ప్రకాశం ఆదుర్దాగా ఫోన్ లాక్కుని, "అన్నయ్యా.... ఇచ్చి వెళ్ళిపోవడానికి వచ్చాడు, అంతే! రాధతో అసలు మాటైనా మాట్లాడలేదు. ఒట్టు!" అన్నాడు.
    
    సుబ్బారాయుడు గంభీరంగా "అక్కడ ఉంటే ఓసారి పిలు, మాట్లాడాలి!" అన్నాడు.
    
    "అది కాదన్నయ్యా!" అని ప్రకాశం ఏదో చెప్పబోతుంటే....
    
    "పిలవమన్నానా?" అన్నాడు.
    
    ప్రకాశం మాధవ్ కి సైగచేసి ఫోన్ ఇచ్చాడు.
    
    "హలో...మావయ్యా! నమస్తే!" అన్నాడు మాధవ్.
    
    సుబ్బారాయుడు "బుజ్జిగాడికి ఫోన్ ఇచ్చినందుకు థాంక్స్! నువ్వు పెట్టిన షరతులను నేను గౌరవిస్తున్నాను. అలాగే నువ్వూ మాటమీద నిలబడతావని అనుకుంటున్నాను!" అన్నాడు.
    
    "తప్పకుండా.... చిన్నమావయ్యకిస్తున్నాను" అని ప్రకాశానికి ఇచ్చి మాధవ్ వెనక్కి తిరిగి చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు.
    
    అతడు మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తూండగా "మాధవ్!" అన్న పిలుపు వినిపించి తల తిప్పి చూశాడు.
    
    శాంత నిలబడి ఉంది. "ఇంకా ఐదు నెలలు బుజ్జిగాడ్ని ఎలా ఏమార్చాలా అనుకున్నాను నువ్వు రక్షించావు....అందుకు నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే!" అంది.
    
    "కృతజ్ఞతలు అయినవాళ్ళకి చెప్పుకోవడం మొదలుపెడితే.... రోజంతా ఆ మాటే చెప్తూ కూర్చోవాలి. అయినా, ఇచ్చినది మర్చిపోవడం తీసుకున్నది గుర్తుంచుకోవడం అనుబంధాల్ని నిలబెడుతుంది. అలా అయితే మీనుంచి నేనే ఎంతో తీసుకున్నాను.... ఇంకా తీసుకుంటాను కూడా! వస్తా" అని బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.
    
    మనిషికీ మనిషికీ మధ్యనున్న గోడలలో జాగ్రత్తగా చూస్తే అర్ధం చేసుకోవడానికి అర్ధాలున్నాయి అనిపించింది శాంతకి.
    
                                                           * * *
    
    గణపతి ఆరోజు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. చుట్టుపక్కల ఊళ్ళల్లో తిరిగి అయిదుగురిని ప్రొడ్యూసర్స్ చేయగలిగాడు. అంటే వందమంది పూర్తయ్యారు. బంధువులని ఎవర్నీ ఇంకా అడగనేలేదు. రేపటి నుండి పిన్నులందరి దగ్గరికీ వెళ్ళాలి. మిగులూ తగులూ ఉంటే పెద్ద మావయ్య ఉండనే ఉన్నాడు అనుకున్నాడు.
    
    సన్నగా ఈలవేస్తూ చెరువు కట్ట దగ్గరనుండి వస్తూంటే గాజులమలారం పట్టుకుని వెళ్తున్న మల్లయ్య కనిపించాడు. రంగురంగుల గాజులు.... ఇంద్రధనుస్సు నేలకి దిగివచ్చినట్లుగా ఉన్నాయి. అతనికి మనసులో తిలక మెదిలింది. తీర్ధంలో కొమ్ముబూరలు చూసినా, కాలవలో కలవపూలని చూసినా, చెంగున ఎగిరే తువ్వాయిని చూసినా.... గోధూళివేళ ఆకాశాన్ని చూసినా ఎంతగా సంతోష పడుతుందీ! ఆ ప్రయత్నంగా జేబు తడుముకున్నాడు.
    
    నిన్న సందెవేళ "గణపతీ..." అని పిలిచి ఓ చీటి ఇచ్చి తుర్రున పారిపోయింది. అప్పటినుండీ చదువుదామని ప్రయత్నిస్తూనే ఉన్నాడుకానీ, కుదరడంలేదు, సాయంత్రం చిన్నత్తయ్య కొబ్బరిమట్టలు కోసి నాగయ్యగారింట్లో ఇచ్చిరమ్మంది. వచ్చాక చదువుదామంటే అమ్మమ్మ మంచం కుక్కి అయిపోయిందిరా నాయనా! కాస్త సాయం పట్టు!" అంది.
    
    వాతల తాతయ్యతో కలిసి అది నేస్తూ కూర్చున్నాడు. ఇంతలో చిన్నమావయ్య వచ్చి చుట్టలు తెచ్చి పెట్టమన్నాడు. అవి తెచ్చిపెట్టాక అమ్మ అన్నానికి రమ్మంది. అన్నం తినగానే తిరిగి తిరిగి వచ్చిన తనకి నిద్రపట్టేసింది.
    
