ఆమె ఛాలెంజ్ చేసిన గడువు దాటిపోయింది.

 

    బహుశా దొరికిపోతాననే క్యారేజ్ తీసుకొని వచ్చి వుండదని శ్రీధర్ ఆలోచిస్తుండగా ఫోన్ మ్రోగింది.

 

    శ్రీధర్ రెండంగల్లో ఫోన్ వద్దకు చేరుకొని లిఫ్ట్ చేసి.

 

    "హలో" అన్నాడు.

 

    "హాయ్! నేను" ఆమె కంఠమే. మధురమైన కంఠధ్వని.

 

    "నిలబెట్టుకోలేని ఛాలెంజ్ చేయకూడదు" అన్నాడు శ్రీధర్ కావాలనే ఆమెను ఇరిటేట్ చేస్తూ.

 

    "అలాంటి ఛాలెంజ్ నేనెప్పుడూ చేయను" ఆమె కంఠంలో అమితమైన ఆత్మవిశ్వాసం తొంగిచూసింది.

 

    "క్యారేజీ పంపిస్తాను. నేనే అందిస్తాను. ఇంకో గంటలో అని అన్నావ్. ఇప్పుడు టైమెంత అయిందో తెలుసా?" వేళాకోళంగా అన్నాడు.

 

    "ఎంతయిందో నువ్వే చూసి చెప్పు" అందామె.

 

    "9.35 అయింది."

 

    "నా ఛాలెంజ్ వీగిపోలేదు?" నవ్వుతూ అందామె.

 

    "సరిగ్గా 9.30కి క్యారేజ్ అందిస్తానన్నావు. ఇమ్తావ్అరకూ లేదుగా?"

 

    "లేదని ఎవరన్నారు?"

 

    "నేనే"

 

    "ఎందుకలా?"

 

    "క్యారేజ్ నువ్వు యివ్వలేదు గనక."

 

    "ఇవ్వలేదని ఎలా అనుకున్నావ్?" నవ్వుతూ అడిగిందామె.

 

    "నన్ను ఫూల్ ని చేయొద్దు...?" రవ్వంత అసహనాన్ని తోడు తెచ్చుకుని అన్నాడు శ్రీధర్.

 

    "ఆ అవకాశం మరొకరికి ఇచ్చేలా లేవు నువ్వు."

 

    "వాడ్డూ యూ మీన్?"

 

    "ఐ మీన్ వాట్ ఐ సే... క్యారేజ్ 9.30కే నీకు చేరింది. నువ్వే దాన్నింకా గుర్తించలేదు. తీసుకోలేదు."

 

    "వ్వాట్...!!" అంటూ శ్రీధర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసాడు.

 

    "అక్కడేమి వుండదు. విండో దగ్గరకు వెళ్ళి చూడు..." ఆమె మాటలు కార్డ్ లెస్ లో వినిపించాయి.

 

    తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనవుతూ, పరుగెత్తుకుంటూ కిటికీ దగ్గరకు వెళ్ళాడు.

 

    వస్తూనే అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి బిత్తరపోయాడు శ్రీధర్.

 

    కిటికీ బయటవైపు క్యారేజ్ గాల్లో వేలాడుతూ కనిపించింది. దానికో నైలాన్ తాడు కట్టివుంది.

 

    కొద్ది క్షణాలు తను ప్రత్యక్షంగా చూస్తున్నదేమిటో తనకే అర్థం కాని అయోమయంలో పడిపోయాడు శ్రీధర్.

 

    "అది నీ కిటికీ ముందుకి సరిగ్గా 9.30కే చేరుకుంది. దాన్ని నేనే అక్కడికి చేర్చాను. ఈ పనికి నేను మరొకరి సహాయం తీసుకోలేదు. ఒట్టు..." ఫోన్ లో కిలకిలమనే నవ్వుతోపాటు ఆ మాటలు వినిపించాయి.

 

    ఆమె మాటలు విని కొద్ది క్షణాలపాటు అచేతనమైన స్థితికి లోనయ్యాడు శ్రీధర్.

 

    అయినా వెంటనే తేరుకొని కిటికీలోంచి తల బయటకు పెట్టి పైకి ఆకాశంలోకి చూసాడు.

 

    ఓ సన్నటి బలమయిన నైలాన్ తాడుకి ఆ క్యారేజి వేలాడుతూ కనిపించింది.

 

    అంటే...ఇది...అని శ్రీధర్ ఆలోచిస్తుండగానే ఫోన్ లో తిరిగి మాటలు వినిపించాయి.

 

    "నేనిప్పుడు ఇంకా నువ్వుండే బ్లాక్ లోనే వున్నాను. ఇప్పుడే మూవ్ అయి నా బ్లాక్ కేసి వెళ్ళబోతున్నాను."

