"పుస్తె ఒకటే మన ఇద్దరిమధ్యా బంధం కాకూడదు. అంతకుమించింది, అమూల్యమైనది నాకు కావాలి. నాకు జరగాలి. అందుకనే అనుమానం...."

    "అనుమానాలుండటం అవసరమే. లేకపోతే నమ్మకాలకు విలువ పెరుగదు" అన్నది జ్ఞానసుందరి.

    "ఒక విషయం నేనంటే తెల్లబోతావేమో?"

    "ఏమంటే?"

    "నన్ను పెళ్ళాడటంలో నువ్వు ముందూ వెనకా ఆలోచించలేదంటే..."

    "ఆలోచించానంటే?"

    "ఇరవైనాలుగు గంటల్లో ఆలోచించడానికి నీకు ఆవకాశం ఎక్కడుంది?"

    "అలా అంటావేం మురళీబాబూ!" అన్నదామె అతని ముఖంలోకి చూస్తూ. అతను చకితుడై ఆమె వైపు ముఖం త్రిప్పాడు.

    "మిమ్మల్ని అలా సంబోధించినందుకు అభ్యంతరం లేదు కదా?"

    "అభ్యంతరమా? ఒక దివ్యమైన అనుభూతి కుదిపేసింది."

    "కృతజ్ఞురాల్ని....ఇరవై సంవత్సరాలలో ఆలోచించలేనిది, ఇరవైనాలుగు గంటల్లో ఆలోచించవచ్చంటాను నేను. కనీసం నాకు సంబంధించినంతవరకూ ఆ ఇరవైనాలుగు గంటలకు అంతవిలువ ఇచ్చాను. ఆ విలువకు, నా నిర్ణయానికి ఇహ తిరుగే లేదు" అంది దృఢ స్వరంతో.

    "అంత అహంభావం చేటు సుమా జ్ఞానా!"

    "ఇది ఆహంకారమంటారా మీరు? ఆత్మవిశ్వాసం అనుకోరూ?"

    "పోనీ ఆత్మవిశ్వాసం. నీ ఆత్మ అంత గొప్పదా ఏం? అది నీకు కీడు చెయ్యదా?"

    "క్రమశిక్షణకు అలవాటుపడి కలుషితమవటమంటే ఏమిటో తెలియని ఆత్మ ఎందుకు కీడు చేస్తుంది మురళి బాబూ?"

    "ఒకవేళ త్రాగుబోతుననుకో....?"

    "అది కేవలం దురలవాటు. అంతమాత్రాన మనసుల్లో నమ్మకం నశించిపోలేదు."

    "వ్యభిచారిని అయితే?"

    ఆమె గుండెలనిండా గాలి పీల్చుకుంది. "అలాంటి మనిషే అనుకుని నా ఆలోచన ప్రారంభించాననుకోండి!"

    "అలాంటప్పుడు అంత త్యాగం ఎందుకు చేయాలి నీవు?"

    "మీరు ప్రతిదానికీ త్యాగం, ధర్మం, నీతి అని పెద్దపెద్ద పేర్లు తగిలించకండి మరి ఏదో ఒక లోపాన్ని ఆధారం చేసుకుని వ్యక్తిని చదవకూడదు. సంపూర్ణంగా అన్ని కోణాలనుంచీ అవలోకొంచగలగాలి. అప్పుడా మనిషి హిమాలయంగా దర్శనమిస్తే ఈలోపం తుషారబిందువులా కరిగి కారిపోతుంది."

    "నేను హిమాలయాన్ని కాదుగా?"

    ఆమె మందహాసం చేసింది. "దయవుంచి ఆ విషయంమాత్రం గ్రుచ్చిగ్రుచ్చి అడక్కండి. నేనుకూడా కొన్ని విషయాల్లో లజ్జితురాలను అవుతుంటాను. అంత ముఖాముఖి ఏం మాట్లాడను చెప్పండి?"

    ఆమె చెప్పింది నిజమే. ఆ చాలీచాలని వెలుతురులో ఆమె ముఖంమీద అరుణారుణ కాంతి వ్యాపించటం అతను చాశాడు. అతడి మేను పులకరించినట్లయింది.

    కారు శాంతినగర్ లో ప్రవేశించి, చివరకు ఒక పెద్ద భవనంముందు ఆగింది. గేటు ప్యూన్ కంగారుపడుతూ తలుపులు తెరిచాడు. కారు లోపలకు సాగి, పోర్టికోలో ఆగింది.

    ఒక పావుగంట గడిచాక జ్ఞానసుందరి బట్టలు మార్చుకుని గదిలోకి వచ్చేసరికి అతను కిటికీ తెరలను ప్రక్కకు తొలగించి నిశీధంలోకి చూస్తూ కనిపించాడు.

