లేటు వయసులో విడాకులతో ఆరోగ్యం

 

లేటు వయసులో విడాకులతో ఆరోగ్యం

 

 

భారతీయ వివాహ వ్యవస్థలో విడాకులు చివరి అస్త్రమే కావచ్చు. కానీ పాశ్చాత్య జీవన విధానంలో అది ముఖ్య భాగమే! భాగస్వామి నచ్చకపోతే వేరుపడిపోవడం అక్కడ అతి సహజం. కానీ వివాహం వల్ల వేరు పడటం వల్ల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది పరిశోధకులకి ఎప్పుడూ ఆసక్తిగానే ఉండేది. ఇప్పుడు లేటు వయసులో స్త్రీల ఆరోగ్యం మీద వారి వివాహ బంధం ఎలాంటి ప్రభావం చూపుతుందా అని ఓ పరిశోధన జరిగింది.

రుతుక్రమం నిలిచిపోయిన స్త్రీలలో అనేక సమస్యలు తలెత్తుతాయి. వారి శరీరంలోని హార్మోనుల పనితీరులో అనేక మార్పులు వస్తుంటాయి. కానీ వివాహం అయిన స్త్రీలతో పోల్చుకుంటే, ఒంటరి స్త్రీలు కాస్త ఆరోగ్యంగా ఉన్నట్లు తేలడం ఆశ్చర్యకరం. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు అమెరికా పరిశోధకులు  79 వేల మంది స్త్రీల ఆరోగ్యాన్ని మూడేళ్లపాటు నిశితంగా గమనించారు. వీరి ఆహారపు అలవాట్లనీ, వారి ఎత్తుకి తగిన బరువునీ (BMI), శారీరక శ్రమ చేసే తీరునీ నమోదు చేశారు.

ఇతరులతో పోలిస్తే విడాకులు తీసుకున్న స్త్రీలు బరువు తగ్గినట్లు తేలింది. పైగా వీరు శారీరిక శ్రమ కూడా అధికంగా చేస్తున్నట్లు గమనించారు. పెళ్లి పెటాకులైపోయిందన్న డిప్రెషన్తోనే ఇలా చేస్తున్నారనడానికి మాత్రం తగిన ఆధారాలు లేవంటున్నారు. లేటు వయసులో విడాకులు తీసుకోవడం వల్ల, తమ ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంటుందనీ... తినే ఆహారం, చేసే వ్యాయామంలోనూ తగినన్ని మార్పులు చేస్తారనీ అంటున్నారు. పైగా పెళ్లయిన వారు, అందులోనూ కొత్తగా పెళ్లయినవారు భర్తతో కలిసి భోజనం చేస్తూ... తాము ఎంత తింటున్నామో గమనించుకోరు. విడాకులు తీసుకున్నవారిలో ఈ సందర్భం ఎలాగూ ఉండదు.

అదీ విషయం! ఇన్నాళ్లూ వివాహ బంధం వల్ల ఉన్న లాభాల గురించే పరిశోధనలు జరిగాయి. కానీ ఇప్పుడు విడాకులు తీసుకోవడం వల్ల కూడా కాస్తా కూస్తో లాభం ఉందని ఈ పరిశోధన తేలుస్తోంది. అలాగని ఓ నాలుగైదు కిలోల బరువు తగ్గడం కోసం విడాకులు తీసుకోమన్నది పరిశోధకుల సూచన కాదు. ఏ వయసులో ఉన్నా, ఎలాంటి బంధంలో ఉన్నా ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ తీసుకుంటూ ఉండాలన్నదే వీరి అభిమతం. మితమైన ఆహారం తీసుకోవాలి, అందులో తగినన్ని పోషకాలు ఉండాలి, ఆ పోషకాలు ఒంటికి పట్టేలా వ్యాయామం చేయాలి... ఇవే ఏ ఆరోగ్య నిపుణుడైనా అందించే సలహా! కాకపోతే ఇకమీదట శ్రీవారు బరువు పెరిగిపోతున్నావంటూ ఎగతాళి చేస్తే.... ‘విడాకులు తీసుకుంటే సరి నా బరువు తగ్గిపోతుంది,’ అంటూ ఘాటైన జవాబు చెప్పేయొచ్చు.

- నిర్జర.