"చెప్పటం కష్టం."

 

    "నాఫోను నెంబరెలా తెలిసింది? జయారెడ్డి చెప్పిందా?"

 

    "కావొచ్చు. లేదా 197 వుండనే వుంది. అదీ కాదనుకుంటే పది రూపాయలతో టెలిఫోన్ డైరెక్టరీ దొరుకుతుంది."

 

    "అయితే నా నెంబరు నేను నీకివ్వలేదు. అవునా?" కన్ ఫర్మ్ చేసుకోటానికి అడిగాడు శ్రీధర్.

 

    "డైరెక్ట్ గా కాదుగాని ఇన్ డైరెక్ట్ గా నువ్వే యిచ్చావ్."

 

    "నేనా?" ఆశ్చర్యపోయాడు శ్రీధర్.

 

    "యా...."

 

    "నీది శ్రీకాకుళమా?"

 

    "కావచ్చు."

 

    "నాకు తెలిసిన వాళ్ళలో శ్రీకాకుళానికి చెందిన వాళ్ళెవరూ లేరే?"

 

    "అది నా తప్పు కాదుగా?" చిన్నగా నవ్వుతూ అంది.

 

    "మనం అపరిచితులమయినా నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? ఆత్మసౌందర్యమనే ఆవకాయ జాడీ మాటలు చెప్పకు."

 

    "నీతో మాట్లాడటానికి."

 

    "నాకేం అర్థంకావటంలేదు."

 

    "నేను నీకు తెలియదన్నాను గాని నీవు నాకు తెలీదని అనలేదే?"

 

    "అలాగా...అయితే నా ఫ్లాట్ కి వచ్చేయ్ తీరిగ్గా మాట్లాడుకుందాం."

 

    అతని ప్రపోజల్ కి అటువేపు నుంచి సమాధానం లేదు.

 

    "పోనీ నీ అడ్రస్ చెపు నేనొస్తాను."

 

    తిరిగి కొద్ది క్షణాలు నిశ్శబ్దం.

 

    "నువ్వుండే సికింద్రాబాద్ కి, నేనుండే జూబ్లీ హిల్స్ చాలా దూరం" చెప్పిందామె మెల్లగా.

 

    "అయినా నేను రాగలను."

 

    "నో....ప్లీజ్!"

 

    "అయితే నువ్వే రా...."

 

    "ఎప్పుడూ ప్రేమలోనే వుండిపోవాలంటే పెళ్ళి మానుకోవాలంట...ఎవరో చెప్పగా విన్నాను."

 

    "నువ్వొస్తే పెళ్ళయిపోతుందా?"

 

    "వెంటనే కాకపోవచ్చు. నువ్వు నా అందానికి తట్టుకోలేక అఘాయిత్యం చేస్తే తప్పదుగా..."

 

    "ప్రేమ మూర్ఖుల తెలివి, తెలివిగల వారి మూర్ఖత్వం అని ఎవరో చెప్పగా నేనూ విన్నాను" కావాలనే ఇరిటేట్ చేస్తున్నట్టుగా అన్నాడు శ్రీధర్.

 

    "నువ్వు మగాడివి కదా...అలాంటివే వింటావు. స్త్రీలు అలాంటివి వినరు. ఎందుకంటే మగాడి జీవితంలో ప్రేమ ఒక భాగం. కాని స్త్రీలకి ప్రేమే జీవితం కనుక."

 

    ఒక్కక్షణం ఖంగుతిన్నాడు శ్రీధర్. ఈమెతో మాట్లాడటం చాలా కష్టమనుకున్నాడు.

 

    "ఈ వాదనల వల్ల ఏం ప్రయోజనం లేదు. నేనేం చేయను? ఒక్కసారి రా! నువ్వు నా ఫ్లాట్ కొచ్చిప్పుడు మెయిన్ డోర్ క్లోజ్ చేయను. సరేనా?"

