అతను రోజూకంటే ముందుగా ఇంటికివచ్చి సైకిల్ వాకిట్లో పడేసి ఎదురుగా వచ్చిన శారదమ్మనూ, సుందరాన్ని పలకరించి 'పాపా' 'పాపా' అని పిలుస్తూ గదిలోకి వెళ్ళాడు. అతనికి చిన్నప్పట్నుంచీ సామ్రాజ్యాన్ని పాపా అని పిలవటం అలవాటు.
    
    కాని గదిలోకి అడుగుపెడుతూనే కొయ్యబారిపోయాడు. ఆమె పడుకున్న తీరు అతనికర్ధమయింది.
    
    కొన్ని చిత్రమైన సమస్యలు కొందరిలో చిత్రంగానే పరిష్కరించబడుతూ వుంటాయి. ఒక్కొక్కరు దౌర్జన్యంతో, ఒక్కొక్కరు అధికారంతో ఒక్కొక్కరు కపటత్వంతో, ఒక్కొక్కరు లౌక్యంతో, ఒక్కొక్కరు మంచితనంతో, ఒక్కొక్కరు త్యాగంతో తమ సమస్యల్ని పరిష్కరించుకుంటూ వుంటారు. మన్మథరావుకు ఎలాంటి కలచివేసే పరిస్థితి వచ్చినా ఆమెమీద కోపంకూడా రాకుండా వుండటం అలవాటు చేసుకున్నాడు. ఆమెమీద కోపం రాకూడదు. తను ఒకానొక జీవితంలో జొరపడ్డాడు. ఆ జీవితాన్ని భరించాలి అంతే.
    
    అతను వచ్చాడని ఆమెకు తెలుసు. ఈ పాపిష్టి ముఖాన్ని అతనికి చూపించి ఏం జవాబు చెబుతుంది?
    
    అతను మంచందగ్గరకు వెళ్ళి ఆమె తలమీద చెయ్యివేసి ప్రేమగా అన్నాడు. "పాపా! మళ్ళీ వంట్లో బాగాలేదా?"
    
    ఆమె ఇహ వుండబట్టలేక అతనివైపు తిరిగింది. ఆమె కళ్ళనుండి నీళ్ళు కారుతున్నాయి. "నేను పాపిష్టిదాన్ని మీ సుఖాన్ని అనుక్షణం చంపేస్తున్నాను."
    
    అతను మంచంమీద కూర్చుని ఆమె జుట్టు నిమురుతున్నాడు.
    
    "నా సుఖం నీ దుఃఖంతో కూడుకున్నదయితే అది నాకక్కర్లేదు."
    
    "మీకు ఇవ్వలేని సుఖంకన్నా నా దుఃఖమేం ఎక్కువదికాదు. అసలీ బీభత్సం, ఈ అసహ్యం, ఈ దారుణమైన లోపం... ఇవి లేకపోతే నా దుఃఖమూ వుండేదికాదు. అప్పుడే సమస్యా వుండదు.
    
    "అందరి జీవితాలు బాగుంటే ఏ ఒక్కరి జీవితమో ఎందుకు కాలిపోవాలి బావా?"
    
    "వెరైటీకోసం" అని నవ్వటానికి ప్రయత్నం చేశాడు మన్మథరావు.
    
    "ఆఁ, నీకు నవ్వు రావటంలేదు. నీకు ఇప్పుడేకాదు, ఎప్పుడూ రాదు నవ్వు. నేనంటే నీకెంత జాలో, నీకెంత ఒర్పో తలచుకుంటే ఆశ్చర్యమేస్తుంది."
    
    మన్మథరావు ఆమె  కన్నీళ్ళు తుడిచాయి. "నీ కన్నీళ్ళలో కల్తీ లేనట్లే నా నవ్వులో నటనలేదు, నమ్ము" అన్నాడు.
    
    తన కళ్ళని తుడిచిన అతని చేతిని వ్రేళ్ళతో పట్టుకుని చెంపకానించుకుని చాలాసేపు మెదలకుండా పడుకుంది.
    
    గదిబయట ఇంట్లోని మనుషుల రొద పదేపదే వినిపిస్తోంది.
    
    ఆ విషయాన్నిగురించి అంతకంటే మాట్లాడటం ఇద్దరిలో ఎవరికీ యిష్టం లేదు. కొన్ని సమస్యలుంటాయి. జీవితాంతం వాటితో పెనుగులాడుతున్నా అందుకు సంబంధించిన వ్యక్తులు, వాటితో దాగుడుమూత లాడుకోవలసిందే తప్ప తరచకూడనంతగా తరచి ప్రయోజనంలేదు. ఎప్పుడో శక్తికి మించిన సందర్భం ఉట్టిపడినప్పుడు తప్ప.
    
    "నేనలా బయటికి వెళ్ళొస్తాను" అన్నాడు లేచి నిలబడి.
    
    "కాఫీ త్రాగారా?"
    
    "త్రాగే వెళ్తానులే"
    
    గదిలోంచి ఇవతలకు వచ్చి తల్లి యిచ్చిన కాఫీ త్రాగి, మనుషుల్ని తప్పించుకుని ఇంట్లోంచి బయటపడ్డాడు.
    
