కాటన్ చీరలంటే చాలా మంది మహిళలకు ఎక్కవ ఇష్టం. ముఖ్యంగా మన భారతీయులు చాలా మంది కాటన్ చీరలను, కాటన్ దుస్తులను ధరించడానికి ఆసక్తి చూసిస్తున్నారు. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తూ వంటికి హాయిని కలిగించేవి కాటన్‌ దుస్తులు. ఎండవల్ల కలిగే ఉక్కపోతని, చెమటవల్ల వచ్చే చికాకుని తప్పించుకోవటానికి కాటన్‌ దుస్తులని ధరించడం ఎక్కువ.

కాటన్ చీరను ఎల్లప్పుడూ స్టిఫ్ గా, కొత్తవాటిలా మెరిపించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మరి అవేమిటో ఓసారి చూద్దామా...!

బకెట్ గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పు కొద్దిగా వేసి ఒకేసారి మూడు కాటన్ చీరలను నానబెట్టాలి. ఎక్కువ సేపు నానబెట్టకుండా పది, పదిహేను నిమిషాలకే ఉతికేయాలి. దాంతో కాటన్ చీరలకున్న అందం, రంగు పోవు. మొదటి సారి ఇలా చేయడం వల్ల తర్వాత తర్వాత ఉతుకులకు ఎటువంటి హానీ జరగకుండా కాటన్ చీరను కాపాడుకోవచ్చు.

సోప్ నట్స్ మార్కెట్లో దొరుకుతాయి. వాటిని ఉపయోగించడం వల్ల కూడా కాటన్ చీరలు ఎప్పటికీ ఫ్రెష్ గా ఉంటాయి. సోప్ నట్స్ నీళ్లలో వేసి అందులో చీరలను నానబెట్టి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసేసుకోవాలి. మార్కెట్లో లభించే లిక్విడ్ స్టార్చ్ లో కాటన్ చీరలను నానబెట్టుట వల్ల అవి ముడతలు లేకుండా స్టిఫ్ గా ఉంటాయి.

చీరలను ఉతికి శుభ్రపరిచిన తర్వాత స్టార్చ్(గంజి) పెట్టి ఎండలో కొద్దిసేపు మాత్రమే ఆరబెట్టి, ఆరిన తర్వాత వెంటనే తీసేయాలి.

ఇక కాటన్ బట్టలు స్టిఫ్ గా ఉండాలంటే ఐరనింగ్ ముఖ్యం.

ఐరన్ చేసే ముందు కాటన్ దుస్తులపై గల లేబుల్ ఒకసారి పరిశీలించండి. సాధారణంగా కాటన్ గుడ్డను ఐరన్ చేయవచ్చు. కాని చేసేముందు ఒకసారి చూడటం మంచిది.

కాటన్ చీరలను కానీ కాటన్ ఏ ఇతర బట్టలు కానీ ఐరన్ చేసే ముందు ఆ వస్త్రంపై కొన్ని నీళ్ళు చిలకరిస్తే కాటన్ వస్త్రాలు త్వరగా ముడుతలు లేకుండా ఐరన్ చేయవచ్చు.

స్టీమ్ ఐరన్ కనుక మీరు ఉపయోగిస్తున్నట్లయితే, గుడ్డ ఆటోమేటిక్ గా తేమను పీల్చుకుంటుంది. వేరుగా నీరు గుడ్డపై చిలకరించనవసరంలేదు.

గుడ్డలకు గంజి పెట్టినట్లయితే కాటన్ గుడ్డలు దళసరిగా వుంటాయి. వాష్ చేసిన తర్వాత, ఐరన్ చేసే ముందు కొద్దిపాటి గంజిని గుడ్డలకు పట్టించటం మంచిది.