"ఓసేవ్... బ్రతకాలనుకుంటే బయటికి పో. కనీసం విడాకులైనా ఇవ్వటానికి సిద్ధపడు. లేకపోతే నువ్వు బ్రతికినంతకాలం ఈ చావు తప్పదు" పాశవికమైన విజయగర్వంతో ఆమె జుట్టుపట్టుకుని ముందుకు లాగేడు. చూడూ, ఎప్పటికన్నా మా ఇంటి కోడలయ్యేది కామేశ్వరి. ఈసారి నువ్వుగాని ఈ యింటిలో మరెవరైనాగాని కామేశ్వరిని పల్లెత్తు మాటంటే నరికిపోగులేస్తాను" హెచ్చరించి వెళ్ళాడు.

 

    ఉన్నదంతా వూడ్చిపెట్టి తర్వాత లోకాన్ని విడిచిపెట్టిన తండ్రినీ, బాధల్ని భరించే సహనం తప్ప మరేమీలేని తన స్థితినీ తలచుకుంటూ పావని తూలుతూ నడిచి మామయ్య పాదాలపై వాలిపోయింది.

 

    చేయని నేరానికి శిక్షింపబడిన సీతలా ఆర్తిగా అశ్రువుల్ని రాల్చే ఓ అనసూయలా కనిపిస్తున్న పావని కన్నీళ్ళు పాదాల్ని అభిషేకిస్తుంటే లాలనగా తలని నిమరటానికి సహకరించని శరీరాన్ని తలచుకుంటూ ఆయనా కంటతడి పెట్టాడు.

 

    "నీ శోకాన్ని శ్లోకాలుగా మరో కావ్యసృష్టి చేయగల అసమర్థుడినైన పండితుడనేకాని నిన్ను ఊరడించే శక్తి నాకెక్కడిదమ్మా? నీ గాయాలని పలకని గేయాలుగా గొంతులో దాచుకోగలనే తప్ప నీ కథని మరోమలుపు తిప్పగల చేవ నాకెక్కడిదమ్మా... మహర్షినయితే శపించి వాడిని భస్మం చేసేవాడ్ని. రాక్షసుడ్ని అయినా వెంటాడి వాడిని సంహరించేవాడ్ని. ఏమీ లేని నేను నీకేం న్యాయం చేయగలను?"

 

                                      *    *    *

 

    అపరాత్రి గడిచింది.

 

    కరిగిపోతున్న మరో కాళరాత్రిలో బిక్కుమంటూ తనను చుట్టేసిన తల్లిని చూస్తూ "నేను అరగంటలో కరెక్ట్ గానే లెక్కపెట్టానమ్మా" అంటున్నాడు నాని.

 

    వడలిన శరీరం యింకా పూర్తిగా రాలిపోలేని తన దౌర్భాగ్యానికి కుమిలిపోతున్నట్టు పావని బాధగా మెలితిరిగిపోతూంది.

    "ఒట్టమ్మా... నీతోడు... నేను తప్పులేకుండా లెక్కపెట్టాను."

 

    "నీ ఒళ్ళెందుక్కమిలిందమ్మా" అని నాని అడిగితే వాస్తవాన్ని మరుగుపరిచి "నువ్వు తప్పు లెక్కపెట్టినందుకే ఇలా జరిగింది" అంది. ఆమె చెప్పిన అబద్ధానికి ఏడుస్తూ సంజాయిషీ యిస్తున్నాడు.  

 

    "పోనీలే... పడుకో" అంది నీరసంగా.

 

    "ముందు నువ్వు పడుకో."

 

    ఒక తండ్రిలా లాలిస్తున్నాడు.

 

    నవ్వింది మృదువుగా అంత బాధలోనూ...

 

    "పోనీ నాకు నిద్రరానప్పుడు పాడతావే ఆ పాట నేను పాడనా..."

 

    "ఏ పాట" నానికి దుఃఖం ముంచుకొచ్చింది.

 

    "ఏడవకు... ఏడవకు... వెర్రి నా తల్లీ... ఏడిస్తే... నీ కళ్ళ..." వెక్కిపడుతున్నాడు.

 

    "ఏడిచే పావని నిద్రపుచ్చాలని జోలపాడేవాళ్ళు అలా ఏడుస్తారా" అంది. కళ్ళు తుడుస్తూ "జో కొట్టవూ"

 

    అమ్మ తలని ఒడిలోకి తీసుకున్నాడు "ఏడిస్తే నీ కళ్ళ నీలాలు రాలు... తొలుత బ్రహ్మాండంబు తొట్టెగావించే... నాలుగూ వేదముల... గొలుసులమరించే... జో... జో"

 

    అలిసిపోయాను నాన్నా... తొందరగా వెళ్ళిపోవాలనుంది. పోయి నీ కడుపున కూతురై పుట్టాలనుంది. కనుకొలుకుల్లో నిలిచిన నీళ్ళు ఆవిరౌతుంటే నాని చిట్టిచేతుల స్పర్శకి క్రమంగా పావని మగతలోకి జారిపోయింది.

 

    పావుగంటసేపు అమ్మనలాగే చూస్తూ వుండిపోయాడు.

 

    ఇంకా ఏడుపొస్తూంది. అయినా తమాయించుకుని పడుకుంటుండగా అప్పుడు వినిపించాయి బయట గుసగుసలేవో...

 

    నానీ నిశ్చేష్టుడై వుండిపోయాడు అరక్షణంపాటు.

