నోరు ముయ్యవోయ్ బడుద్ధాయ్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?"

 

    "ఆఁ"

 

    "ఛీ అవతలకి పో, నీ మొహం నాకు చూపించకు"

 

    సుందరం కళ్ళు ఎర్రబడినాయి. అతని ముఖమంతా నెత్తురు ప్రవహించి ఉబికింది. "అట్లాగే. ఇహ నా ముఖం మీకు చూపించను" అంటూ విసవిస అవతలకి వెళ్ళిపోయాడు.


                                         8


    సుందరం ఇంటికి వస్తూ అనుకోకుండా అక్కడ చెల్లెలు ఆశని చూసి విభ్రాంతుడయినాడు.

 

    'ఎన్నాళ్లకి కనిపించావమ్మా?" అన్నాడెంతో ఆప్యాయంగా.

 

    అప్పుడు టైం దాదాపు పన్నెండు కావస్తోంది. ఆశ ఇంక మరీ ఆలస్యమై పోతూందని కంగారుపడుతోంది. ఆ సమయంలో ఊడిపడ్డాడు సుందరం.

 

    "వచ్చి గంటకి పైగా అయింది. అప్పట్నుంచి ఇద్దరం మీకోసం ఎదురు తెన్నులు చూస్తూ కూర్చున్నాం. తనకేమో ఇప్పటికి తీరుబాటయింది" అంది జ్యోతి ఎత్తిపొడుపుగా.

 

    "కోప్పడకే నా రాణి. సెలవురోజు కదా! అందుకని కాస్త స్వేచ్చ. ఏమిటమ్మా ఆశా విశేషాలు? అంతా కులాసాగా వున్నారా ఇంట్లో?" అన్నాడు సుందరం కుర్చీలో కూర్చుంటూ.

 

    "బాగానే వున్నారన్నయ్యా"

 

    "బావ వచ్చారా వూరినుంచి?"

 

    "రాలేదు" అంది ఆశ తలవంచుకుని.

 

    సుందరం నిట్టూర్చి "పోనీలే అమ్మా. అతనో విచిత్రపు మనిషి" అన్నాడు.

 

    "ఎల్లుండి మలయాకు బయలుదేరి వెళ్ళటం ఖాయమేనా అన్నయ్యా?" అనడిగింది ఆశ అతని ముఖంలోకి చూస్తూ.

 

    సుందరం చెల్లెలు వయిపునుండి చూపు తప్పిస్తూ "ఖాయమేనమ్మా" అన్నాడు.

 

    "అంత అవసరం ఏమొచ్చిందన్నయ్యా!"

 

    "అవసరం' అతని కనుబొమ్మలు ముడిపడినాయి. "ఏం అవసరం వుందని నేనా ఇంట్లోంచి ఇవతలకు వచ్చాను?"

 

    "ఇద్దరూ తొందరపడ్డారన్నయ్యా."

 

    ఆ క్షణం చిత్రమైనది. మాయదారిది! అనుకోని పర్యవసానం దాపురించింది. జీవితంలో ఎన్నడూ తలదాచని భయంకర పరిణామ ఆవేశాల దారుణ నాట్యం.

 

    "నాకు ఇక్కడ మనస్సు ఏమీ బాగుండలేదు ఆశా! లోకం దృష్టిలో అపరాధిగా నిలబడ్డాను నేను. కృతఘ్నుడిగా, హృదయం లేనివాడుగా వేలెత్తి చూపిస్తోందీ లోకం. ఇక్కడ వుండి ఈ సంఘర్షణ భరించలేను. అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి. మలయాలో ఉద్యోగం వచ్చింది వెళతాను ఆశా!"

 

    ఆశ ఒక్కక్షణం మౌనంగా వూరుకుని "నువ్వు మన ఇంటికి వస్తే ఎవరు కాదన్నారు అన్నయ్యా?" అంది జాలిగా.

 

    'ఎందుకు రావాలి?"

 

    "మన ఇల్లు కాబట్టి."

 

    "కావచ్చు. కాని నా ఉనికి కష్టంగా వున్నప్పుడు నేనెందుకు రావాలి ఆశా!"

