టీవీ కొనమంటే వికారంగా ముఖం పెట్టి వికృతమైన వాదన చేసిన అశోక్ కంటే నా ఈ చిన్న మాధవుడు ఎంతో అందంగా, ఆత్మీయంగా కనిపించాడు. వాణ్ని అలానే ముందుకు లాక్కుని ఎదలో దాచుకోవాలనిపించింది. వాడి ప్రేమకు తట్టుకోలేకపోయాను.
    
    కానీ అలా చేష్టలుడిగి నిలబడిపోయాను.
    
    నా కళ్ళల్లో నీళ్ళు చూసి వాడు చలించిపోయాడు.
    
    "ఏమ్మా! ఏమైనా తప్పుచేశానా?" అనడిగాడు వణుకుతున్న కంఠంతో.
    
    "చీచీ! అలాంటిదేం లేదురా ఏదో నలుసు కంట్లో పడితే" అని బుజ్జగించబోయాను.    

    "ఇది తేవడం తప్పా?"
    
    "లేదన్నాగా! మా పుట్టింటివాళ్ళు గుర్తుకొచ్చారు" అని వాడి చేతిలోంచి పక్కపిన్నుల ప్యాకెట్ తీసుకుని, రెండు పిన్నులను బయటికి లాగి, అటూ ఇటూ దోపుకున్నాను.
    
    "ఓకేనా! ఇక నా వెంట్రుకలు ఎగరవు. ప్రతిసారీ వెంట్రుకలను సరిదిద్దుకోవడానికి నేను అవస్థపడాల్సిన పనిలేదు" అన్నాను.
    
    "ఇంటికెళ్ళి చిటికెలో వచ్చేస్తాను"
    
    "ఊఁ త్వరగా వచ్చేయ్ భోజనం వండుతాను నీక్కూడా" అన్నాను.
    
    వాడు ఇంటికి వెళ్ళిపోయాడు.
    
    పక్కపిన్నుల ప్యాకెట్ ను చాలాసేపు అలా చేతుల్లోనే వుంచుకుని ఏదో ఆలోచిస్తూ ఉన్నాను.
    
    జాతర వెళ్ళిపోవడంతో వేరుశనగకాయలలో కలుపు తవ్వేశాం. వరిపైరు నాటేశాం. మొత్తం పనంతా పదిరోజుల్లో అయిపోయింది. ఇక నీళ్ళు కట్టుకోవడం తప్ప పెద్ద పనులేం ఉండవు.
    
    ఓరోజు సాయంకాలం యధా ప్రకారం నేను మంచం మీద కూర్చుని వుంటే మాధవుడు కింద కూర్చుని ఏవేవో కాలక్షేపం కబుర్లు చెబుతున్నాడు.
    
    నేను విస్తర్లు కుడుతూ వింటున్నాను.
    
    "అమ్మా! మీతో ఓ విషయం చెప్పాలి" అన్నాడు వాడు నేను గుర్తించలేదు గానీ వాడు ఈ మాట చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాడు.
    
    "ఏంట్రా?" నేను చాలా క్యాజువల్ గా అడిగాను.
    
    "నేను పనికి నిలిచిపోతానమ్మా"
    
    నా చుట్టూ చీకట్లు కమ్మేసినట్లు ఉలిక్కిపడ్డాను.
    
    "ఏంట్రా?"
    
    "అవునమ్మా! మీ ఇంటిదగ్గిర చెరి సంవత్సరమైంది. మన ఊరికి పడమరగా రాళ్ళు శుద్ది చేసే ఫ్యాక్టరీ ఓపెన్ చేశారు. అందులో ఉద్యోగం చూశాడు మా అన్న పెద్ద జీతం కాదు. కానీ ఉద్యోగమంటే ఉద్యోగమే కదా! మీరు మళ్ళీ తోడు లేకుండా అయిపోతారనే దిగులుతో ఫ్యాక్టరీకి వెళ్ళనన్నాను.
    
    కానీ మా అన్న ఒప్పుకోవడం లేదు. అప్పటికీ చెప్పి చూస్తున్నాను. మరీ బలవంతం చేస్తే వెళ్ళక తప్పదని మీకు చెబుతున్నాను" అన్నాడు.
    
    తొలిరోజుల్లో మనిషి తోడులేక నేను పడ్డ నరకం గుర్తు వచ్చింది. అదీగాక మాధవుడితో బాగా కలిసిపోయాను. ఓ విధమైన ఆకర్షణలో పడిపోయాను వాడు వెళ్ళిపోతే మళ్ళీ ఒంటరితనం తన ఇనుపచక్రాల మధ్య బిగించి, పీల్చి పిప్పి చేస్తుంది. ఇంతకు ముందయితే జీవచ్చవంగా నైనా మిగిలాను.
    
    ఈసారి అలాంటి పరిస్థితే వస్తే శవం మాత్రం మిగులుతుంది. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మాధవుడు రాకుండా నిలిచిపోయిన రోజు ఎవరూ పలకరించే దిక్కులేక ఆ దిగులుతోనే ప్రాణాలు ఎగిరిపోతాయి.
    
    అలా గుడ్లప్పగించి చూస్తుండిపోయాడు. వాడు నన్ను చూసి భయపడి పోయినట్లుంది.
    
    "వీలైనంత వరకు వెళ్ళనులేండమ్మా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తుందేమోనని ముందుగా చెబుతున్నాను అంతే మాట్లాడడానిక్కూడా మనిషి లేకుండా ఇకక్డ మీరెలా వుంటారోనన్న బెంగ మీకంటే నాకే ఎక్కువగా వుంది" అన్నాడు వాడి గొంతు బాధతో వణకడం తెలుస్తూనే వుంది.
    
