అయినా అతనిలోని మానవత్వం చివరి ప్రయత్నం చేయమని పురిగొల్పగా "నేను మీకు మంచి స్నేహితుడిగా ఉంటానని ఏనాడో మీకు మాట యిచ్చాను. ఇక్కడి వుద్వేగాన్ని భరించలేక మీరు వెళ్లి పోతున్నట్లయితే మీకు ఎటువంటి ప్రశాంత జీవితం కావాలంటే అటువంటి ప్రశాంత జీవితం ఏర్పరుస్తాను" అన్నాడు ఉద్రేకంగా.

 

    వేదిత నవ్వింది. "నామీద మీకున్న దయకు కృతజ్ఞురాలిని. కాని నేను వెళ్లిపోవటానికే నిశ్చయించుకున్నాను" అంది.

 

    "మీ ఇష్టం" అన్నాడు సక్సేనా విధిలేక. అతనికి ఒక రకం వైరాగ్యం, దుఃఖావేశం కలిగి కన్నీళ్ళాపుకోవటం కష్టమయింది.

 

    ఎక్కడికి, ఏమిటని ఆమెను ప్రశ్నించలేదు. అవి అవివేకమైన ప్రశ్నలని అతనికి తెలుసు.

 

    "ఒక విషయం" అన్నాడు. అతని గొంతులో గాద్గద్యం పొంగిపొరిలింది. "ఒక సందర్భంలో మీకు దురన్యాయం చేశాననుకుంటాను. బహుశా మీ జీవితంలో మలుపుకేమైనా కారణమయిందేమో తెలియదు...."  

 

    "పోనీయండి. తెలుసుకోవాలని ఆసక్తిలేదు" అన్నదామె నిర్లక్ష్యంగా.

 

    "అది ఎంతటి మహాపరాధమైనా మీరు నా మీద ఆగ్రహం చూపించరా?"

 

    "ఆగ్రహం, అనుభూతి వీటి స్పర్శ నా మనస్సుకి సోకి చాలా కాలమైంది" అంది వేదిత.

 

    "మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తారా?" అనడిగాడు సక్సేనా అప్రయత్నంగా,

 

    "తెలియదు"

 

    "అబ్బ! జీవితం ఎంత భయంకరం!" అనుకున్నాడు సక్సేనా.

 

    "ఇవాళే వెళ్ళిపోతున్నారా?"

 

    "అవును."

 

    కొద్ది క్షణాలు మౌనంగా గడిచాయి. ఒకరి నిశ్శబ్దం వెనక నిర్వికారం, ఒకరి నిశ్శబ్దం వెనక విషాదం.

 

    తర్వాత అతను లేచి నిలబడి "మరి సెలవు తీసుకుంటాను. నమస్కారం" అన్నాడు చేతులు జోడించి.

 

    వేదిత తనుకూడా లేచి నిలబడి చేతులు జోడించి "నమస్కారం" అంది.

 

    హృదయాంతర్గత ఆవేదనను వ్యక్తపరిచే ఓ నిట్టూర్పు విడిచి, అతను మెల్లిగా బయటకు వెళ్ళిపోయాడు.

 

                                           * * *

 

    తర్వాత ఒక సంవత్సరకాలం గడిచిపోయింది. ఈ సంవత్సర పరిమితిలో వేదిత జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగిపోయాయి.

 

    ఒకానొక సంఘటన ఆమెను ఉక్కిరి బిక్కిరిచేసి, ఆమె మనసును చిన్నాభిన్నంచేసి మరింత కృంగదీసి, పాతాళానికి తీసుకువెళ్ళి మతిచలించేటట్లు చేయగా, ఒకరోజు గంటకు నలభయి మైళ్ళ వేగంతో పోతూన్న రైల్లో ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంటు తలుపు దగ్గర నిలబడి, చాలాసేపు శూన్యంలోకి చూస్తూ నిలబడి, తర్వాత హఠాత్తుగా తెలివి తెచ్చుకున్నట్లుగా ఉలికిపడి ఒక్కసారిగా ముందుకు దూకబోయింది.

 

    మెరుపులా వెనకనుండి ఓ బలమైన హస్తం వచ్చి ఆమె రెక్కపుచ్చుకుని బలంగా లోపలకు లాగేసింది.

 

    లోపలకు వచ్చిపడి, ఆ వూపును ఎలాగో సంబాళించుకుని తనని అంత బాధకు గురిచేసిన ఆ వ్యక్తి వంక కోపంగా చూసి, మరుక్షణంలో నిరుత్తరురాలైపోయింది.

