ఆమె ఒక్కక్షణం మురారివంక చూసింది. తరువాత ఉన్నట్టుండి- "నన్నీ నరకంనించి తీసుకెళ్ళండి. ఎక్కడికైనా సరే మీ వెంటవస్తాను. ఏం తీసికెళతారా?" అంది ఆవేశంగా ఎగిసిపడుతున్న గుండెలతో.
    మురారి నిర్ఘాంతపోయాడు ఒక్కక్షణం - ఆ తరువాత తడబడుతూ "మీరు - మీరేం అంటున్నారు?" అన్నాడు గాభరాగా.
    ఆమె హఠాత్తుగా చేతులతో మొహం కప్పుకుని ఏడవడం ఆరంభించింది.
    "నేను ఇక్కడ ఉండలేను. నాకిక్కడ బాగాలేదు.
    నన్ను ఇక్కడనించి ఎక్కడకన్నా తీసికెళ్ళండి ప్లీజ్.... లేకపోతే నేను చచ్చిపోతాను" హిస్టీరియా వచ్చినదానిలా ఏడవసాగింది. ఆక్షణంలో ఏమయిందో ఆమెకే తెలియదు.
    మురారిని చూడగానే ఇన్నాళ్ళు అనుభవించిన వేదన కన్నీటి రూపంలో కరిగి పారింది.
    మురారికేదో అంతా అయోమయం, కలమాదిరి వుంది. దిగ్భ్రాంతినించి ఇంకా తేరుకోలేకపోయాడు. ఆమెకేమయింది? ఎందుకలా ఏడుస్తుంది? ఎందుకలా మాట్లాడింది? తనని తీసికెళ్ళమంటుదేమిటి?
    "జ్యోతిగారు.... ప్లీజ్.... అసలేం జరిగిందండీ మీరిలా మాట్లాడితే నాకేం అర్థమవుతుంది? సరిగ్గా చెప్పండి ప్లీజ్.... సుబ్బారావు ఏదన్నా అన్నాడా?" ఆందోళనగా అన్నాడు.
    ఆమె జవాబివ్వకుండా ఏడవసాగింది.
    ఏం చేయాలో మురారికి అర్థంకాలేదు.
    మురారి దగ్గిరికి వచ్చి ఓదారుస్తాడని, దగ్గరికి తీసుకొని గుండెలకి హత్తుకుని కన్నీరు తుడిచి - "ఏడవకు నీకు నేనున్నాను - పద, ఈక్షణంలో నిన్ను తీసుకెళ్ళిపోతాను. ఒక్కనిముషం నువ్విక్కడ వుండద్దు" అంటాడని ఆశించింది.
    జ్యోతి కలలో హీరో అయితే అలా అనేవాడేమో, కాని మురారి స్నేహితుడి భార్య అలా ఏడుస్తుంటే ఏం చేయాలో కర్తవ్యం తోచని విమూఢుడిలా చూస్తూ వుండిపోయాడు.
    రెండు నిముషాలు అయ్యాక మురారి ఆదుర్దాపడటం తప్ప తననుకున్నట్టు ఓదార్చకపోవడంతో జ్యోతి కళ్ళు విసురుగా తుడుచుకుని-
    "ఏం ఆర్చుతామన్నారు, తీర్చుతామన్నారు. నాకు తెలుసు మీరేం చేయలేరని" హేళనగా చూసింది.
    "క్షమించండి. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు. మీకు తెలుస్తుందా? అసలు మీ మనసు సరిగ్గా వుందా? దయచేసి శాంతంగా కూర్చుని ఏం జరిగిందో చెప్పండి" అన్నాడు మురారి స్థిరంగా జ్యోతి వంక చూసి.
    "వద్దులెండి. నా ఏడుపు నేను ఏడుస్తాను. ఏమనుకోకండి సిల్లీగా ప్రవర్తించాను" జ్యోతి విరక్తిగా అంది. అసలు ఆమె చెప్పాలనుకున్నది ఒకటి అయితే, ఆమెకి తెలియకుండానే నోరు ఏదో మాట్లాడింది.
    ఉద్యోగం చూసిపెట్టమని అడగాలనుకుని ఇంత తొందరగా ఇలా బయటపడిపోయి అతనికి దొరికిపోయినందుకు ఇప్పుడు సిగ్గువేస్తోంది ఆమెకి.
