సక్సేనాతో మాట్లాడి తిరిగి వచ్చేలోపుగా అతను లేనిశక్తి తెచ్చుకుని మెల్లగా లేచి నిలబడి మంచం దగ్గరకు నడవసాగాడు. కాళ్ళు గాలిలో తేలిపోతూ ఒక్కొక్క అడుగూ వెయ్యటానికే బ్రహ్మప్రళయంగా వుంది. గుండె దడ దడ లాడిపోతోంది.

 

    మంచాన్ని సమీపించాక, ఆసరాకోసం ముందుకు వొరిగి దాని పట్టెను పట్టుకోబోతూ, శక్తిచాలక ప్రక్కకు విరుచుకు పడబోయాడు. వెనుకనుంచి రెండు చేతులతన్ని గట్టిగా పట్టుకున్నాయి. ఆ చేతులే అతన్ని పడిపోకుండా గట్టిగా పట్టుకున్నాయి. ఆ చేతులే అతన్ని జాగ్రత్తగా పడుకోబెట్టాయి.

 

    పడుకున్నాక ఆ చేతుల్ని గుండెలమీదకు లాక్కుందామనుకున్నాడు శాయి. కాని అతనికి ధైర్యం చాలిందికాదు.

 

    "సారీ వేదితా! నీకు చాలా ట్రబుల్ ఇస్తున్నాను" అన్నాడతను.

 

    ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు.

 

    అలా పడుకుని ఆమెవంక చూస్తుంటే అతనికి ఒక విషయం స్ఫురించి నవ్వు వచ్చింది. ఈ ఇంట్లోకి వచ్చాకకూడా అతను తనకోసం మరో మంచం కొనుక్కోలేదు. సోఫాలమీదే గడుపుతున్నాడు. వేదిత బొంబాయిలో తన ఇంట్లో కాలుపెట్టాక ఇదే మొదటిసారి తానా మంచం మీద పడుకోవటం.

 

    అరగంటలో సక్సేనా వచ్చాడు డాక్టరుతోసహా. అనాడు శాయిని తీసుకువెళ్ళి పరీక్ష చేయించిన డాక్టరే.

 

    డాక్టరు పరీక్ష ముగించి , ఒక ఇన్ జక్షన్ ఇచ్చి, ఓ టాబ్లెట్ మింగించి ఇవతలకు వచ్చి "పెథిడిన్ ఇచ్చాను. కాస్సేపట్లో నొప్పి కొంచం రిలీఫ్ ఇచ్చి నిద్రపడుతుంది. రేపు ఉదయమే హాస్పిటల్ లో ఎడ్మిట్ చేస్తే మంచిది" అని సలహా ఇచ్చాడు.

 

    డాక్టరు వెళ్ళిపోయాక గది లోపలకు తిరిగివచ్చిన సక్సేనాను శాయి "ఏమన్నాడు?" అని అడిగాడు.

 

    "ఏమంటాడు? హాస్పిటల్ లో ఎడ్మిట్ చేయమన్నాడు. ఇక్కడ నీకేం సదుపాయంగా ఉంటుంది చెప్పు శాయీ!"

 

    వేదిత కిటికీ దగ్గర నిలబడి బయట చీకట్లోకి చూస్తోంది. శాయి ఆమెవంక జాలిగా చూస్తూ "పాపం, ఆమె ఎక్కడ పడుకుంటుంది ఈ రాత్రికి? పోనీ నేను సోఫాలో పడుకోనా?" అన్నాడు.

 

    "వద్దు. ఈ స్థితిలో నువ్వు కదలడం అట్టే మంచికాదు. నేను వెళ్ళి ఆమె పడక ఏర్పాటు చేసివస్తా" అని సక్సేనా లేచి బయట హాల్లో సోఫామీద దిండూ, దుప్పటి శుభ్రంగా సర్ది మళ్ళీ గదిలోకి వచ్చి వేదితతో "మీరు ఎంతసేపని మెలకువగా ఉంటారు? వెళ్ళి గదిలో పడుకోండి" అన్నాడు.  

 

    ఆమె ఇద్దరివంకా ఒకసారి చూసి ఏమనుకున్నదో ఏమో, మాట్లాడకుండా అవతలకు వెళ్ళిపోయింది.

 

    సక్సేనా వచ్చి మంచంమీద స్నేహితుడి ప్రక్కన కూర్చున్నాడు. "ఇవాళ కూడా అలాగే జరిగింది కదూ?" అన్నాడు.

 

    శాయి బలవంతాన నవ్వటానికి ప్రయత్నిస్తూ "అంతే, మరికాస్త సివియర్ గా వుంది కాకపోతే" అన్నాడు.

 

    సక్సేనా నిట్టూర్పు విడిచి, స్నేహితుడి చెయ్యి తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నిమురుతూ "రాత్రి నీకు ఫోన్ చెయ్యటం పొరపాటయింది. మనం దెబ్బతిన్నామన్న గాభరాలో నువ్వు హార్టు పేషంటువన్న సత్యాన్ని విస్మరించి చెప్పేశాను" అన్నాడు పశ్చాత్తాపపడుతూ.