    అతనికైతే ఒంటరిగా ఎక్కడైనా తిరగాలని వుంది. కాని ముందుగా థియేటర్ కు వెళ్ళి అచ్యుతరావు దంపతులకు కనిపించి రావాలి. లేకపోతే ఎదురుచూస్తూ ఎంతసేపో నిలబడిపోతారు.
    
    థియేటర్ దగ్గరకు రిక్షాలో వెళ్ళేసరికి అప్పటికే నాలుగు టిక్కెట్లూ కొనేసి నిజంగానే వాళ్ళు ఎదురుచూస్తున్నారు. మన్మథరావు ఒంటరిగా రావటం చూసి అచ్యుతరావు ఆశ్చర్యం ప్రదర్శించాడు.
    
    దగ్గరకు వెళ్ళి"ఆవిడకు వంట్లో బాగులేదు బ్రదర్! ఎక్స్ క్యూజ్ మి మీరిద్దరూ చూసెయ్యండి" అని నిజమే చెప్పేశాడు. వాళ్ళకెలాగూ తన సమస్య తెలుసు అబద్దం చెప్పి లాభం లేదు గనుక.
    
    "టిక్కెట్లు కొనేశాను బ్రదర్! పోనీ నువ్వురా. ఒకటి ఎవరికైనా ఇచ్చేద్దాము."    
    
    "ప్లీజ్! వద్దు" అని వాళ్ళను ఒప్పించి, ఆ రెండు టిక్కెట్లూ తీసుకుని బుకింగ్ క్లర్కుతో మాట్లాడి రిటర్న్ చేసి, డబ్బు అచ్యుతరావుకిచ్చేశాడు. "వెళ్ళండి ఆలస్యమైపోతోంది."
    
    సగం ఆనందం లోపించి ఇద్దరూ థియేటర్ లోపలకు వెళ్ళిపోయారు.
    
    మన్మథరావు అక్కడ్నుంచి కదిలి కృష్ణాబ్యారేజివైపు నడిచాడు.
    
    చీకటిపడింది. బ్యారేజిమీద లైట్లు ఠీవీగా వెలుగుతూ దూరంనుంచి చూస్తే దీపాలంకరణంలా కనిపిస్తున్నాయి. కార్లు, స్కూటర్లు బ్రిడ్జిమీదుగా ఎంతో వేగంతో వెళ్ళిపోతున్నాయి. మధ్యలో పార్క్ చెయ్యటానికి వీల్లేదు కాబట్టి కార్లు కొన్ని ఇటు చివరా కొన్ని అటుచివరా ఆగిపోతున్నాయి. బ్రిడ్జికి అటూ ఇటూ వున్న ఫుట్ పాత్ మీద మనుషులు జంటలు జంటలుగా కదుల్తున్నారు. క్రింద నదీప్రవాహం ఏ లోకాలలో తీసుకుపోయే చల్లటిగాలి అక్కడ నుంచి త్వరగా కదలబుద్ది కాదు.
    
    మన్మథరావు ఒంటరిగా నడుస్తున్నాడు. తన ప్రక్కనుంచి కదిలిపోయే జంటలనూ వాతావరణంలో కలిసిపోయే పువ్వుల పరిమళాన్ని చూస్తూ అతని కసూయగా లేదుగాని, ఆరాటంగా వుంది. కోపమేం లేదుగాని గుబులొస్తున్నది.
    
    తనకూ, సామ్రాజ్యానికి మధ్య జరిగిన మొదటిరాత్రి గుర్తువచ్చింది.
    
    ఆమె తల్లో పువ్వులు పెట్టుకుంది. తెల్లగా, మత్తు పరిమళాలతో కవ్వించే మల్లెలు నాగరికంగా కాదుగాని, వళ్ళంతా చాదస్తంగా అలంకరించేశారు. అయినా బాగానే వుంది. ఆడది ఏ అలంకరణా అసలే ఆచ్చాదనా లేకుండా వుంటే ఎంత కవ్విస్తుందో, ఎన్నో ఆచ్చాదనలమీద కూడా అంతే కవ్విస్తుంది. అతనికి సామ్రాజ్యం ఆనాడు గోముగా నచ్చింది. ఎంతో ఆనందంతో, వ్యామోహంతో, కోరికతో ఆమెను గాఢాలింగనం చేసుకున్నాడు. ఆమెకూడా ఆ కౌగిలిలో కొన్ని క్షణాలపాటు కరిగిపోయింది. తీయని తలపులతో మూతలు బడ్డ కనురెప్పలూ, అందుకోటానికి అందజెయ్యటానికి అందంగా విచ్చుకున్న పెదవులూ, ఒకరకమైన ప్రకంపనతో కొద్దిగా రంగుమారిన చెంపలూ, అతని వీపు చుట్టూ చుట్టుకోవడానికి సిగ్గుతో బెదిరే లేతచేతులూ అది దివ్యలోకమనుకుంటే నరకం ఆ ప్రక్కనే వుంది.