శివరామయ్య ఏడుపు కలిసిన గొంతుతో చెప్పుకుపోతున్నాడు. "మీ ఆడపిల్లల పిచ్చి యిలా ఆయుష్షును తగ్గించేస్తుందని ఎంత చెప్పినా నా మాటలను ఖాతరు చేయలేదు మీరు. అతన్ని ఎలా జైలుకి పంపాలో ఐడియా వచ్చి మీకు సహకరించినందుకు నా ప్రాణాలకూ ముప్పు వచ్చింది."

 

    రాయుడికి గతమంతా సినిమా రీలులా కళ్ళముందు కదిలింది.

 

    తిలక్ అనాధగా బాలమందిర్ లో చేరిపోయాక ఎప్పుడూ తన గ్రామంలోకి రాలేదు. పండుగలకి కానీ, వేసవికాలపు సెలవులప్పుడుగానీ అతన్ని ఇంటికి రావద్దనేవాడు తండ్రి. వస్తే తను తండ్రినన్న విషయం స్కూల్ లో తెలిసిపోతే కొడుకు భవిష్యత్తు అంధకారమయిపోతుందనే ఆయన కన్న మమకారాన్ని బలవంతంగా చంపుకొన్నాడు.

 

    తిలక్ కూడా అంతే. తండ్రినీ, తన అక్కనీ చూడాలనే ఆరాటాన్ని ఎంత అణుచుకుందామన్నా వీలయ్యేది కాదు. అయినా తండ్రి మాట జవదాటకుండా తన ఆవేదనంతా పుస్తకాలతోనే చెప్పుకునేవాడు తిలక్.

 

    స్కూలు చదువు పూర్తయిపోయాక కాలేజీకి వచ్చాడు. ఓరోజు హాస్టల్ కు తనకోసం ఎవరో వచ్చారంటే రూమ్ నుంచి బయటికొచ్చాడు. స్వచ్ఛంగా అప్పుడే విసిరిన ముద్దమందారంలాంటి అమ్మాయి నవ్వుతూ అతనివేపు చూసింది. ఆమెలో తన పోలికలు వున్నాయని గ్రహించడంతోనే ఆమె ఎవరో తెలిసిపోయింది.

 

    "అక్కా" ఎన్నో ఏళ్ళు మనసులో దాచుకున్న మమకారం మాటలకు అడ్డం పడింది.

 

    ఆమె కూడా అంతే. తన తమ్ముడ్ని అలా చూస్తూ నిలబడిపోయింది చాలాసేపు.

 

    "అక్కా"

 

    అని గట్టిగా అనబోయి ఎవరయినా వింటారేమోనని మెల్లగా పిలిచాడు.

 

    "తమ్ముడూ" ఆమె కూడా మెల్లగానే అంది. అయితే ఆ మాటల్లోని ఆప్యాయతకు అతను కదిలిపోయాడు.

 

    ఇద్దరూ అలా ఎవరికీ వినపడకుండా మాట్లాడుకున్నారు.

 

    చివరికి ఆమె చెప్పింది. "తమ్ముడూ! నాన్న చనిపోయాడు రెండురోజుల ముందు. టెలిగ్రామ్ ఇవ్వద్దన్నారు. నాన్న చనిపోయాడని టెలిగ్రామ్ యిస్తే నీకు నాన్న ఉన్నాడన్న విషయం తెలిసిపోతుందని నేను కూడా వద్దన్నాను."

 

    అతను చాలాసేపు మౌనంగా రోదించాడు. తన స్థితికి యెవరు కారణమో అర్థంకాక నిస్సహాయతను కన్నీళ్ళలోకి మార్చుకున్నాడు.

 

    ఆ తరువాత తన అక్క మల్లికకు కన్నీళ్ళతోనే వీడ్కోలు చెప్పాడు. మరో అయిదు సంవత్సరాలకు తిలక్ తన చదువయిపోయాక యింటికి వచ్చాడు.

 

    అప్పటికి మల్లికకు ఇరవై అయిదేళ్ళు వచ్చాయి. మంచి ఉద్యోగం వచ్చాక తన అక్కకు పెళ్ళి చేయాలనుకున్నాడు. పేపర్లు చూసి ఉద్యోగం కోసం దరఖాస్తులు పంపడం దినచర్య అయిపోయింది తిలక్ కి.

 

    ఓరోజు అతని ఆశలపందిరి కూలిపోయింది. మల్లిక బతుకు నాశనమైపోయింది.

 

    రాయుడు చూపు మల్లిక మీద పడింది. ఇరవయి అయిదేళ్ళ పరువాన్ని చూస్తూనే అతని ఆకలిగొన్న సింహంలా అయిపోయాడు. మల్లికను బలవంతంగా ఎత్తుకొచ్చి అనుభవించాడు. దాంతో మల్లిక సిగ్గుతో, అవమానంతో పట్నంకు వెళ్ళిన తిలక్ తిరిగొచ్చే వరకూ ఆగకుండానే బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

 

    మరుసటి రోజు ఉదయమే వచ్చిన తిలక్ కు శవంలా మారిపోయిన అక్క దర్శనమిచ్చింది.

 

    ఊరి జనంవల్ల తన అక్కకు జరిగిన ద్రోహాన్ని తెలుసుకున్న అతను రాయుడిమీద పులిలా దూకాడు. రాయుడి మనుషులు తిలక్ తో తలపడ్డారు. ఇదే సమయమనుకుని రాయుడు పారిపోయాడు. తిలక్ ఇక్కడుంటే తన ప్రాణాలకే ముప్పు అని ఆలోచించిన అతను వెంటనే పోలీసులను పిలిపించాడు.