 

    "మరీ అంత ఓపెన్ గానా? అప్పుడు ఎదురు ఫ్లాట్లో వాళ్ళు డాక్టర్ సమరం దగ్గరకో, ఇండ్ల రామసుబ్బారెడ్డి దగ్గరకో వెళ్ళవలసి వస్తుంది. పాపం వాళ్ళ నెందుకు విజయవాడ పంపించటం? అయినా ఇప్పుడు రాలేను" అందామె హస్కీగా.

 

    ఆమెలోని సమయస్ఫూర్తికి, అందులోని అతివేగానికీ, వల్నరబిలిటీకి లోలోనే థ్రిల్లింగ్ గా ఫీలయ్యాడతడు.

 

    "ఏం? ఎందుకు రాలేవు?"

 

    "ఇప్పుడే తలస్నానం చేసొచ్చాను. కురులారబెట్టుకుంటూ, ఆకాశంలోని పాలపుంతకేసి చూస్తూ అందమైన అక్షరాల్లాంటి నక్షత్రాల్ని తన్మయంగా చూస్తున్నాను."

 

    అసలింతకీ ఎవరీమె? అవును. కావొచ్చు. ఆమధ్య తనెలా ఒక నిర్థారణకు రాగలడు?

 

    "లైన్ లోనే వున్నావా" అడిగిందామె.

 

    "ఆ ఉన్నాను. ఆలోచిస్తున్నాను."

 

    "దట్స్ గుడ్! ఆలోచనలెప్పుడూ మంచివే. అప్పుడే గదా అవతలివ్యక్తి అంతరంగాన్ని అర్థం చేసుకోవటానికి వీలవుతుంది."

 

    "చూడు...నేనింకా స్నానం చేయలేదు. చేయాలని ఆలోచన ఇంకా రాలేదు. ఆఫీసు నుంచి, థియేటర్ కి, అక్కడి నుంచి ఫ్లాట్ కొచ్చాను. ఇంకా డ్రస్ ఛేంజ్ చేసుకోలేదు, నీ అడ్రస్ చెప్పేస్తే వెంటనే వచ్చేస్తాను. వచ్చినా అల్లరేం చేయను. బుద్ధిగా చేతులు కట్టుకునే వుంటాను. ప్రామిస్."

 

    "మురికి పిల్లాడా...అలా స్నానం చేయకుండా రావటం మొదటి తప్పు. అడ్రస్ చెప్పగానే వెనకా ముందు చూసుకోకుండా వస్తాననటం రెండో తప్పు. వచ్చినా అల్లరి చేయననటం చాలా పెద్ద తప్పు. బుద్ధిగా చేతులు కట్టుకొని కూర్చుంటాననటం బ్రహ్మాండం బ్రద్దలయ్యేంత తప్పు. ఇంకెప్పుడూ 6.30 మాటలు చెప్పకు. బాగోదు. అదెలాగు 55-60 సంవత్సరాల తర్వాత తప్పదు."

 

    "అవునూ...6.30 అంటే ఏమిటి?" శ్రీధర్ మాటలకు అపరిచితురాలు పక్కన నవ్వేసింది.

 

    "ఎందుకలా నవ్వుతావు?"

 

    6.30 అంటే ఏమిటని అడగకూడదు. నీ ఫ్రెండ్ ని అడుగు బాగుంటుంది."

 

    "అలాగే అడుగుతాను. ముందు నీ అడ్రస్ చెప్పు."

 

    "కష్టపడి కనుక్కుంటే వుండే థ్రిల్ చెపితే రాదు. నీకా థ్రిల్ అనుభవంలోకి రాకుండా చేయటం నాకిష్టంలేదు."

 

    "అడ్రస్ చెబుతావా? ఫోన్ పెట్టేయమంటావా?" సీరియస్ నెస్ నటిస్తూ అన్నాడు శ్రీధర్.

 

    "పిచ్చివాడా...ప్రేమయుద్ధం ఆరంభించటం తేలికే. ముగించటమే, లైలా మజ్నూకి గాని, సలీం అనార్కలీకి గాని, హెలెన్ ఆఫ్ ట్రాయ్ కి గాని, క్లియోపాట్రా జూలియస్ సీజర్ లకే సాధ్యం కాలేదు. నీకు, నాకెలా సాధ్యమవుతుంది?"