"బాధపడకండి" అన్నాను. "మీరిలా ఆవేశపడకూడదు. జబ్బు నిమ్మదించటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను."    
    "ఇబ్రహీంపట్నంలో వుండగా ఆంజనేయస్వామి గుడి కట్టించాను కొండ యెగువను నేను యెన్ని చెడు తిరుగుళ్ళు తిరగనీ, దైవమంటే నాకు పరమభక్తి. ఆయన కృపలేనిదే ఏమీ జరగదు."    
    ఆయన్ని యెంత మాట్లాడవద్దని వారించినా యిలా యేదో బాధ వ్యక్తం చేసుకుంటూనే వున్నాడు. మధ్య మధ్య అనసూయమీద విసుక్కుంటూనే వున్నాడు. "ఇదిగో పాడుదానా! ఓ దెయ్యమా! ఉక్కబోసి చస్తున్నాను. ఆ విసనకర్రతో కాస్త విసరవే"    
    పాపం అనసూయ...!        
    అవును నేను యేమిటో ఆమెను 'పిన్నీ' అని సంబోధించలేకుండా వున్నాను! పరాయి స్త్రీవలే "అనసూయ-అనసూయ" అంటున్నాను!    
    ఆమె తన విశాల నేత్రాలనెత్తి నావంక చూసి "ఈ పూట ఏం చెయ్యమంటారు డాక్టర్?" అంది.    
    నా అనుమానాన్ని యెలా వ్యక్తం చేయాలో బోధపడటంలేదు. ఆయనకు ధైర్యంచెప్పి యివతలకు వచ్చాక అనసూయతో అన్నాను. "యిది తప్పకుండా కాన్సర్. గుండెల్లో నీరు పడుతుంది. ప్రతి రెండు మూడు రోజులకూ తీయించేసుకుంటూ వుండాలి."    
    "ఎంతకాలం వరకూ?"    
    ఉలికిపడి "కొంతకాలం వరకూ" అన్నాను.    

    "ఓహో" అని ఆమె తల యెగురవేసి ఊరుకుంది.    
    ఆ తర్వాత నేను రోజూ వాళ్ళ ఇంటికి పోయివస్తూనే వున్నాను. ఇంచుమించు ఓ గంటసేపు అక్కడ గడిపేవాడిని. ఆయన మొదటిరోజున మాట్లాడినంత విచ్చలవిడిగా మాట్లాడటం తగ్గించాడు. ఎల్లప్పుడూ జీవితంమీద విరక్తి ప్రకటించేవాడు. "దీనివల్ల నా కష్టాలన్నీ ప్రారంభమైనాయి" అనేవాడు. లేదా తన జబ్బుగురించి. తాను పడుతున్న బాధలను గురించీ చెప్పుకునేవాడు. ఆమె తనకు సరిగ్గా ఉపచర్యలు చేయటంలేదని గొణిగేవాడు.    
    దేవాలయంలో ఆమెను తొలిసారి చూసినప్పుడు కలిగిన భావవల్లరిని తలచుకొని సిగ్గుతో కుంచించుకు పోతూండేవాడిని. ఆమె ఇప్పుడూ తరచూ దేవాలయానికి వస్తూనే వుంది. కాని ఆశ్చర్యం, అప్పుడక్కడ ఆమెను చూస్తుంటే యెవరో క్రొత్తవ్యక్తిని, పవిత్రమూర్తి అయిన అపరిచితురాలిని చూస్తున్నట్లుగా వుండేది. మాట్లాడుకునేవాళ్ళం కాదు. పలుకరిస్తున్నట్లుగా చిరునవ్వు నవ్వేది. నేనూ ప్రత్యామ్నాయంగా నవ్వి వూరుకునేవాడిని.    
    ఈ ఓర్పు, ఈ భక్తి, ఈ పతిభక్తి!    
    తన అదృష్టానికి అయన పరవశుడు కాడేం! గర్వించడేం? ఆ సేవికను కారణంలేకుండా లోపాలు అంటగట్టి నిందిస్తాడేం?    
    అరె! వీళ్ళు నా బంధువులు గదా ఇలా కష్టాలు పడిపోతున్నారు. నా యిల్లు విశాలమైనది కాకపోయినా, నేనుగాక యింకా యిద్దరు సులభంగా వుండటానికి సరిపోతుంది. వీళ్ళని యెందుకు రమ్మని ఆహ్వానించకూడదు!    
    ఎలా పిలవాలో మాత్రం వాక్యనిర్మాణం కుదరలేదు. "రండి మాయింటికి, నాకేం కష్టంలేదు" అన్నాను.    
    అనసూయ నవ్వుతూ తిరస్కరించింది. మరి వీళ్ళదగ్గర డబ్బు ఏమీలేదుకదా! ఎలా నెట్టుకు వస్తున్నారు? ఒకరోజు ఆమెను "మీరివాళ భోంచేశారా?" అనడిగాను.    
    "లే" దన్నది.    
    "నిన్న?"    
    "లేదు."    
    "మొన్న?"    
    "లేదు."    
    నా గుండె ద్రవించింది. "మరి నాకెందుకు చెప్పలేదు?" అన్నాను.

