వేదిత ఈ ఊరు ఎందుకు రావలసివచ్చిందో, గుడిని వొదిలిపెట్టి ఉండలేని యువతి, ఆ ఊరు విడిచి ఎందుకు రావలసి వచ్చిందో ఎంత ప్రయత్నించినా అతనికి అర్థం కాలేదు. అతను ఆనందపురం విడిచివచ్చాక జరిగిన సంగతులు శేషశాయి విడమర్చి చెప్పకపోయినా కొంత గడబిడలు జరిగినట్లు అతను గ్రహించాడు. ఒకవేళ మనస్సు మార్చుకుని శాయిని వెతుక్కుంటూ వచ్చి ఉంటుందా అని అనుమానించాడు. ఛ! అంత స్నిగ్ధ మాధురులు వెదజల్లుతూన్న ముగ్ధబాలిక, మొండికేసి యిలా బరితెగించి వస్తుందా? త్రిమూర్తులును వీలు చూసుకుని సందర్భం కనుక్కోమని ఉద్భోధించాడు.

 

    త్రిమూర్తులు సంగతి స్థూలంగా తెలుసుకుని అతడి చెవిని వేశాక ఈ కొత్త సత్యం విని నివ్వెరపోయాడు. ఎవరీ కల్యాణమూర్తీ? అంతటి బలీయమైన ముద్రను ఆమె హృదయంలో వేసి, ఆమె తనచుట్టూ నిర్మించుకున్న వలయాన్ని నామరూపాలు లేకుండా ఎలా చెరిపివేయగలిగారు? ఆమె జీవిత చరిత్రలో అంత అంతరంగిక సంబంధం ఉన్నదా అతనికి? ఆమె గతించిన జీవితపు పుటలలో మహోన్నతమైన అగ్రస్థానమిచ్చి రాసుకుందా అతన్ని గురించి? దాచుకుందా ఉక్కు కవచంవంటి తన గుండెలో? మౌనంగా ఆరాధించి, ఆరాధించి దాహమయి వచ్చిందా "స్వామీ" అంటూ.    

 

    ఎవరీ కల్యాణమూర్తి? మసగ్గా ఓ సంగతి గుర్తుకు వచ్చింది. శాయిని స్టేషన్ కు దింపటానికి వెళ్ళినరోజున మరోవైపునుండి రైలు దిగి వస్తూన్న ఓ స్ఫురద్రూపియైన యువకుడ్ని చూసి "కల్యాణ మూర్తీ!" అని సంబోధిస్తూ పిలిచినట్లు జ్ఞప్తికి వస్తోంది. ఇద్దరూ ఆనందంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. పాత స్నేహితులు కాబోలు అనుకుంటూ తను దూరంగా జరిగాడు. వాళ్ళిద్దరూ గబగబ అనేక సంగతులు మాట్లాడుకున్నారు.

 

    "నేను... అమెరికా... మళ్ళీ తిరిగిరాను" అంటున్నాడతను.

 

    శాయి అతను చెప్పిన విషయాలు విని "ఓ! అలాగా ఐయామ్ సారీ! నేను వస్తున్నాను, నువ్వు వేడుతున్నావు" అంటున్నాడు.

 

    ఇంతలో శాయి ఎక్కవలసిన ట్రైయిన్ వచ్చింది. ఇరువురూ బై బై  చెప్పుకుని విడిపోయారు.

 

    అతడేనా ఈ కల్యాణమూర్తి? అతన్ని వెదుక్కుంటూనేనా ఆమె గత జీవితానికంతటికీ స్వస్తి చెప్పి వచ్చింది? ఎంతటి మహత్తర ప్రేమ బంధం పాశాలు వేసి లాక్కుని రాకపోతే ఆమె యింతటి సాహసం చేయటానికి ప్రేరితురాలవుతుంది! అతనికి ఆమెపట్ల ఎనలేని జాలి అంకురించింది. కాని ఏం లాభం! అనుకున్నది పొందలేకపోయింది. పోగొట్టుకున్నది తిరిగిరాదు. అందుకే... రాయిలా... ఏం జరిగినా చలించని నిర్వికార జీవిలా - ఏ పరిణామానికైనా సిద్ధపడిన విర్లక్ష్య స్వరూపిణిలా తయారయింది. అతనలా నిర్వచనం చెప్పుకున్నాడు.

 

    కాని ఆమె అంటే అతనికి గౌరవం యినుమడించిందిగాని దురభిప్రాయం ఏర్పడలేదు. ఇంకా నయం, అదృష్టవశాత్తు తనకు తారసపడింది గాని, తాను ఏమరిపాటులోవుండి గమనించకుండా వెళ్ళిపోతే ఈ ఊరుగాని ఊళ్ళో... అయోమయంగా తయారైన మనస్తత్వంతో ఆమె ఎన్ని యిడుముల పాలై ఉండేదో!

