గోపాల్రావు లేచి నిలబడ్డాడు.

 

    "ఎలాగూ యాభయి అయిదేళ్ళ స్కీములో చాలా మంది డాక్టర్లు రిటైర్ అయ్యారు. కనుక వాళ్ళలో ఓ మాంచి డాక్టర్ ని మన కాలనీ కోసం ప్రత్యేకంగా నియమిస్తే బాగుంటుంది."

 

    "అవునవును" అన్నాడు రాజాచారి.

 

    "మరి ఆ డాక్టర్ జీతం ఎవరిస్తారు!" రామచందర్రావు లేచి పొట్ట నిమురుకుంటూ అడిగాడు.

 

    "ఎవరేమిటి? మనందరం. కాలనీలో ఇంటికి అయిదు రూపాయలు చొప్పున వసూలు చేస్తే డాక్టర్ కి నెలకి పన్నెండొందల జీతం ఇవ్వవచ్చు."

 

    ఆ సూచనకు అంతా హర్షధ్వానాలు చేశారు.

 

    "నిజంగా ఆ గోపాల్రావుది చాలా తెలివిగల బుర్ర" అని ఒకావిడ గట్టిగానే అనడం వినిపించి గోపాల్రావ్ మరింత గర్వంగా అందరివేపూ మెరుస్తున్న కళ్ళతో చూడసాగాడు.

 

    "నన్నడిగితే ఆ డబ్బు డాక్టర్ కిచ్చే బదులు - ఇంకేదయినా ఉపయోగకరమయిన కార్యక్రమానికి ఖర్చు చేయడం మంచిది. అసలు మనదేశంలో డాక్టర్లే ఓ పెద్ద లగ్జరీ. దానికితోడు జీతాలు ఇవ్వడం కూడానా!" అన్నాడు రామచంద్రం.

 

    అంతా రామచంద్రాన్ని అర్జంటుగా కూర్చోమని కేకలు వేశారు.

 

    "నీకేం నాయనా! శనివారం నాకు కూడా వదలకుండా కోడికూర తింటావ్! తాతలు సంపాదించిన ఆస్తి వుంది. ఇక రోగమా, రొస్టా- డాక్టర్లతో పనేముంటుంది నీకు." అంది రాజేశ్వరి సాగదీస్తూ.

 

    "సరే మీ ఇష్టం, తరువాత మీరే భోరున ఏడుస్తారు?" అనేసి పొట్ట నిమురుకుంటూ కూర్చున్నాడు రామచంద్ర.

 

    రెండు రోజులపాటు వెతికి వెతికి చివరకు రిటైరయిన చాకు లాంటి డాక్టర్ ని నెలకి పన్నెండొందల జీతానికి మాట్లాడి తీసుకొచ్చారు జనార్థనూ, శాయిరామ్ కలిసి. ఆయన కాలనీకి రావడమే అందరి ఆరోగ్యం చెక్ చేశాడు. ఆ తరువాత మీటింగ్ ప్రారంభమయింది.

 

    "కాలనీ అంతా చూశాక నాకు చాలా లోపాలు కనిపించాయి. చదువుకున్నవారై ఉండికూడా ఎవ్వరూ నీళ్ళు కాచి తాగడం లేదు. మనిషికొచ్చే జబ్బులలో నూటికి తొంభయి ఎనిమిది కేవలం నీళ్ళు కాయకుండా తాగడం వల్లే వస్తాయి. కనుక రేపటి నుంచీ అందరూ నీళ్ళు కాచి తాగుతారని ఆశిస్తాను. నేను చిన్నప్పటి నుంచీ కాచిన నీళ్ళే తాగడం అలవాటు చేసుకున్నాను. ఫలితం ఏమిటో తెలుసా? ఈ రోజు వరకూ నాకు జలుబు కూడా చేయలేదు."

 

    అంతా తప్పట్లు కొట్టారు.

 

    మర్నాటి నుంచి నీళ్ళు కాచి తాగే కార్యక్రమం మొదలయింది. అయితే తాగేప్పుడు కొందరు కళ్లు మూసుకుని తాగితే కొంతమంది వాంతి కాకుండా పచ్చడి పక్కన పెట్టుకుని మరీ తాగుతున్నారు.

 

    ఆ తరువాత వారం అందరికీ మెడికల్ చెకప్ చేసే కార్యక్రమం జరిగింది.

 

    మళ్ళీ సమావేశం ఏర్పాటు చేశాడు శాయిరాం.

 

    డాక్టరు గారు మైక్ దగ్గరకొచ్చి ఉపన్యాసం ప్రారంభించారు.

 

    "అందరినీ చెకప్ చేశాక నేను మీలో కొన్ని ఘోరమయిన లోపాలు కనుక్కున్నాను. మీలో చాలా మందికి ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా తెలీదు. ఉదాహరణకి ఆహారపుటలవాట్లు. చాలా మంది పాలకూర తింటున్నారు. పాలకూర ఆరోగ్యానికి చాలా హానికరం. కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి అది తింటే."

 

    ఆ మాటలతో అందరిలోనూ కలకలం బయలుదేరింది.

 

    కొద్ది రోజుల క్రితమే మా కాలనీలో రమణారావు అనే అతని కిడ్నీలో రాళ్లుండడం వల్ల ఆపరేషన్ జరగడం, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు రాళ్ళతోపాటు పొరబాటున కిడ్నీ కూడా తీసేయడం- అతను అర్జంటుగా పైకెళ్ళిపోవటం జరిగింది.