 

    "నువ్వా? ను....వ్వా....?" ఆమె నోటివెంట మాటకూడా సరిగ్గా రాలేదు. కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూస్తోంది.

 

    కల్యాణమూర్తి ఆమెవంక చిత్రంగా చూస్తున్నాడు. "వేదితా! నువ్వు... ఇక్కడ" అన్నాడు కాసేపటికి.

 

    హఠాత్తుగా ఆమె అతని వక్షస్థలం మీదకు వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది.

 

    ఒక చెయ్యి ఆమె వీపుమీదా, మరో చెయ్యి ఆమె కురులమీదావేసి అతను తమకంగా నిమరసాగాడు. అనుకోని ఈ సంఘటనకు అతని వళ్ళుపులకరించి రోమాంచితమయినది. అతని కళ్ళుకూడా నీళ్లు నిండు కొచ్చాయి.  

 

    "వేదితా! యీ భూమ్మీద ఇలాంటి విచిత్ర మెలా సంభవం? ఆనందపురం విడిచిపెట్టిరాని అమాయకపు పల్లెటూరిపిల్ల, దైవానికి అంకితమైన మహాభక్తురాలు వేదిత ఏమిటి? ఎక్కడో ఊరుగాని వూరు దగ్గర రైలు పెట్టెలో తారసిల్లట మేమిటి?" అన్నాడు.

 

    అతని కౌగిలికో ఆమె శరీరం గాలిలో తేలిపోతున్నట్లు అనిపించి ప్రక్కనున్న చెక్కను గట్టిగా పట్టుకుంది. అతనేదో అడుగుతున్నాడు. ఆమెకు వినబడటం లేదు. రాను రానూ తన చేతుల్లోని ఆమె శరీరం చల్లగా అయిపోతున్నట్లు అనిపించి అతను కంగారుగా "వేదితా! వేదితా!" అంటూ ఆమె తలపట్టుకుని కుదిపాడు. కాని అప్పటికే ఆమె తెలివి తప్పిపోవటంచేత ముఖం వ్రేలాడేసింది. అతను గాభరాపడుతూ ఆమెను రెండు చేతులతో అవలీలగా లేవనెత్తి సీటులోకి తీసుకువెళ్లి పడుకోబెట్టాడు మృదువుగా.

 

    తర్వాత మూసివున్న కిటికీ తలుపుల్ని పైకెత్తేశాడు. చల్లని గాలి రివ్వు రివ్వుమంటూ లోపలకు దూసుకువచ్చింది. బయటంతా కారు చీకటిగా ఉండటంవల్ల కన్ను పొడుచుకున్నా ఏమీ కానరావటంలేదు. ఆకాశమంతా మేఘాలు కప్పేసి ఉండటం వల్ల అక్కడక్కడా మెరిసే ఏ నక్షత్రమూ కనబడక నలుపు కలిసిపోయింది.

 

    ఆ ఫస్ట్ క్లాస్ రైలుకంపార్టుమెంటులో కల్యాణమూర్తీ వేదితా తప్ప ఎవరూలేరు. రైలు దడ దడమనిచప్పుడుచేస్తూ మహావేగంతో సాగిపోతున్నది.

 

    అతనామె ముఖంలోకి పరీక్షగా చూశాడు. అదే! అప్పటి రూపమే. తనకు తెలిసిన వేదిత ప్రతిబింబమే. ముంగురులు చెదిరి, ముఖంమీద ఒత్తుగా పడుతున్నాయి. మూతలుపడిన కనుదోయినుండి చెంపల క్రిందవరకూ కన్నీటి చారికలు ఏర్పడినాయి.

 

    ఏదో అర్థంకాని మార్పు, కొత్తదనం గోచరించాయి. అతనికామెలో. ఆమె అందం ద్విగుణీకృతమై ఇనుమడించినమాట నిజమే. కాని ఏదో వెల్తి, కంటికీ దృగ్గోచరం కాని పరిణామం పొడగట్టుతున్నా యామెలో అణువణువునా.

 

    ఆ స్థితిలో ఆమెను చూసి ఎనలేని జాలి, ప్రేమానురాగాలు పొంగి పొర్లాయతన్లో. ఆమెకు మరింత దగ్గరగా జరిగి పాలభాగాన పడుతోన్న ముంగురులు ప్రక్కకి తొలగించి తలను మృదువుగా నిమరసాగాడు తన వ్రేళ్ళతో. ఆమె తలనలా నిమురుతూంటే అతనికెంతో హాయిగా, నిండుగా వుంది.