"మేడమ్... ఈ ఫ్లాట్స్ మధ్య గుడేదైనా వుందా?" ఆటోని నెమ్మదిగా పోనిస్తూ అడిగాడు ఆటోడ్రైవర్.

 

    "చిన్న గుడి వుంది. షిర్డీ సాయిబాబాది. ఏం, లోపలకెళ్ళి దర్శనం చేసుకోవాలనుందా?" అడిగింది పూజ- వేనిటీ బ్యాగ్ లోంచి అమృతాంజన్ డ్రాగన్ బామ్ తీసి నుదుటికి రాసుకుంటూ.

 

    "మీ మొక్కు తీరాక ఆలోచిస్తాను మేడమ్" అన్నాడు ఆటోడ్రైవర్.

 

    "నా మొక్కా... అదేమిటి... అది తీరటమేమిటి?" అర్థంకాక అడిగింది పూజ.

 

    "మొత్తం ఎన్ని ప్రదక్షిణాలు మొక్కుకున్నారు?"

 

    "ప్రదక్షిణాలా? దేనికి? ఎవరికి?"

 

    "దేవుడికి. అందరూ మీలాగే గుడిచుట్టూ కాకుండా, గుడివున్న ఫ్లాట్స్ చుట్టూ, గుడి వున్న కాలనీ చుట్టూ కాళ్ళతో కాకుండా, ఆటోలో ప్రదక్షిణాలు చేస్తే మా ఆటోవాళ్ళు నెలరోజుల్లోనే టాక్సీలకి ఓనర్స్ అయిపోతారు" అన్నాడు ఆటోడ్రైవర్ ఆనందపడిపోతూ.

 

    అప్పటికి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న పూజ, అంతచిరాకులోనూ గుండెలనిండుగా, మనసారా నవ్వేసింది.

 

    "ఎన్ని ప్రదక్షిణాలో చెప్పారు కాదేం?" తిరిగి అడిగాడు ఆటో డ్రైవర్.

 

    "ఎన్నో ఇప్పుడే చెప్పలేను. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోవాలిగా..."

 

    "మీరెన్ని ప్రదక్షిణాలు చేస్తేమటుకు దేవుడు అక్కడినుంచి ఎందుకెళతాడమ్మా?" అమాయకంగా అడుగుతున్న అతన్ని చూసి తిరిగి కిలకిలమని నవ్వేసింది పూజ.

 

    "మీరెంత అందంగా నవ్వుతారమ్మా! గుండెలనిండుగా, ఏ సంకోచం లేకుండా నవ్వేవాళ్ళ గుండెల్లో దేవుడు కొలువుంటాడట" అన్నాడతను ఎంతో మెచ్చుకోలుగా.

 

    అతని మాటలు పూజకి ఆ క్షణాన ఎంతో ఆనందాన్ని కలిగించాయి. తన ఫ్రెండ్స్, కొలీగ్స్, చివరాఖరికి శ్రీధర్ సయితం తన నవ్వు బాగుందనే అంటాడుగాని-నవ్వే గుండెల్లో నవ్వించే దేవుడు కొలువుంటాడని మాత్రం అనలేదు.

 

    భావుకత అన్నది... ఏ ఒక్కరి సొత్తు కాదేమో... కాకపోతే వ్యక్తం చేయడం మాత్రం కొందరి సొత్తే అనిపిస్తుంది.

 

    ఆమె అలా ఆలోచిస్తుండగానే, ఆటో తిరిగి గేట్ దగ్గరికి వచ్చేసింది. పూజ చటుక్కున వంగి చూసింది.

 

    గేట్ కి ఒక పక్కగా కిళ్ళీకొట్టు దగ్గర శ్రీధర్, యోగి కూల్ డ్రింక్ తాగుతూ కనిపించారు.

 

    అంతే... ఒక్క క్షణం పూజ ఊపిరి పీల్చుకొని-

 

    "ప్రదక్షిణాలు అయిపోయాయి... ఆపు" అంటూనే మీటర్ చూసి-దానికో పది కలిపి అతనికిస్తూనే ఆటోలోంచి లేడిపిల్లలా దూకేసి సుడిగాలిలా మెయిన్ గేట్ లోంచి లోపలకు దూసుకుపోయింది పూజ.