 

    తనని గురించిన వివరాలు, తన అతిధ్యంలో ఆంతర్యం తెలుసుకొనటానికి ఆమె కుతూహలమూ కనపర్చటంలేదు, ఆశ్చర్యమూ కనపర్చటంలేదు. అది సరే, యిహముందు తన కర్తవ్యం ఏమిటి? రేపో మాపో శాయి వస్తాడు. అతను వచ్చేవరకూ ఆమె నిక్కడ ఉంచటమా? లేక మరేదైనా పరిష్కారమార్గమాలోచించటమా?  

 

    ఒకప్పుడు ఆ పవిత్రురాలి జోలికి పోవద్దని, ఆ కాంతి పుంజానికి దూరంగా ఉండమని శాయిని తనే ప్రాధేయపడ్డాడు. అవధులులేని ఆత్మవినాశనానికి పూనుకోవద్దని హెచ్చరించాడు. ఇప్పుడు చేజేతులా తనే అప్పచెప్పటమా?

 

    ఆమె రక్షణలో, ఆమె కర్తవ్యంలో అంతర్ముఖమైవున్న అతని బాధ్యతలు మేలుకుని బాధించసాగినవి.

 

    శాయి! యీనాడు అతని జీవితం మూర్తీభవించిన విషాదం. మధుపాత్ర నింపుకోవటం, ఖాళీ చేయటంలోనే రేయింబవళ్ళు గడిచి పోతున్నాయి. అతనిని వెనుకటికీ, యిప్పటికీ పోల్చిచూస్తే మనిషి సగమైపోయాడు. శుష్కించి కళావిహీనమై ఉంటుందతని ముఖమెప్పుడూ. అతనిలో వైవిధ్యంతో కూడిన అందాలు అనుభవించటంవల్ల వాంఛలు అంతరించిపోయాయి. నిద్రలో మెలకువలో, మైకంలో ఎప్పుడూ ఒకే స్మరణ - "వేదితా, వేదితా" అంటూ. ఎన్నో సార్లు అతని నివాసం అక్రమమార్గాలకు తాను వాడుకున్నాడు. హాల్లో సోఫాలో సీసామీద సీసా ఖాళీ చేస్తూ పడి దొర్లేవాడే తప్ప- కన్నెత్తి యిటువైపు చూసేవాడు కాదు. అతని మనస్సు మరల్చుదామని ఎన్ని ఆకర్షణలకు గురిచేద్దామని ప్రయత్నించినా తనే భంగపడేవాడుగాని, అతను చలించేవాడు కాదు. "ఏయ్! ఆడండి పాడండి. కాసేపు చూసి వినోదిస్తాను. కాని నాలో నిద్రాణమై పోయిన కోర్కెల్ని మేలుకొలపటం మీ తరం కాదు. అది ఒక్కరికే చాతనవును... వెళ్ళండి. మీ కాలం వృధా చేసుకోకండి." అంటూ అదలించేవాడు.

 

    అతని స్మృతులతో సక్సేనా నేత్రాలు అశ్రువుల భాష్పపూరితాలయాయి. శాయి తన ప్రాణమిత్రుడు. తాను పాపి మార్గంకేసి ప్రయాణం చేస్తుంటే చెయ్యనియిగాక, బహుశా తను చేసిన పాపాలలో కల్లా యిదే మహాపాపం కావచ్చు. స్నేహితుడుకోసం అది అనుభవించి - ఆ మాత్రం త్యాగం చెయ్యవచ్చు. ఈ ఉపకారం తనవల్ల జరిగి తీరాలి. ఆ పాత్ర తనవల్ల నిర్వర్తించబడాలి.

 

    అతనికి ఉపశాంతి లభించినట్లయింది. ఊపిరితిత్తుల నిండా పీల్చుకున్న గాలితోపాటు ఊరటకూడా ప్రవేశించినట్లయింది . 

 

                                            * * *

 

    ఒకరోజు ఉదయం సక్సేనా పనిమీద బజారు వెళ్ళినపుడు ఓ షాపులో అందమైన కృష్ణ విగ్రహం కనిపించింది. దంతంతో చేయబడి సోయగాలు వెదజల్లుతోంది. వెంటనే అతని మదిలో వేదిత మెదిలింది. ఈ బొమ్మ ఎదురుగావుంటే ఎంత సంతోషిస్తోందో అనుకున్నాడు. బయటకు వ్యక్తపరచక పోయినా ఆమె ఆ ఇంట్లో మహా అలసత్వంతో జీవితం గడుపుతూ కృంగిపోతూ ఉండాలి. ఈ చిన్నారి విగ్రహం ఆమెకు ఓ అందాల బాటగా మారి రాగ మాధుర్యాలు చిగురింప చేస్తుందనుకున్నాడు. వెంటనే అది కొని తీసుకుపోయాడు. కాని సాయంత్రంవరకూ ఆమె దగ్గిరకు వెళ్ళటం వీలుపడలేదు.