 

    "ఉహు, అలా బాధపడకు సక్సేనా! దానికి దీనికీ సంబంధమేమీలేదు. ఇదేదో రావల్సే వచ్చింది."

 

    సక్సేనా మాట్లాడకుండా ఆలోచిస్తున్నాడు.

 

    "బాధ్యతారహితంగా తిరుగుతూ, విచ్చలవిడిగా తెగ డబ్బు ఖర్చు చేశానిన్నాళ్ళూ. ఇప్పుడు రోగిష్టివాడినైపోయాను. ఈ సమయంలో ఉన్నదంతా కడిగేసుకుని, అందులో మన కంపెనీ పరిస్థితికూడా అతలా కుతలమై పోయిందేమో?" దుఃఖంతో గొంతు పూడిపోయి తర్వాత మాట బయటకు రాలేదు.

 

    "అలాగనకు శాయీ! మళ్లీ మంచిరోజులు రాకపోతాయా? నేను లేనా?"

 

    "నువ్వు మాత్రం ఉన్నదంతా ఊడ్చిపెట్టలేదా? ఎంతని తీసుకువస్తావు? నా బరువు ఎన్నాళ్లని మోస్తావు?"

 

    "శాయి! నా బొందిలో ఊపిరున్నంతవరకూ నీ కెల్లాంటి ఇబ్బందీ కలగనివ్వను. నా మాట నమ్ము."

 

    "నీ మనసు నాకు తెలుసు సక్సేనా!" శాయి కంఠం గద్గదికతమై వొణికింది. కాని ఇది అంతా చివరకి వచ్చిందని అనిపిస్తోంది. జరిగిందానికి నేను పశ్చాత్తాపపడటంలేదు మౌనంగా అనుభవించటం తప్ప. సక్సేనా! ఈ సారి నేను బ్రతుకనేమోనని అనుమానంగా వుంది. చావంటే భయంలేదుగాని, ప్రయోజకుడు కాకుండానే అనుకున్న ఆశలు ఒక్కటీ నెరవేరకుండానే చచ్చిపోతున్నందుకు బెంగగా వుంది.

 

    సక్సేనాకు కళ్లలో నీరు నిండుకొచ్చాయి. "శాయీ! అలా అనకు" అన్నాడు దుఃఖంతో.

 

    "నాకు ధైర్యం చెప్పటానికి ప్రయత్నించకు సక్సేనా. అది నాదగ్గర కావలసినంత వుంది." అని కొంచం ఆగి చూడు సక్సేనా? నేను వెళ్ళిపోతాను. వేదిత వంటరిగా మిగిలిపోతుంది. అంటే ఇన్నాళ్ళూ నేనామెకు రాక్షకుడినయ్యాననికాదు. ఆమె ఎప్పటికీ వంటరే. ఆ వంటరితనాన్ని ఎవరూ ఛేదించలేరు. అనుభవపూర్వకంగా తెలుసుకున్న సంగతి ఇది. ఆమెను కాస్త కనిపెట్టి ఉండగలిగితే వుండు. కాని శబ్ధంలేని ఆ ప్రవాహానికి మాత్రం అడ్డు తగలటానికి ప్రయత్నించకు. అది మనకు రాణించలేదు సక్సేనా. ఆర్థికంగా ఆమె ఏమయినా ఇబ్బందులకు లోనైతే మాత్రం కొంచం సాయపడుతూ ఉండు."

 

    "శాయీ!" అన్నాడతను డగ్గుత్తికతో. "చేజేతులా ఎంతదూరం తెచ్చుకున్నావో చూశావా?"

 

    శాయి ఓ శుష్క మందహాసం చేసి "విచారిస్తున్నావా సక్సేనా! విచారం దేనికి? ఎంతమంది మన కళ్ళముందు చనిపోతుంటే 'ప్చ్' అనుకుని వూరుకోలా? మనమూ అంతే. నా భార్యచనిపోలా? తల్లి చనిపోలా? నేను అంతే. జరిగిందానికి నేను పశ్చాత్తాప పడడంలేదు. ఓడిపోయాను అన్న అసంతృప్తి తప్ప, సక్సేనా! దుర్వ్యసనాలను నువ్వు జయించినందుకు నీకు నా మనఃపూర్వక అభినందనలు. నువ్వు కృతార్ధుడవు అయినావు. చూడు, నువ్వెంతో అదృష్టవంతుడివి. నీ భార్యను ప్రేమించగలగి, మీది అనుకూల దాంపత్యం చేసుకున్నావు. ఆ లోగిలిలోకి మీ అనురాగపు మందిరం ద్వారబంధం దాటి ఎవరినీ లోపలకు అడుగుపెట్టనీకు. అందులో మూడో వ్యక్తికి ప్రవేశం కలగనీకు, నాకు మత్తుగా వుంది ఇంజక్షన్ ప్రభావంవల్ల కాబోలు. నిద్ర వచ్చేస్తున్నది. ఇక పడుకుంటాను. వీలుంటే మళ్ళీ కనిపించు."