 

    రాయుడి మీద హత్యా ప్రయత్నం చేసిన నేరానికిగాను తిలక్ కు అయిదు సంవత్సరాలు జైలుశిక్ష పడింది. తన అక్కని రాయుడు చెరిచి చంపేశాడని అతను చెప్పినా కోర్టు నమ్మలేదు. తిలక్ కు ఎవరూ తోడబుట్టినవారు లేరని, తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారని బాలమందిర్ లో వున్న సర్టిఫికెట్ ను రాయుడు చూపించడంతో కోర్టులో తిలక్ చెప్పిందంతా అరణ్యరోదనే అయింది.  

 

    "ప్రభూ! నన్ను ఎలా కాపాడతారో, మిమ్మల్ని ఎలా రక్షించుకుంటారో ముందు ఆలోచించండి. తను అనాధ అని నేనే సర్టిఫికెట్ రాశానని, మీరు కేసులో గెలవడానికి ఆ సర్టిఫికెట్ ను అస్త్రంలా సంధించమని చెప్పింది నేనేనని తిలక్ కి తెలుసు. అందువల్ల నన్నూ, తన అక్క జీవితాన్ని బుగ్గిపాలు చేసినందుకు మిమ్మల్ని వాడు వూరకనే వదిలిపెట్టడు.మహాప్రభూ" శివరామయ్య శోకాలు పెట్టడంతో రాయుడు తిరిగి ఈ లోకంలోకి వచ్చాడు.

 

    తిలక్ ముఖాముఖి తలపడడానికి సిద్ధపడుతూ అక్కడి నుంచి కదిలాడు రాయుడు.

 

                                  *    *    *    *

 

    కారు టౌన్ దాటింది. విశాలమైన రోడ్డుకు అటూ ఇటూ వున్న చెట్లు పచ్చటి పందిరి వేసినట్టు పరుచుకుని వున్నాయి. మధ్యాహ్నపు గాలయినా చల్లగా తగులుతున్నట్టుంది లాలసకు.

 

    "కంగ్రాట్చ్యులేషన్స్" అంది మళ్ళీ పక్కనున్న తిలక్ వైపుకు తిరుగుతూ ఆమె.

 

    అంతవరకు మాట్లాడలేకపోయింది. ఏదో తెలియని ఆనందం పుక్కలింత లౌతున్నట్టు, ఉద్వేగం కెరటాలై పొంగుతున్నట్టు అనిపించి నోటినుంచి మాట వూడిరాలేదు.

 

    ప్రభుత్వం తిలక్ కు క్షమాభిక్ష పెట్టి, జైలు నుంచి రిలీజ్ చేయడం ఆమె వూహించని విషయం. ఇక తిలక్ పోలీసులకు కంటపడకుండా అజ్ఞాతంగా వుండాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ తన పక్కనే వుంటాడన్న భావన ఆమెను వుక్కురి బిక్కిరి చేస్తోంది.

 

    తిలక్ ఆమెవైపు చూసి చిరునవ్వు నవ్వాడు.

 

    "నాకయితే కలలా వుంది. ఇంత మంచి గుడ్ న్యూస్ వింటానని అనుకోలేదు" అంది ఆమె మళ్ళీ.

 

    "నాకూ అంతే. ఏమైపోయావు ఇన్ని రోజులూ? రోజూ నిద్రలేచినప్పట్నుంచి, తిరిగి నిద్రలేచేవరకూ అప్పుడప్పుడు పిల్లతిమ్మెరలా గుర్తొచ్చేదానివి" అన్నాడు అతను. ఆ మాటల్లోని ఆత్మీయతకు ఆమె పులకరించిపోయింది.  

 

    "ఉత్తరుడు చనిపోవడంతో షాక్ తిన్నాను. మీరు అదే పరిస్థితిలో వున్నారనిపించి జైలుకు రావడానికి మనసొప్పలేదు. ఎన్నో రోజులు ఆ బాధలోనే వుండిపోయాను. ఆ తరువాత జైలుకు వద్దామనుకున్నాను. కానీ జైలు లోపలికి నన్ను పంపడానికి అధికారులు అంగీకరించలేదు. దాంతో కొన్ని రోజులు ఆగి, తిరిగి నిన్ను ఏదో విధంగా కాంటాక్ట్ చేద్దామనుకున్నాను."

 

    "పాపం ఉత్తరుడు స్వేచ్ఛకోసం జరిగిన పోరాటంలో అసువులు బాశాడు. ఇప్పుడు వుంటే ఎంత సంతోషించేవాడో" అతని గొంతు గాద్గధికమయింది.

 

    కారు వెనుకనున్న బుద్ధుడు మాత్రం వాళ్ళ మాటలకు అడ్డుపడకుండా కొత్తగా ప్రపంచాన్ని చూస్తున్నట్టు విండోలోంచి ముఖం బయటపెట్టి గమనిస్తున్నాడు.

 

    కారు మరో పదినిముషాలపాటు పరుగెత్తింది.

 

    అంతలో లాలస ఏదో నిర్ణయించుకున్నట్టు కారును రోడ్డు పక్కనున్న ఓ చెట్టుకింద ఆపింది. కొద్ది దూరంలో ఏవో రెండు మూడు అంగళ్ళు వున్నాయి.

 

    "ఇక్కడ కాసేపు రిలాక్స్ అవుదాం" అని మరోమాటకు తావివ్వకుండా ఆమె కారు దిగింది.