    నేనేమీ మాట్లాడలేదు వాడు అర్ధం చేసుకుంటాడన్న నమ్మకం కూడా నాకుంది.
    
    కానీ అది ఉద్యోగం ఫ్యాక్టరీ వున్నంతవరకు పని వున్నట్లే అదీ గాక ఇప్పటికంటే అక్కడ నాలుగుడబ్బులు కూడా ఎక్కువే వస్తాయి.
    
    అందుకే మౌనంగా వుండిపోయాను.
    
    కానీ ఈ ఉద్యోగం ఎలాగైనా వాడికి రాకుండా తప్పించేయమని దేవుళ్ళను ప్రార్దించాను.    

    మునుపటిలా వుండలేకపోతున్నాను.
    
    వాడు వెళ్ళిపోతాడేమోనన్న దిగులు, బాధా నన్ను వదలడం లేదు. నాకు నేను ఎంత సర్ది చెప్పుకుంటున్నా లాభం లేకపోతోంది.
    
    ఇదంతా వాడికి తెలుసు. వాడూ అదే దిగులుతో ఉన్నట్లున్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళడం వాడికి బొత్తిగా ఇష్టంలేదు నేను మళ్ళీ ఒంటరిగా వుండిపోతానన్న భయంతో వాడు భవిష్యత్తుని అలా నిర్లక్ష్యంగా కాలుతో తన్నేయడానికి సిద్దంగా వున్నాడు.
    
    ఓ వారం రోజుల తరువాత అనుకుంటాను ఉదయమే వచ్చేశాడు. అప్పుడే అశోక్ వెళ్ళిపోయాడు నేను కాఫీ తాగుతుండగా వచ్చాడు.
    
    వచ్చీ రావడంతోనే "కాఫీ తాగాలనిపిస్తోంది ఈరోజు వున్నాయా?" అని అడిగాడు.
    
    వాడి ముఖం వెలిగిపోతోంది.
    
    కారణం ఏమిటో వూహించలేక పోతున్నాను వాడి ఆనందం చూసి నాకు ఆనందం వేసింది.
    
    "ఉన్నాయి జస్ట్ రెండు నిముషాలు" అని స్టౌ వెలిగించి, కాఫీ వేడి పెట్టి గ్లాసులో పోసిచ్చాను.
    
    "అంతా ఇంతా ఆనందం కాదు ఈరోజు భూమిని అలా పెకిలించి చేతుల్తో గిరగిరా తిప్పాలనిపిస్తోంది"    

    "నీముఖం చూస్తుంటేనే అది తెలిసిపోతోంది. ఏం జరిగిందో చెప్పరా?"
    
    "నేను ఫ్యాక్టరీకి పోవడం లేదు. మా అన్నతో ఖచ్చితంగా చెప్పేశాను. రాత్రంతా మా ఇద్దరికీ పెద్ద గలాటా చివరికి ఏమనుకున్నాడో ఏమో తెల్లారి "నీ ఇష్టంరా" అనేశాడు" అని చెప్పాడు.    

    "భూగోళాన్ని ఎలా తిప్పాలని నీకనిపిస్తుందో, అలా నిన్ను నేను గాల్లో తిప్పాలనిపిస్తోందిరా" అన్నాను.
    
    వారం రోజులుగా వున్న టెన్షన్ బాధా పోయాయి. ఉట్టి రిలీఫ్ కాదు పెద్ద గండం తప్పిపోయిన ఆనందం.
    
    "రేయ్! ఛీర్స్ కొట్టరా" అని కాఫీ గ్లాసు ముందుకు తోశాను. ఇద్దరం ఛీర్స్ కొట్టుకొని కాఫీ ముగించాం.
    
    ఇలా గండం గడిచినా ఈ ప్రమాదం నా వెనక పొంచి వున్నట్లే ననిపించింది.
    
    వాడు ఎప్పుడైనా సేద్యం వదిలి వెళ్ళిపోతున్నట్లే వుండేది. వాడు వెళ్ళిపోతాడేమో, మా ఇంటి దగ్గర సేద్యానికి నిలిచిపోతాడేమో! మళ్ళీ ఈ మైదానంలో ఒంటరిగా మిగిలిపోతానేమోనన్న అభద్రతా భావం మాత్రం లీలగా మెదులుతుండేది. అయితే దాన్ని పట్టించుకునేదాన్ని కాను.
    
    కానీ అది లోపల సలుపుతోంది. ఎంత వద్దనుకున్నా అభద్రతా భావం నాలో నుండి పోయేటట్లు లేదు.
    
    దాన్ని మరిచిపోదామని, అధిగమించాలని ఎంత ప్రయత్నిస్తున్నా వీలు కావడం లేదు. ఎక్కడో ఏదో దిగులు ప్రారంభమైంది.
    
    ఆరోజు అమావాస్య అనుకుంటాను, ఏడుగంటలకే దట్టంగా చీకట్లు అలుముకున్నాయి.
    
    మా ఇంటిముందున్న మైదానంలో చీకటిని ఎవరో ఆరబెట్టినట్లుంది దూరంగా కనిపిస్తున్న చెట్లు ఇంగ్లీషు సినిమాలలోని వింత ఆకారాల్లా కనిపిస్తూ భయపెడుతున్నాయి. గాలి నీరసంగా వీస్తోంది. భరించలేని నిశ్శబ్దం నిద్రపోతున్నప్పుడు ముంచేస్తున్న నీళ్ళ ప్రవాహంలా పరుచుకుంటోంది.