 

    ఆటోడ్రైవర్ క్షణకాలం బిత్తరపోయి, ఆటో ఇంజన్ ఆఫ్ చేసి, శ్రీధర్, యోగి వున్న కిళ్ళీకొట్టు దగ్గరకెళ్ళి బ్రిస్టల్ సిగరెట్ తీసుకొని దాన్ని కొబ్బరితాడుతో వెలిగించుకుని-

 

    "సార్! నాకో చిన్న డౌట్...ఈ ఫ్లాట్స్ మధ్యనున్న సాయిబాబా గుడికి ప్రదక్షిణాలు గుడిచుట్టూ కాకుండా, ఈ ఫ్లాట్స్ చుట్టూ చేస్తారా? అదీ కాలినడకన కాక, ఆటోల్లో ప్రదక్షిణాలు చేస్తారా?" యోగి నుద్దేశించి అడిగాడు ఆటోడ్రైవర్.

 

    అప్పుడే ఖాళీ అయిన సాఫ్ట్ డ్రింక్ బాటిల్ ని ట్రేలో వుంచి సిగరెట్ వెలిగించుకోబోతున్న యోగి అతని మాటలకు తెల్లముఖం వేశాడు.

 

    "నీకసలు బుద్ధుందా? ఎవరయినా గుడిచుట్టూ ప్రదక్షిణాలు చేయకుండా, గుడి వున్న ఫ్లాట్స్ చుట్టూ, కాలనీ చుట్టూ, ఊరు చుట్టూ చేస్తారా?" చిరాగ్గా అన్నాడు యోగి.

 

    "దీనికే ఇంత చిరాకు పడిపోతారెందుకండీ? ఇప్పుడు నేనేమన్నానని? నేనేమన్నా ఊరికే, ఉత్తినే అన్నానా? ఇప్పుడే ఒకమ్మాయి అలాచేస్తే ఒక వేళ ఈ గుడికి-అలాంటి ప్రత్యేకత వుందేమోనని అడిగానంతే" ముఖం చిన్నబుచ్చుకుని, అమాయకంగా ఆటోకేసి వెళ్ళాడతను.

 

    "వీడెవడ్రా బాబూ! వీడికి మెదడు మోకాళ్ళలో కూడా లేనట్లుంది." అన్నాడు యోగి సిగరెట్ పొగ వదులుతూ.

 

    "పాపం వాడిదేముంది? ఎవరో అమ్మాయి అలా చేసుంటుంది. అందుకే అలా అడిగుంటాడు. అయినా ఆటోలో ఈ ఫ్లాట్స్ చుట్టూ ప్రదక్షిణాలు చేయటమేమిటి? ఆ అమ్మాయికి స్క్రూలూజేమో" అని శ్రీధర్ అంటుండగానే-

 

    "సార్! మీ ఇద్దరిలో శ్రీధర్ గారెవరు?" అనడిగాడు పాన్ షాప్ ఓనర్.

 

    "నేనే... ఏం?" అన్నాడు శ్రీధర్.

 

    "మీకు ఫోన్..." అంటూ అందించాడతడు.

 

    తనకి ఫోనా? అదీ అక్కడికి? ఎవరు చేసుంటారు? అని ఆలోచిస్తూ ఫోన్ అందుకున్నాడు శ్రీధర్.

 

    "హలో...హాయ్...నేనే...ఏంటి మెయిన్ గేట్ దగ్గర బీట్ వేశావ్? మాళవిక కోసమా?" ఫోన్ కి ఆవేపునుంచి అడిగింది పూజ.

 

    క్షణకాలం తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనయిన శ్రీధర్ వెంటనే తేరుకున్నాడు.

 

    "ఇప్పుడెక్కడినుంచి చూస్తున్నావ్? నువ్వెక్కడి నుంచైనా చూడగల ఏర్పాట్లు చేసుకున్నావా కొంపతీసి."

 

    "కొంప తీయడానికి కాదు-మనిద్దరికీ కొంప ఏర్పాటు చేసుకుందామనే- ఎవరికోసం ఎదురు చూపులు?"

 

    "అపర్ణ కోసం-ఆమె బృందం వస్తోంది. అందుకే వెయిట్ చేస్తున్నాను." అన్నాడు శ్రీధర్ హుషారుగా.

 

    "అపర్ణని ప్రేమిస్తున్నావా?"

 

    "ప్రేమిస్తున్నాను."

 

    "నన్ను ప్రేమిస్తున్నావా?"

 

    "ప్రేమిస్తున్నాను."

 

    "మాళవికను కూడా ప్రేమిస్తున్నావా?"

 

    "ప్రేమిస్తున్నాను" అనేశాడు తొందరలో.

 

    "వాట్...? మాళవికను ఈరోజే చూశావు- ఈరోజునుంచే ప్రేమించటం మొదలెట్టావా?" పూజ ఫోన్ కి ఆవేపు నుంచి గట్టిగా అడిగేసరికి, అప్పుడు తెలిసిందతనికి, తను పొరబాటున నోరుజారిన విషయం.