 

    "అదేమిటి డాక్టరుగారూ, ఆకుకూరలు విరివిగా వాడాలని టీవీలో ఆవిడెవరో మరీమరీ చెప్పిందిగా" అంది జయప్రదాదేవి ఆందోళనగా.

 

    "అవును రేడియోలో కూడా చెప్పారు." అంది ప్రభావతి.

 

    "ఆ చెత్త టీవీలు, రేడియోలు ఏమి చెప్పాయన్నది కాదు నాక్కావలసింది. నేను ఒక బాధ్యతాయుతమైన డాక్టర్ గా చెప్పేదేమిటంటే మీరెవరూ పాలకూర తినకూడదు. అది చిన్నప్పటి నుంచి తినకపోబట్టే నేను ఎలాంటి కిడ్నీ రాళ్ళు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాను."

 

    అంతా నిశ్శబ్దం అయిపోయారు.

 

    "అంతేకాదు, ప్రతివారూ రోజూ టమాటోళు వాడుతున్నట్లుగా కూడా నాకు తెలిసింది. అది కూడా గాల్ బ్లాడర్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు, కనుక దాని వాడకం కూడా వెంటనే తగ్గించండి."

 

    ఈసారి హాహాకారాలు పెద్దఎత్తున చెలరేగాయి. అందరూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

 

    "నేను నమ్మను" అన్నాను గోపాల్రావు.

 

    "ఈ విషయంమరి ఇంతవరకు ఏ డాక్టరూ చెప్పలేదేం?" అరిచాడు శ్రీనివాసరావ్.

 

    "ష్" అరిచాడు డాక్టర్.

 

    "అలా గట్టిగా అరవకండి. గట్టిగా అరవడం- అరుపులు వినడం కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రతిమనిషికి యాభయి డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాలు చేరకూడదు. అంతకంటే ఎక్కువ డెసిబుల్స్ వింటే చెవులు పనిచేయవ్"

 

    అంతా నిశ్శబ్దం.

 

    శబ్దం చేయకుండా అంతా భయం భయంగా ఎవరి ఇళ్ళకు వాళ్ళు బయల్దేరారు. ఆ రోజు నుంచి పాలకూర- టమాటోలు కాలనీ కెదురుగ్గా ఉన్న కూరగాయల షాపుల్లో కనిపించడం మానేసినయ్.

 

    వారం రోజులయినా గడవకముందే డాక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఓ సాయంత్రం.

 

    బిక్కుబిక్కుమంటూ వెళ్ళారందరూ.

 

    ఆయన చేతిలో ఏవో సైన్స్ సంబంధించి పుస్తకాలున్నాయ్.

 

    "మీరు నాకు పన్నెండువందల జీతం ఇస్తున్నప్పుడు- ఆ జీతం విలువకు సరిపడేంత సేవ మీకు చేయాలి. తప్పదు. అందుకే అన్ని సైన్స్ పిరియాడికల్స్ ఫాలో అవుతున్నాను. ఈ మధ్యనే వెలికి తీయబడ్డ కొన్ని నిజాలు తెలుసుకోండి.

 

    వంకాయలు ఎక్కువగా తింటే ఆస్తమా వస్తుంది.

 

    నూనెలో వేయించిన పదార్థాలు ఎక్కువగా తింటే కేన్సర్ వస్తుంది.

 

    ఉప్పూ, కారం, పులుపూ ఎక్కువగా తింటే అల్సర్ వస్తుంది. లేదా బి.పి. వస్తుంది.

 

    కనుక ఈ రోజు నుంచీ అందరూ ఈ నియమాలు పాటించి కాన్సర్ నుంచి రక్షణ పొందుతారని ఆశిస్తాను. నేను ఇవన్నీ చిన్నప్పటినుంచి ఫాలో అవబట్టే ఇంతవరకు ఎలాంటి అల్సర్లూ, కేన్సర్లూ లేకుండా సుఖంగా ఉన్నాను-"

 

    సమావేశం ముగిసింది.

 

    అందరూ బరువెక్కిన హృదయాలతో ఇళ్ళు చేరుకున్నారు.

 

    ఆ తరువాత రెండు వారాల పాటు డాక్టర్ గారు అందరిళ్ళకూ లేటెస్టు మెడికల్ బులెటిన్స్ పంపించసాగారు.

 

    1. ఉల్లిపాయలు వాడడం వల్ల గుండె జబ్బులు వచ్చును.

 

    2. బీరకాయలు తినడం వల్ల లో బ్లడ్ ప్రెషర్ వచ్చును.

 

    3. మాంసం తినడం వల్ల పక్షవాతం మరియు గుండెపోటు తప్పదు.

 

    4. కోడిగుడ్లు, గడ్డపెరుగు తినడం వల్ల హార్ట్ ఎటాక్ కేరింతలు కొడుతూ వస్తుంది.

 

    5. దుంపకూరలు లివర్ కి సంబంధించిన వ్యాధుల్ని ప్రోత్సహించును.

 

    ఆ తరువాత రెండు వారాలు కాలనీ అంతా గగ్గోలెత్తిపోయింది. అందర కూరలు పూర్తిగా వాడడం మానేశారు. ఏ కూర వండినా ఎవరొకళ్ళు ఏదొక జబ్బు పేరు చెప్పడంతో కెవ్వున కేకవేసి కూర బయటపడేయటం జరుగుతోంది. కొంతమంది కేవలం పాలు త్రాగి బ్రతుకుతున్నారు. ఇంకొంతమంది. ఉప్పుకారం లేని పప్పు మాత్రమే వాడసాగారు.