ఇంతలో సదానందం లోపలికి వచ్చాడు. భార్యకి సైగచేసి "వీళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు?" అన్నాడు.
"అర్ధం అయి చావడంలేదు మన విషయమేనేమో.... సరే పదండి అన్నం తిందురుగాని."
మీనాక్షి వెనకాలే సదానందం ఇంట్లోకి వెళ్లిపోయాడు.
శక్తికి నీరసం వచ్చింది.
ఇంద్రనీల్ కి ఆయాసం వచ్చింది.
తాతగారు చెంబుతో మంచినీళ్ళు తెచ్చి ఇంద్రనీల్ కి అందిస్తూ "బావుందర్రా! కాంపౌండ్ మీరొచ్చాక సందడిగా మారింది" అన్నారు.
"అలిసిపోయి వుంటారుగానీ, వెళ్ళి అన్నాలు తినండి మంచం ఎక్కుదురు గాని" అంది మామ్మగారు.
ఓ గంట తరువాత "ఈ కార్యక్రమం ఏమిటో బాగానే వున్నట్లుంది అసలు టైమే తెలియలేదు" అన్నాడు ఇంద్రనీల్.
శక్తి ఉడుక్కుంటూ "ఆ సదానందాన్ని అంత వెనకేసుకొచ్చావేం? ఫ్రీగా బీడీ పీకలిచ్చాడా?" అంది.
ఇంద్రనీల్ నవ్వి ఆమె జడ సవరిస్తూ "పేరిశాస్త్రిని చేసుకోవలసింది అని ఆవిడ అనకుండా వుండాల్సింది..." అన్నాడు.
"మళ్ళీ అదే కూత! చెయ్యి తీయ్..." అరిచింది శక్తి.
"సర్లే.... వాళ్ళ గొడవ మనకెందుకూ? దగ్గరకి రా" అతను ఆమెని బలంగా తనవైపుకి తిప్పుకున్నాడు.
శక్తి మౌనంగా మారింది.
ఇంద్రనీల్ ఆమెని తమకంగా ముద్దాడుతూ వుండగా "మీనాక్షిదేం తప్పుకాదు. సదానందందే తప్పు" అంది.
అతను ఆమె పెదవులను తన పెదవులతో మూసేశాడు.
ఆమె తియ్యగా మూల్గింది.
అతను ఆమె ముఖాన్ని రెండుచేతుల మధ్యకీ తీఉస్కుని కళ్ళలోకి చూశాడు.
మత్తుగా ఆమెకళ్ళు వాలిపోయాయి.
"అసలావిడ.... పేరిశాస్త్రి పేరు ఎత్తకుండా వుండాల్సింది" అన్నాడు.
ఆమెకి అతను అన్నది మొదట అర్ధంకాలేదు. అర్ధంకాగానే కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. వెంటనే కోపం వచ్చింది.
"ఛీ... పో" అంది.
"పోనా?" కొంటెగా అడిగాడు.
"ఒద్దులే" అంది.
గుండెల్నిండా ఊపిరి పీల్చుకుని వదిలినట్లుగా పిల్లగాలి వచ్చింది.    
                                       * * *
బ్యాంక్ దగ్గరకొచ్చిన తండ్రిని చూడగానే చాలా సంతోషం కలిగింది శక్తికి.
"నాన్నా! బావున్నావా?" అంది ఆప్యాయంగా.
"ముసలాడ్ని, నా సంగతేంగానీ.... నీ కొత్తకాపురం ఎలా వుందీ? అల్లుడుగారెలా వున్నారూ?" అడిగాడు గోపాలరావు.
"ఇంటికి రండి చూద్దురుగాని" నవ్వింది.
ఈ నవ్వులోని సంతృప్తి ఆయన తండ్రి హృదయం అర్ధం చేసుకుంది. కనపడని దేవుడికి వినపడనంత నెమ్మదిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
శక్తి, గోపాలరావూ బస్ లో కూర్చున్నాక ఆయన పెద్దకూతురి ఆర్ధిక సమస్యలగురించీ, చిన్న కూతురి పురిటి ఖర్చుల గురించీ మాట్లాడాడు.