    పొద్దుట లేచి చదువుదామంటే రాధ లేగదూడకి గడ్డిపరకలు లేవని ఆ పనిమీద పరుగులు తీయించింది. వచ్చేసరికి బుజ్జిగాడు అరుగుమీద నుండి పడి దెబ్బ తగిలించుకున్నాడని అత్తయ్య డాక్టర్ గారింటికి తీసుకెళ్ళమంది. వచ్చీరాగానే ఓ ముద్ద తిని సైకిలెక్కి ప్రొడ్యూసర్ల వేటకి బయలుదేరాడు..... ఏమైతేనేం..... భగీరథ తన సామర్ద్యానికి చాలా సంతోషిస్తాడు. ఇంత తక్కువ వ్యవధిలో ఇందర్ని ఒప్పించి డబ్బులు సమకూర్చడం ఎవరి తరం? ఇదంతా తిలకిచ్చిన ప్రోత్సాహం అనుకోగానే అతనికి మనసంతా కృతజ్ఞత నిండి ఆమెకేదైనా బహుమానం ఇవ్వాలనిపించింది. అదే సమయానికి గాజుల మల్లయ్య కనిపించాడు.
    
    అప్పటికి ఆ ఉత్తరం సంగతి మర్చిపోయి గణపతి మల్లయ్యని పిలిచి, "మంచి గాజులు చూపించు!" అన్నాడు.
    
    మల్లయ్య నవ్వి, "పెళ్ళిచూపుల గాజులా...సీమంతం గాజులా... బారసాల గాజులా?" అన్నాడు.
    
    "ఛ! ఇన్ని రకాలుంటాయా?" బుర్ర గోక్కున్నాడు గణపతి.
    
    మల్లయ్య నవ్వి, "మరదలికా.... చెల్లెలికా.... అమ్మకా.... అత్తకా? వాటిలో కూడా తేడాలుంటాయి బాబూ!" అన్నాడు.
    
    అతను చెప్పిన ఏ కోవలోకీ తిలక రాదు. ఏమని చెప్పాలీ అని ఆలోచించి, "మల్లయ్యా! నువ్వు చెప్పిన వాళ్ళెవరూ కాకపోతే ఏ గాజులిస్తావు?" అన్నాడు.
    
    "అదా సంగతి!" మల్లయ్య గలగలా నవ్వి ప్రేయసీ గాజులు ఇస్తాను బాబూ! ఇవిగో ... బావున్నాయా?" అంటూ చెమ్కీ పూలున్న రంగురంగుల గాజులు తీసిచ్చాడు.
    
    "ఏ రంగు తీసుకోనూ?" అన్నాడు గణపతి.
    
    "ఎరుపు ... కోరికని తెలుపుతుంది బాబూ! ఆకుపచ్చ సౌఖ్యాన్నీ, పసుపు శుఖాన్నీ, నీలం ఆనందాల్ని... తెలుపు శాంతినీ.... నలుపు చెడుదృష్టి తగలకుండా! కాబట్టి అన్నీ తీసుకోండి!" అన్నాడు.
    
    "మరివీ?" బంగారు రంగులో మెరుస్తున్న వాటిని చూపించి అడిగాడు గణపతి.
    
    "కళ్యాణం గాజులు బాబూ! బతుకంతా బంగారం చేస్తానని చెప్పడానికివ్వాలి!" అన్నాడు మల్లయ్య.
    
    గణపతి నవ్వి, "ఏదీ వదులుకోడానికి వీల్లేకుండా చెప్పావు మల్లయ్యా! గొప్ప వ్యాపారస్తుడివే! అన్ని రకాలూ తలో డజనూ కట్టియ్యి" అన్నాడు.
    
    గణపతి కళ్ళల్లో ఆ గాజులు వేసుకుని మురిసే తిలక నాట్యమాడింది.
    
                                                              * * *
    
    ఇంటిముందు సైకిల్ దిగి ఓరగా పెట్టి ఆత్రంగా గాజుల పొట్లంతో లోపలికి రాబోతుంటే అతనికి తిలక ఎదురుపడింది. ఒట్టి చేతులతో కాదు. ఆమె చేతుల్లో సూట్ కేసు ఉంది.
    
    "జాగ్రత్తమ్మా.... వెళ్ళగానే జాబు వ్రాయి!" అంటోంది శాంత.
    
    రాధ కళ్ళనిండా నీళ్ళతో "తిలకా! నువ్వు లేకుండా ఎలా? తోబుట్టువులు లేని లోటు మరిపించావు!" అంది.
    
    గణపతి అయోమయంగా చూశాడు.
    
    తిలక తాయారమ్మ మంచం దగ్గరకి వచ్చి "వెళ్లొస్తాను నానమ్మా" అంటూ ఆవిడ కాళ్ళకి నమస్కరించింది.