    అతని ఉన్నతమైన మూర్తి ఆమెకు అపురూపంగా, కనుల పండుగగా గోచరించింది. ఎంత పొడవుగా, విశాలంగా, దృఢంగా, ఆరోగ్యంగా వున్నాడు! ఏమి దేహధారుడ్యం! నైట్ డ్రస్ అతడి శారీరాన్ని చాలాభాగం కప్పేస్తున్నా మణి కట్టునుంచి అతని పొడుగాటి వ్రేళ్ళవరకూ బహిర్గతమవుతూ....తెల్లగా, ఏమి కాంతితో మెరుస్తున్నాయి! అసలు పైనుంచి క్రిందకు ఓసారి చూస్తే....ఏమి ఉజ్వల, రమణీయమైన విగ్రహం........!

    అడుగుల సవ్వడి విని అతను వెనక్కి తిరిగాడు. దీపాల్లాంటి అతడి కళ్ళు, వాటివుంచి వెలువడే కాంతి కిరణాలు....కళ్ళచూట్టూ సుర్మా పులిమినట్లు, కాటుక దిద్దినట్లు సహజంగా అమరిన నల్లని చుట్టుగీత.

    ఇతను వ్యభిచారా? ఇతను త్రాగుతాడా? ఇతనికి బాధలున్నావా? చంద్రుని సృష్టించగల మూలపురుషుడు ఎందుకు మలినమవుతాడు? మలినరేఖలు అందర్నీ స్పృశించలేవుగా.

    ఇవి జ్ఞానసుందరి దివ్యమైన అనుభూతులు, ఆమె ఇలానూ ఆలోచించగలదని అతనికి తెలియదు.

    "ఏమిటి చూస్తున్నావు జ్ఞానా?" అని ప్రశ్నించాడు చకితుడై.

    "మీ రూపురేఖల్ని, విలాసాల్ని" అని చెబుదామనుకుంది ఆమె. ఆమె కపోలాలు సిగ్గుతో ఎర్రబారాయి. ఈ సహజసంపదే లేకపోతే ఆమె ఎంత సంస్కారముగల మానవి అయినా అవుగాక, ఏ స్త్రీతోనూ ఏ పురుషుడూ కాపురం చేయలేడు.

    "మీ హృదయాన్ని."

    "అంతేకానీ, ఈ శరీరం నీకు వద్దన్నమాట?"

    "ఎంత మాట? కానీ అసలు హృదయాన్నిబట్టే శరీరం ఏర్పడుతుందని నా ఉద్దేశ్యం!"

    ఈ సత్యం విని అతను చాలించాడు. ఈ సత్యం నిజమే అయితే మనకు కావలసిన వస్తువును ఎంత తేలిగ్గా ఏరుకోవచ్చు! నిర్మల హృదయాలే ఇలాంటి వ్యాఖ్యానం కూడా చేయగలరు.

    "ఇలాంటి అమృతసత్యాలు ఈ భూమికి ఇమడవు జ్ఞానా!" అన్నాడు విచారంగా.

    కొద్ది క్షణాలు మౌనంగా గడిచాయి. విశాలమైన ఆ గది పాదరసంవంటి విద్యుత్ కాంతితో వెలిగిపోతుంది. మురళి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. "ఇలా రా జ్ఞానా!" అని పిలిచాడు. ఆమె వచ్చి అతనికెదురుగా ఆసీనురాలైంది.

    అతడామె వదన మండలంమీదనే దృష్టి నిలిపి "నన్ను గురించి నీ ఉద్దేశం ఏమిటి?" అని అడిగాడు.

    "మీకు శాంతిని పొందటం తెలీదని!" ఆమె సూటిగా సమాధానం చెప్పింది.

    అతనో నిట్టూర్పు విడిచి "ఇంకా చెప్పు" అన్నాడు.

    "జీవితం పట్ల మీకు గౌరవం వుందిగానీ నమ్మకం లేదని. జీవితం పట్ల ఆసక్తి వుందిగానీ మీరు నిండుధైర్యంతో దగ్గరకు తీసుకోలేనీ, జీవితాన్ని మీరు ఆశించగలరు గానీ ప్రేమించలేరని......"

    "అవన్నీ నాకు తెలీదు. కానీ తరచి చూస్తే నిజం కావచ్చు."

    ఆమె ఏమీ వ్యాఖ్యానించలేదు.

    రెండుమూడు క్షణాలు ఏదో తీవ్రంగా ఆలోచించి చివరికతను ఆవేశ, ఉద్వేగాలతో చెప్పసాగాడు. "జ్ఞానా....నేను....నేను జీవితంలో పోటాడి ఎదిగిన మనిషిని. నేను తిన్న దెబ్బలకు, ఎదుర్కొన్న సంఘటనలకు రాటుదేలి దేన్నీ లెక్కచేయని ఓ నిర్లక్షకునిగా, నీతి, జ్ఞానం అక్కర్లేని అవకాశవాదిగా తయారు కావలసింది కానీ ఆశ్చర్యం! అలా అవలేదు నేను. జీవిత శిఖరాగ్రాలను చేరుకోవటంలో ఎంత తపస్సు చేశానో, ఎన్ని మార్గాలు అన్వేషించానో లెక్కలేదు. కానీ పైకి రావటమనే ఒక లక్ష్యానికే గురిచేశాను గానీ, రుచి తెలియని మృగంలా  మారలేకపోయాను.