 

    "అది క్షణికావేశం అన్నయ్యా! నాన్నగారి ముక్కోపితనం నీకు తెలీదూ? అమ్మ రోజూ నిన్ను తలుచుకొని ఏడుస్తోంది. నాన్నగారు ఎంతో బాధపడుతున్నారు. వాళ్లకు మాత్రం ఎందరు కొడుకులున్నారు? వున్న ఇద్దరూ ఖేదాన్నే కలిగిస్తే వాళ్ళ ప్రాణాలు ఎంత క్షోభిస్తాయి?"

 

    సుందరానికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "నాన్నగారుగానీ, అమ్మగానీ ఒక్కసారి వచ్చి రమ్మంటే రాకపోయానా ఆశా! పెద్దవాళ్లకే అంత పౌరుషం వుంటే వయసులో వున్నవాడికి నాకెంత వుండాలి?" అన్నాడు.

 

    ఆశకు అతడ్ని చూస్తే జాలికలిగింది. నిజంగా చిన్నన్నయ్య ఎంత మంచివాడు! ఎంత సున్నిత హృదయుడు! పరిస్థితికి వారసుడై ఇట్లా సతమత మౌతున్నాడు.  

 

    "వాళ్ళ విషయంకూడా కొంచెం ఆలోచించు అన్నయ్యా! ఆయనంతట ఆయన రావటానికి మనసులో ఎంతవున్నా నాన్నగారికి అభిమానంగా వుంటుంది."

 

    "నాకూ ఆ అభిమానం వుంది ఆశా."

 

    ఆశ నిస్పృహగా "ఇహ అంతేనా చిన్నన్నయ్యా? నీ మొండితనం మానవా?" అంది.

 

    "నన్ను అన్యధా భావించకు ఆశా?"

 

    "నేను బ్రతిమాలినా, ప్రాధేయపడినా నామాట వినటంలేదు కదూ?"

 

    "కోపగించకు ఆశా! నేను చేయగలిగిందేమీ లేదు."

 

    "సరే అయితే వస్తానన్నయ్యా! వస్తా వదినా" అంటూ కళాహీనమయిన ముఖంతో ఆశ లేచి నిలబడింది.

 

    సుందరం ఎంతో ఆదరంగా "ఇవాళ మాతోకూడా భోజనం చేసి వెళ్ళు ఆశా౧ మళ్ళా ఎప్పటికి కలుస్తామో" అన్నాడు. అతని గొంతు వణికింది.

 

    "అవును ఆశా" అంది ఇందాకటినుంచి మాట్లాడకుండా శిలాప్రతిమలా నిలబడ్డ జ్యోతికూడా.

 

    "క్షమించు అన్నయ్యా! తప్పకుండా భోజనానికి వుండేదాన్ని. కాని ఇంట్లో ఎదురుచూస్తూ వుంటారు. వస్తా" అని ఆశ బయటికి వెళ్ళిపోయింది.

 

    సుందరం కుర్చీలో స్తబ్దుగా కూర్చుండిపోయాడు. ఒకటి రెండుక్షణాలు తేరుకుని "నేను తప్పు చేస్తున్నానంటావా జ్యోతీ?" అనడిగాడు విషణ్ణవదనంతో.

 

    "లేదు. మీరు తప్పు చేయటంలేదు. ఈ అపకీర్తిని మనతోబాటు మలయా తీసుకుపోయి జీవితమంతా భరిద్దాం" అని జ్యోతి అక్కడ వుండలేక లోపలకు వెళ్ళిపోయింది.


                                         *  *  *


    ఆశ ఇంటికి చేరేసరికి విశ్వనాథంగారు క్రింద హాల్లో పచార్లు చేస్తున్నారు.

 

    ఆయన్ని చూడగానే ఆశ గుండె గబగబ కొట్టుకుంది.

 

    "ఎక్కడికి పోయావమ్మా?" అనడిగాడు విశ్వనాథంగారు. ఆశ అబద్ధం చెప్పలేకపోయింది. తండ్రికీపాటికి తెలిసిపోయే వుంటుందని భయపడింది.