    "ఆ విషయం మరిచిపొండి- ఏదో తొందరపడ్డాను. మీరు చేయగలిగిన సహాయం ఒకటి వుంది చేస్తారా? మిమ్మల్ని ఎప్పుడైనా సహాయం కోరితే కాదంటారా? చెప్పండి - మీరు నాకూ మిత్రులేనా.....?"
    ఆ షాక్ నుంచి మురారి ఇంకా తేరుకోలేదు. విస్మయంగా చూస్తూ- "ఆఫ్ కోర్స్! నా చేతుల్లో ఉన్నది తప్పక చేస్తాను. చెప్పండి."
    సుబ్బారావు వచ్చేలోగా ఉద్యోగ విషయం చెప్పాలి. తరువాత మళ్ళీ ఈ అవకాశం దొరకకపోవచ్చు.
    "నాకు ఏదన్నా ఉద్యోగం చూసిపెట్టాలి మీరు. మిగతాది తర్వాత" అంది జ్యోతి అభ్యర్థిస్తున్నట్టు.
    "ఉద్యోగమా? ఉద్యోగం చేస్తారా?" ఆశ్చర్యంగా అడిగాడు.
    "ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? ఆడవాళ్ళు ఉద్యోగం చెయ్యకూడదనా? లేక నాకా అర్హత లేదనా? బి.ఏ. కంప్లీట్ చెయ్యలేదు. ఇంటర్ చదువుకి వచ్చే ఉద్యోగం ఏదయినా చూసిపెట్టండి. మీ పరపతి ఉపయోగించి ఎక్కడన్నాసరే ఉద్యోగం వచ్చేటట్లు చెయ్యండి."
    "సుబ్బారావుకి చెప్పారా? వప్పుకున్నాడా?"
    జ్యోతి పెదవి కొరుక్కుంది. "ముందు చెప్పను. ఉద్యోగం వచ్చాక చెపుతాను" అంది.
    స్నేహితుడికి చెప్పకుండా అతని భార్యకి ఉద్యోగం వేయిస్తే.... రేపు సుబ్బారావు ఏమన్నా అంటాడేమో! అసలు జ్యోతికి హఠాత్తుగాయీ ఉద్దేశం ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? భార్యాభర్తలమధ్య ఏదయినా గొడవ జరిగిందా?
    అందుకే అలా ఏడ్చిందా జ్యోతి? అందుకే ఉద్యోగం చెయ్యాలనుకుంటుందా?
    మురారి మొహంలో సందేహం గుర్తించి "ప్లీజ్! మీరు ఈ విషయాలేమీ మీ స్నేహితుడికి చెప్పనని మాటఇవ్వండి. మీరు చెప్పారంటే.... నేనిలా ఏడిచానని, అడిగానని చెపితే నా శవాన్ని చూస్తారు"
    జ్యోతి మాటలకి ఉలిక్కిపడ్డాడు మురారి.
    "అదిగో ఆయన వస్తున్నారు. ఈ విషయాలేమీ ఆయనకీ చెప్పొద్దు. ప్రామిస్" అంది గాభరాగా.
    మురారి అలాగేనన్నట్టు తలాడించాడు ఇంకా అయోమయంగా చూస్తూనే- "నా ఉద్యోగం మాట మరిచిపోకండి" అంది జ్యోతి హడావిడిగా.
    సుబ్బారావు లోపలికివచ్చి మురారిని చూసి..... ఒక్కక్షణం తడబడి "ఓ- నీవా?" అన్నాడు. జ్యోతివంక చూసేసరికి జ్యోతి మొహం తిప్పుకుంది విసురుగా.
    తను వచ్చేసరికి ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ తనని చూసి నిశ్శబ్దమైపోయారని గిల్టీగావున్న జ్యోతి మొహం. కాస్త తడబడిన మురారిని చూశాక అన్పించింది సుబ్బారావుకి.
    వాతావరణం ఏదో భారంగా వున్నట్టు అయింది. మురారి కాస్త తడబడుతూ "ఇప్పుడే పది నిముషాలు అయింది వచ్చి. నీవులేవు, వస్తావంటే కూర్చున్నాను" అన్నాడు అనవసరంగా గాభరాపడుతూ.