    "సరదాకి చెప్పలేదు" అంది ఆమె.    
    జేబులోంచి కొంత డబ్బుతీసి "ఇది మీరు స్వీకరిస్తారా?" అనడిగాను ఖేదంతో.   
    ఆమె తలవూపి తీసుకుంది.    
    అనుదినం ఆమెతో యిన్ని సంభాషణలు యెలా నడిచేవో నాకర్ధమయేది కాదు. బహుశా ఆమెభర్తతో మినహాయించి నేనుతప్ప మరో పరాయివాడితో మాట్లాడి వుండదు. మరి ఈ చనువు, అభిమానం, స్నేహం యెలా యేర్పడింది మా యిద్దరకూ? ఏ రోజూ ఆమె దర్శనం చేసుకోనిదే మనసు బాగుండేదికాదని చెప్పటానికి సిగ్గుపడుతున్నాను.    
    ఒకరోజు ఉదయం ఎప్పటిలా పోఎసైర్కి పట్టువస్త్రం ధరించి, దేవుడి విగ్రహంముందు కూర్చుని పూజచేస్తోంది. నేనక్కడ పదినిముషాలు  నిలబడ్డా నా ఉనికిని గమనించనంతటి భక్తిలో లీనమైపోయి వుంది. పూజ సమాప్తి చెందాక మెల్లగా వెనక్కి జూచి, ఆశ్చర్యంతో "ఎప్పుడు వచ్చారు?" అంది.    
    "చాలాసేపయింది మీరు పూజలో మైమరచిపోయి వున్నారు."    
    "అవును వారికి జబ్బు త్వరగా నయం కావాలని ప్రార్ధిస్తున్నాను. త్వరగా నయమవుతుందంటారా డాక్టర్?"    
    "ముందు నన్ను "మీరు" అని, "డాక్టర్" అని పిలవడం మానండి."    
    "వద్దు మనం అలానే పిలుచుకుందాం. మీరు చాలా పాతధోరణిలో మాట్లాడారు. మీరు నన్ను "పిన్నీ" అని పిలవడానికి ఎందుకు జంకుతున్నారో నేనూ అందుకే ఉపేక్షిస్తున్నానని ఎందుకు అనుకోకూడదు?"    
    అప్పుడు నేను సిగ్గువిడచి చెప్పాను. "నేనలా మిమ్మల్ని నా పిన్నికంటే అధికంగా అమితంగా ప్రేమిస్తున్నాను."

    "ఒప్పుకున్నాను" అని ఆమె నవ్వి "అంతేగాకుండా కొద్దివ్యవధిలో ఆప్తులైన వాళ్లు అలా పిలుచుకుంటుంటే పుస్తకాలలోని పాత్రలు పిలుచుకుంటున్నట్లుగా వుంటాయి."    
    ఆమె తరుచు యిలానే మాట్లాడుతుంది గుండె భగ్గుమనేటట్లు.