 

    "మరి ఫోన్ లో ఎలా మాట్లాడగలుగుతున్నావ్? సెల్యులర్ ఫోనా?"

 

    "సందేహానికో ప్రశ్న...ఆ ప్రశ్న చివర సరయిన సమాధానం. వెరీగుడ్...గుడ్ ప్రోగ్రెస్...యూ ఆర్ రైట్" అని ఆమె అంటూండగానే కార్డ్ లెస్ ఫోన్ ని అలాగే చేతిలో వుంచుకొని చిరుత పులిలా ఆ ఫ్లాట్ లోంచి బయటపడి మెట్లమీంచి క్రిందకి దిగసాగాడు, రెండు మూడు మెట్లని ఒక్కో అంగలో అధిగమిస్తూ.

 

    అపరిచితురాలు వస్తుందని ఎదురుచూస్తున్న జయారెడ్డికి బయటకు పరుగెడుతున్న శ్రీధర్ కనిపించాడు.

 

    ముందా దృశ్యం ఆమెకు జీర్ణం కాలేదు.

 

    ఆ పనిని పక్కన పెట్టి, ఆమె అక్కడినించి కదిలి శ్రీధర్ని పరుగు లాంటి నడకతో అనుసరించసాగింది.

 

    వాళ్ళిద్దరూ గ్రౌండ్ ఫ్లోర్ కి చేరుకొని, రెట్టింపు వేగంతో ఫ్లాట్ మధ్యలో వున్న గ్రౌండ్ కేసి పరుగెత్తటం చూసిన యోగికి అసలేమీ అర్థం కాలేదు.

 

    ఎందుకయినా మంచిదని తనూ వాళ్ళను అనుసరించసాగాడు.

 

    అమితవేగంతో దూసుకుపోతున్న శ్రీధర్ కి, దూరంగా ఒక ఆకారము చేతిలో ఏదో పెద్ద వస్తువుతో వెళ్ళటం అస్పష్టంగా కనిపించింది. అంతే అతని కాళ్ళలోకి పి.టి.ఉష ప్రవేశించినట్లయింది.

 

    ముగ్గురు వ్యక్తులు ఫ్లాట్స్ మధ్య పరచుకున్న నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ రావటం ముందుకెళుతున్న పూజకి అర్థమైపోయింది.

 

    ఆ మరుక్షణమే ఆమె నడకలో వేగం పెరిగింది.

 

    మరో నిముషానికి శ్రీధర్, ఆపోజిట్ ఫ్లాట్స్ వరండాలోకి ప్రవేశించేసరికే అపరిచితురాలి జాడ లేదు.

 

    ఒక్కసారి నిస్పృహకి లోనయి పరిసరాల్ని శ్రద్ధగా గమనిస్తున్నంతలో యోగి, జయారెడ్డి వచ్చేశారు.

 

    వాళ్ళు వస్తూనే అడిగారు ఏం జరిగిందని, జరిగిందంతా చెప్పాడు శ్రీధర్.

 

    "An inch of time can not be bought by an inch of gold. ఒక ఆడపిల్లని ఛేజ్ చేసి పట్టుకోలేకపోయావు. ప్రాబబిలిటీ మీద బేసై అటు లిఫ్ట్ దగ్గరకో, ఇటు మెట్లవేపో వెళ్ళుంటే దొరికిపోయేది గదా! అనవసరమైన సందేహాలతో అమూల్యమైన క్షణాల్ని వృధా చేశావు" చిరాగ్గా అన్నాడు యోగి.

 

    "నువ్వు మాత్రం ఏం చేశావు? క్యారేజ్ తీసుకొస్తానని ఛాలెంజ్ చేసిన అమ్మాయి నలుగురికి తెలిసిపోయేలా క్యారేజ్ ని చేత్తో ఊపుకుంటూ వస్తుందా? గ్రౌండ్ ఫ్లోర్లో వున్న లిఫ్ట్ కేబిన్ కి కొంచెం దూరంలో చీకటి ప్రదేశంలో దాక్కున్నవాడివి, ఆమె చేతిలో సూట్ కేస్ చూసి, ప్రాబబిలిటీ మీద బేసై, ఆ అమ్మాయిని ఆపి ప్రశ్నించవచ్చుగా! ఎవరో వూరునుంచి వస్తున్నారని -ఊరోడిలా నువ్వు వదిలేయలేదా? జయారెడ్డి నేనుంటున్న ఆరవ ఫ్లోర్లో కారిడార్ మీద కన్నేసి, స్టెయిర్ కేస్ క్రీనీడలో హైడయివుండి ఏం చేసింది?" శ్రీధర్ అసహనంగా అన్నాడు.