"వేరే ఇంట్లో వున్నంత మాత్రాన నేను పరాయిదాన్నయిపోయానా నాన్నా? నీ ఇంట్లోనే మేం వుంటే అద్దె లేకుండా సుఖపడిపోతున్నామని బావలు నిన్ను చంపుకుతింటారని ఆలోచించి యిలా వచ్చేశాను" అంది.
"ఇన్నాళ్ళూ వాళ్ళ పురుళ్ళూ అవీ ఇంట్లో ఆడదిక్కుగా నువ్వు వున్నావని చూసుకున్నాను. ఇంక నా వల్లకాదమ్మా! మరి చిన్నబావ ఈసారి ఇక్కడికే పంపించే ఉద్దేశంలో వున్నట్లు మాట్లాడాడు" అన్నాడు.
"కుదరదు అని చెప్పెయ్యి ఆయన మగపిల్లాడు పుట్టేవరకూ కంటూ పోతే ఎన్ని పురుళ్ళని పోస్తావూ?" కోపంగా అంది.
"పెద్ద అమ్మాయికి నాలుగు పురుళ్ళు పోశారు. మాకు ఒక్కటికూడా చెయ్యరా అంటాడేమో!"
"మొదట్లో అలిగి ఆయన పంపకపోతే అది మన తప్పవుతుందా?"
"అరిటాకూ ముల్లూ సామెతమ్మా ఆడపిల్లల తండ్రుల పరిస్థితి" భారంగా అన్నాడాయన.
ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఇల్లు చేరారు.
"ఇదేనా అమ్మా ఇల్లు?" అడిగాడు గోపాలరావు.
శక్తికి కూడా అదే అనుమానం వచ్చేలా వుంది అక్కడి పరిస్థితి.
మీనాక్షి పిల్లలిద్దరూ ఒంటికీ, మొహానికీ మసి మరకలతో బొత్తెడు కాయితాలూ చింపి పోగులు పెట్టుకుని, జిగురూ, రంగులతో ఏదో చేస్తున్నారు అదీ మంచం నడిమధ్యన కూర్చుని.
శక్తి తండ్రివైపు చూసి "వెనకింటి వాళ్ళ పిల్లలు...." అని "అంకుల్ ఏరీ?" అంది గట్టిగా పిల్లలతో.
వాళ్ళు వినిపించుకోనంత హడావుడిగా వున్నారు.
ఇంద్రనీల్ లోపల్నుంచి కళ్ళు మూసుకుని నడుస్తూ వచ్చి "ఎవరూ వచ్చిందీ?" అన్నాడు.
"నేనే.... శక్తిని ఇంటి పరిస్థితేమిటి ఇలా వుంది?" అరిచింది.
"కనబడటంలేదు" కళ్ళు మూసుకునే అన్నాడు.
"ఏం! కళ్ళు పోయాయా?" కసిరినట్లు అడిగింది.
"కుంకుడుకాయ రసం కంట్లో పడింది."
"కుంకుడుకాయలతో తలంటుపోసుకున్నావా?"
"నేను కాదు.... ఎదురింట్లో ఆవిడా..."
"ఆ! ఎదురింటి ఆవిడకి తలంటుపోశావా?" శక్తి వీలైనంత నోరు తెరిచి అడిగింది.
"అబ్బా....ఊరికే అడ్డుపడకు. ఆవిడచేత తలంటుపోయించుకోవడం లేదని వాళ్ళ పిల్లాడ్ని చావబాదుతుంటే నేను మందలించి, పిల్లాడికి మంచి మాటలతో నచ్చజెప్పి తలంటుపోశాను. ఆవిడ ఎంత సంతోషించిందో తెలుసా శక్తీ" ఆనందంగా అన్నాడు.
"మరి వీళ్ళ సంగతేమిటి?" మంచం నడుమెక్కి కూర్చుని ఈ కాయితాలూ, జిగురుతో వీళ్ళేం చేస్తున్నారూ?"