ఆడవారికి అలెర్జీల శాపం

 

ఆడవారికి అలెర్జీల శాపం

 

బిడ్డకు జన్మనివ్వడం స్త్రీకి వరం.... కానీ ఆ వరంతో పాటుగా ఆమె శరీరంలో ఎన్నో శాపాలనూ అనుభవించాల్సి ఉంటుంది. రుతుక్రమంలో సమస్యలు, గర్భధారణలో ఇబ్బందులు, మెనోపాజ్ బాధలూ... ఈ వ్యధలన్నీ ఒక స్త్రీకే అర్ధమవుతాయి. ఈ కష్టాలకి తోడుగా మరో ఇబ్బందిని కూడా కనుగొన్నారు శాస్త్రవేత్తలు.

 

స్త్రీలో సంతానోత్పత్తికి కారణమయ్యే ఈస్ట్రోజన్ హార్మోను వల్ల ఆమెలో అలెర్జీ సమస్యలు ఎక్కువగా తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు వియన్నా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. పూల నుంచి వచ్చే పుప్పొడి వారిలో త్వరగా అలెర్జీ సమస్యలను కలిగిస్తాయట. కొన్ని రకాల ఆహారపదార్థాలు సరిపడకపోవడం (ఫుడ్ అలెర్జీ), ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులూ త్వరగా తలెత్తుతాయట.

 

పదేళ్ల వయసు వరకూ మగపిల్లలు త్వరగా అలెర్జీ బారిన పడతారనీ, ఆ తరువాత కాలంలో ఆడవారు ఈ సమస్యను త్వరగా ఎదుర్కొంటారనీ తేల్చారు. వారి శరీరంలోని హార్మోనులలో వచ్చే మార్పులే ఇందుకు కారణమని గమనించారు. ఆడవారిలోని ఈస్ట్రోజన్ హార్మోను వల్ల శరీరంలోని కణజాలం త్వరగా వాపు (inflammation) చెందుతుంది. శరీరాన్ని రక్షించుకునేందుకు ఈ inflammation అవసరమే అయినా, ఒకో సందర్భంలో ఇది అలెర్జీకి దారితీస్తుంది. ఇదే సమయంలో... మగవారిలో ఈస్ట్రోజన్ బదులు టెస్టోస్టెరోన్ అనే హార్మోను ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ హార్మోను సూక్ష్మజీవులను చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలదు.

అసలే స్త్రీ శరీరంలోని హార్మోనుల అలెర్జీని ప్రేరేపిస్తాయి అనుకుంటే.... వాటికి ఆధునిక చికిత్సలు కూడా తోడవుతున్నాయి. గర్భధారణం కోసమో, మెనోపాజ్ సమస్యల నుంచి తేరుకునేందుకో ఈ మధ్యకాలంలో హార్మోను థెరపీని అనుసరించే స్త్రీల సంఖ్య పెరిగిపోతోంది. ఇక గర్భనిరోధక మాత్రలు కూడా హార్మోనులను ప్రభావితం చేసే విషయం తెలిసిందే! ఇవన్నీ కలిసి స్త్రీలలో అలెర్జీ ప్రమాదాన్ని గట్టు దాటిస్తున్నాయి.

 

ఈ పరిశోధన కేవలం కొత్త విషయాన్ని కనుగొనేందుకే కాదు... అలెర్జీల బారి నుంచి తప్పించుకునేందుకు కూడా ఉపయోగపడనుంది. ఆస్తమా లేదా అలెర్జీలతో బాధపడే ఆడవారు ఇకమీదట మందులు వాడేటప్పుడు, హార్మోను చికిత్సలు తీసుకునేటప్పుడు... వైద్యునితో తమ సమస్య గురించి చెప్పుకోవాలని సూచిస్తున్నారు. కేవలం ఆస్తమానే కాదు! ఎంతకీ వీడని తలనొప్పులు, చర్మం మీద దద్దుర్లు, కీళ్లనొప్పులు వంటి సమస్యలు కూడా అలెర్జీ కారణంగానే వచ్చే అవకాశం ఉందనీ... ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు కూడా వైద్యునితో చర్చించాలని చెబుతున్నారు.

హార్మోన్లకీ, ఆలెర్జీకీ ఉన్న సంబంధం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. మున్ముందు ఈ విషయమై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. వాటి వల్ల అలెర్జీలని ఎదుర్కొనే చికిత్సలలోనూ, హార్మోను చికిత్సలలోనూ సమూలమైన మార్పులు రావచ్చు.

- నిర్జర.