 

    మళ్లీ గాజుల చప్పుడు...

 

    భయంగా వుంది ఒంటరిగా బయటకెళ్ళడానికి...

 

    అయినా అమ్మను లేపలేదు.

 

    నెమ్మదిగా ద్వారం తెరిచాడు.

 

    ఆ చిరుచప్పుడుకే పెనవేసుకున్న రెండు ఆకారాలు ఉలికిపాటుగా దూరం జరిగాయి.

 

    అప్పుడు వీధిలాంతరు వెలుగురేఖలో చూశాడు.

 

    "సరళత్తయ్య"

 

    కంగారుగా చీరని చుట్టేసుకున్న సరళ తత్తతపాటుగానే ఎదుట వ్యక్తికి ఏదో సంజ్ఞ చేసింది.

 

    అంతే...

 

    ఓ బలమైన చేయి నాని కంఠాన్ని చుట్టి వేగంగా బయటకు లాగింది.

 

    "అరక్షణంపాటు నాని గిలగిలా కొట్టుకున్నాడు."

 

    ఆ చిన్నిప్రాణం నోటినుంచి రాబోయిన 'అమ్మా' అన్న పదం గొంతులోనే సమాధి అయిపోయింది.

 

    ఆ పెనుగులాటలోనే బయటి విద్యుద్దీపపు కాంతిరేఖ గొంతు నులుముతున్న వ్యక్తిమొహంపై పడగా గుర్తుపట్టేశాడు అతను ఎదురింటి రాజారావని.

 

    ప్రాణాలు కడగంటిపోతున్నాయి.

 

    కళ్ళు తేలేస్తూ చిన్నగా మూలిగాడు. ఆ మూలుగు ఒక పాశుపతంలా సాగి నిద్రపోతున్న పావన్ని తట్టిలేపడం నాని చేసుకున్న అదృష్టం.

 

    ఆ మొగ్గ కథ ముగిసిపోకముందే పావని వరండాలోకి పరుగెత్తుకొచ్చింది.

 

    "వదులు" ఓ అరుపుతో అతణ్ని దూరంగా నెట్టి తోటకూరకాడలా నేల కూలుతున్న నానిని అక్కున చేర్చుకుంది.

 

    "అ... మ్మా" ప్రకంపించిపోతూ తల్లిని చుట్టేశాడు నీరసంగా.

 

    ఆలస్యం చేయలేదు రాజారావు. ఇరుగుపొరుగు నిద్రలేవకముందే పారిపోవాలనుకుంటూనే ఇంట్లోనుంచి వస్తున్న కాంతమ్మను ఢీ కొన్నాడు.

 

    ఎదురుగా వున్న వ్యక్తుల్ని చూడగానే చాలావరకూ బోధపడిపోయింది కాంతమ్మకు.

 

    "అ... మ్మా" ఏదో చెప్పబోయిన సరళ చెంపపై చాచికొట్టింది కాంతమ్మ. "ఇందుకా నువ్వు ఇక్కడికి చీటికీ మాటికీ పరుగెత్తుకొస్తున్నావు అప్రాచ్యపు ముండా"తల కొట్టుకుంది.

 

    అశ్రుశిక్త నయనాలతో నానిని చూస్తూ తనను శాపగ్రస్తురాలిగా మార్చని దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు అర్పించుకున్న పావని క్రమంగా తేరుకుని నెమ్మదిగా తలతిప్పి చూసింది.

 

    "సరళా" జుగుప్స ధ్వనించింది పావని గొంతులో. "ఈ ఇంటి కోడలిగా నాకు అణువంత అధికారమే వుంటే నిన్నిక్కడే పాతర వేసేదాన్ని. లేని నాకు నీలాంటి బరితెగించిన ఆడది నాకు ఆడపడుచు అయినందుకు సిగ్గుతో నాకు నేను ఆత్మాహుతి చేసుకునేదాన్ని. అయినా ఇంకా రంకెలు వేయకుండా కోపాన్ని గొంతులోనే దాచుకుని ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నా నూ అంటే కారణం నీలాంటి కులభ్రష్టురాల్ని కన్న ఆ మహాత్ముడు నాకు నేర్పిన సంస్కారం. అవును... అదే... అదే నన్ను అదుపు చేస్తున్నది కూడా. నిన్నీ అర్థరాత్రివేళ బజారున పెట్టకపోవటానికి కాని, నీ అర్థరాత్రి భాగోతాన్ని మందుకొట్టి పడుకున్న నీ అన్నకి సోదాహరణంగా చూపించకపోవడానికిగాని నేను సిద్ధపడడంలేదూ అంటే నీమీద జాలిపడికాదు. మంచంపట్టిన ఆ మహర్షికి సత్యం తెలిస్తే ఆ సత్యం తెలిసిన క్షణమే ఆయనకీ చివరి క్షణమవుతుంది కాబట్టి. ఇక్కడ నేను చర్చిస్తున్నది పూలకి చుట్టిన నారకూడా వాసన పొందినట్టు ఆ వేదబ్రహ్మ సమక్షంలో బ్రతికిన మీకు ఆ సంస్కారం ఎందుకబ్బలేదూ. మీరెందుకిలా తయారయ్యారూ అన్నదికాదు" ఒక్కక్షణం ఆగింది. నెలల తరబడి పేరుకున్న ఉక్రోషాన్ని అదుపు చేసుకుంటున్నట్టుగా.