"అలాగా!"
    
    ఆ తరువాత ఏం మాట్లాడాలో బోధపడలేదు.
    
    ఈ స్థితి ఆదిత్యకీ ఇబ్బందిగా అనిపించిందేమో- "మీకు కోపం ఒక్కటే కాదు తొందరపాటూ ఎక్కువే కదూ...."
    
    "ఎందుకలా అంటున్నారు?" ప్రబంధ తల వంచుకుంది.
    
    "నిన్న వైస్ ఛాన్సలర్ గార్ని కంగారుపెట్టి క్విజ్ చెల్లదని నోటీసు వేయించారుగా!"
    
    "మరేం...." ఆదిత్య తనగురించి అంతా తెలుసుకోవడం ఆనందంగా వుంది. "ప్రొఫెసర్ రాధాకృష్ణగారు అలా చేయడం నచ్చక...."
    
    మళ్ళీ మౌనం.
    
    "మీరు పోటీకి ప్రిపేరవుతున్నారనుకుంటాను" అంది ఆదిత్య చేతిలోని బుక్ చూస్తూ.
    
    "ఆ పోటీకి కాదు."
    
    "మరి?"
    
    "అసలు మీతో పోటీకి ఇక సిద్దపడను."
    
    "అదేం?"
    
    "ఓడిపోయాను గనుక!"
    
    బిడియంగా నవ్వింది- "అదేం కాదు....మీరే గెలుస్తారు."
    
    "ఎందుకలా అనిపించింది?"
    
    "మొదటిసారి గెలిచారుగా!"
    
    "మరోసారి ఓడిపోయానుగా?"
    
    "ఓడింది క్విజ్ మాస్టర్ మూలంగా."
    
    'ఎవరి మూలంగానైనా కానీ ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయాను. అది నిజం."
    
    ఏ స్థితిలో ఎలా తడబడాల్సివస్తుందో తెలీని ప్రబంధ అతడినుంచి పుస్తకాన్ని అందుకుని- "ఆస్కార్ గురించి చదువుతున్నారా?"
    
    అతడి కళ్ళలోకి చూస్తూ మాట్లాడలేకపోతున్న ప్రబంధ కొంతసేపు తన దృష్టిని అక్షరాలపైన కేంద్రీకరించాలనుకుందే తప్ప, అందులోని టాపిక్ మీద ఆమెకు ఆసక్తిలేదు నిజానికి.
    
    అసలు ఆదిత్య కూడా ఇది నమ్మలేకపోతున్నాడు. ఒక అహంకారిగానే తప్ప ప్రబంధ గురించి మరో అభిప్రాయం లేని ఆదిత్య యిప్పుడు ప్రబంధలో ఈ మార్పును జీర్ణించుకోలేకపోతున్నాడు.
    
    "ఆస్కార్ స్కేన్ గురించి మీకు పూర్తిగా తెలుసా?" అంది తల వంచుకునే.
    
    "కొద్దిగా తెలుసు."
    
    "నేను అడగనా?"
    
    "వెల్ కమ్!"
    
    ఏదో మాట్లాడాలని వచ్చి తనేం చేస్తుంది? అయినా మొదటి పరిచయంలో ఇంతకుమించి తనేం చేయగలనని?"
    
    "అమెరికాకి చెందిన ఆస్కార్ అకాడమీ మొదలయ్యాక ఉత్తమ దర్శకుడుగా ఎక్కువసార్లు ఆస్కార్ బహుమతి పొందిన వ్యక్తి ఎవరు?"
    
    "జాన్ ఫోర్గ్!"
    
    "షేక్స్ పియర్ రాసిన వాటిలో ఒకే ఒక్క చిత్రం ఇప్పటిదాకా ఉత్తమచిత్రం బహుమతి పొందింది. అదేమిటి?"
    
    1848లో "హ్యేలెంట్."
    
    "మెట్రో గోల్డ్ ఎన్ మేయర్ కళాదర్శకుడు సెడ్రిక్ గిబ్బన్స్ డిజైన్ చేసిన ఆస్కార్ విగ్రహం పరిణామం ఎంత?"
    
    "పదమూడు అంగుళాల పొడవు, ఎనిమిది పౌన్ ల బరువూ వుంటుంది."
    
    క్షణం తలపైకెత్తి చూసింది ప్రబంధ.
    
    పెదవులపైన విడీవిడని అదే చిరునవ్వు.
    
    ఇలా ఎంతసేపు అడుగుతూ పోవాలి?" "బోర్ కొడుతుందా?" అంది సిగ్గుపడుతూ.
    
    "ఫరవాలేదు" ఉత్సాహంగా నవవాడు- "నాకు చిన్నతనంనుంచీ ఇలా చెప్పడమంటే చాలా సరదా...పైగా ఇది నా అవసరంగా?"
    
    'నా అవసరం కూడా' అనలేదు ప్రబంధ. అవకాశమిస్తే ప్రతిరోజూ ఇలా కబుర్లు చెప్పుకుంటూ, ప్రశ్నలడుగుతూ కూర్చోవచ్చని కూడా అనుకుంది.
    
    "విదేశీ చిత్రాలు ఆస్కార్ కి రికమెండ్ చేసేది ఆయా దేశాల ప్రభుత్వాలు, అక్కడి బాడీస్ అయితే, హాలీవుడ్ చిత్రాలకు సంబంధించి విధిగా పాటించాల్సిన ఓ నియమం వుంది....అదేమిటి?"
    
    "తెలీదు."
    
    "నిజంగా?"
    
    "ప్రామిస్!" అనుమానంగా అడిగాడు... "అయినా ఆ వివరాలు ఈ బుక్ లో వున్నట్టు లేదే!"
    
    "లేవు కాని నేను ఎక్కడో చదివింది అడుగుతున్నాను."
    
    "ఆస్కార్ పోటీలకి ఏ హాలీవుడ్ చిత్రమైనా అర్హత సంపాదించాలీ అంటే, పోటీలముందు సంవత్సరం విధిగా లాసేంజిల్స్ ప్రాంతంలో కనీసం ఓ వరం ప్రదర్శించి వుండాలి."
    
    "గుడ్... కొత్త విషయం తెలుసుకున్నాను" అభినందనగా చూశాడు.
    
    నిశ్శబ్దం చాలాసేపటిదాకా.
    
    "ఆగిపోయారేం?" అడిగాడు ఆదిత్య.
    
    "మిమ్మల్ని టీచర్ లా అడగటం నాకు నచ్చడం లేదు."
    
    "కొన్ని క్షణాలపాటు టీచర్ననుకోండి."
    
    "కాకుండా ఎలా అనుకోను?"
    
    "తెలీనిది చెప్పే వ్యక్తి టీచరయితే ఇందాక మీనుంచి మీ స్టూడెంటులా కొత్త విషయం తెలుసుకున్నాను ప్రబంధా!"
    
    అతడి మాటలు వింటుంటే ఎంత ఆహ్లాదంగా వుందని! ఆదిత్య ఆసక్తి అనిపించేట్టు మాట్లాడుతున్నాడో, లేక అతనితో మాట్లాడటం తనకు ఆసక్తిగా వుందో ఆమెకు తెలీదు కాని అతడిమీద మరింత ఆసక్తి పెరిగిపోతూంది.
    
    నిన్న మొన్నటి అహంకారం చెరిగి అతడిముందు అతడి మనిషిగా మారిపోవాలన్న ఉత్సాహం ఆమెను అదోలాంటి భావానికి గురిచేస్తుంటే తల వంచుకుని అంది నెమ్మదిగా- "మీరూ అడగండి."