళకు అడ్డంగా వుంచాడు. "రాందేవ్... ఈ రామరాజ్యంలో నిజాన్ని వెలికితీసి ఇప్పుడు మరోలోకంలోని అరాచకాల్ని తెలుసుకోవాలని వెళ్ళిపోతున్నావు కదూ. అక్కడైనా నీ ఆవేశాన్ని అదుపుచేసుకో. ఆ లోకంలో అవినీతే వున్నా ఈ అనుభవంతో జాగ్రత్తగా నవరంధ్రాల్ని మూసుకుని బ్రతుకు. బ్రతికిపోతావు ఆ..."

 

    యశస్వి అందరిలా పరిశీలించడంలేదు. ఒక పోలీసాఫీసరుగా అతని మాటల్లోని లోతుని, ఆ వ్యక్తి అంతరాళంలో జరుగుతున్న సంఘర్షణని బేరీజు వేస్తూ పక్కనున్న ఎవర్నో అడిగాడు ఆయన ఏ పత్రిక విలేఖరి అంటూ.

 

    "రామసూరి. అనుదినం పత్రిక..." అతడిమాటలింకా పూర్తికాలేదు.

 

    వెళ్ళిపోతున్న రామసూరిని వేగంగా చేరుకున్నాడు యశస్వి.

 

    రామసూరిని ప్రత్యక్షంగా చూసినప్పుడు గుర్తుపట్టలేదేమోకాని ఎవరికీ తెలీదు అతడెంత సెన్సేషనల్ జర్నలిస్టో.

 

    ఒకనాడు ఉగ్రవాదుల్ని సంస్కరించే ప్రయత్నంలో అతి ప్రమాదభూయిష్టమైన అడవుల్లోకి అడుగుపెట్టి వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణంచేసి పోలీసులు గాలిస్తున్న తీవ్రవాదుల్ని తను ఒంటరిగా కలుసుకుని ఇంటర్వ్యూ చేసి పత్రికలలో ప్రచురించి జర్నలిజానికి కొత్త వూపునందించిన ఆ వ్యక్తిపేరు ఈ తరం మర్చిపోగలదా?  

 

    చివరికి ఏం దక్కించుకున్నాడు?

 

    ఉగ్రవాదులతో సంబంధముందన్న నేరంతో శిక్ష అనుభవించాడు. అతని కుటుంబం చూసే దిక్కులేక, ఆదుకునే నాథుడు లేక ఆత్మహత్యలతో కడతేరిపోయింది.

 

    ఈ ప్రపంచంలో సంస్కర్తల విలువ నిర్ణయించబడేది శిలువపైనే అన్న సత్యానికి సాక్ష్యంలా ఒంటరివాడిగా మిగిలిపోయాడు.

 

    యశస్వి కళ్ళల్లో మనుషులు మేధకు తోచని ఓ మహాత్ముడ్ని కలుసుకున్న తాదాత్మ్యత.

 

    "నమస్కారం! నా పేరు యశస్వి."

 

    ఒక్కబొట్టూ మిగలని ఖాళీబాటిల్ ని విసిరి "సో వాట్?" అన్నట్టుగా చూశాడు రామసూరి.  

 

    "నేనెవరో మీకు తెలిసేంతటి గొప్పవాడ్ని కాదు. కానీ మీ గురించి నేను విన్నాను. చదివాను."

 

    "నాది రాయబడేంత గొప్ప చరిత్రకాదే!" అతని మాటల్లో చిత్రమైన నిర్లక్ష్యం.

 

    "కాని మనుషుల మనసుల్లో శిలాక్షరాల్లా నిలిచిపోయిన జీవితం మీది."

 

    "అవును..." నవ్వాడు ఉన్మాదిలా. "ఈ వ్యవస్థ శిలగా మారాక రాయబడిన చరిత్రకాబట్టి అవి శిలాక్షరాలే అయివుండొచ్చు. చెప్పండి నాతో ఏమన్నా పనుందా?"