ప్రకాశం మాధవ్ వైపు చురచురా చూశాడు. జనం అంతా తనని బలపరచి మాధవ్ కి చివాట్లు పెడతారని ఆశించాడు. ఇప్పుడు ఇక్కడ జరిగినదానివల్ల రేపు అసలు తన మాటకి ఈ వూళ్ళో చిల్లపెంకంత విలువైనా ఉంటుందా అని ఆలోచనలో పడ్డాడు.
    
    "ఇదిగో, మాధవా! ఇదే నీకు చివరిసారి చెప్పడం! అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోకు. మా కేశవుడి కొడుకువన్న ఒక్క విషయమే నిన్ను రక్షిస్తోంది!" అన్నాడు.
    
    "ఎవరి కొడుకైనా తప్పుచేస్తే ఊరుకోకూడదు మావయ్యా! నేను చేసిన తప్పేమిటో చెప్పండి" మాధవ్.
    
    "మా గిరిమీద చెయ్యిచేసుకున్నావు. రేపు వూళ్ళో అణాకి కొరగాని వెధవ కూడా వాడిమీద చెయ్యి చేసుకుంటాడు. సుబ్బారాయుడి కుటుంబం అంటే ఖాతరు చెయ్యరు. అది చాలదా" ఆవేశంగా అన్నాడు.
    
    "చెట్టు పేరుచెప్పి కాయలమ్మే రోజులు పోయాయి మామయ్యా! ప్రధాని కొడుకైనా తప్పు చేస్తే శిక్షింపబడాల్సిందే. ఇవన్నీ నాతో చెప్పే బదులు ఇంటికెళ్ళి నీ బావమరిదిని కాస్త దార్లో పెట్టుకోవడం మంచిది," అన్నాడు మాధవ్.
    
    "ఓహో.... నాకే చెప్పేటంత పెద్దవాడివయ్యావన్నమాట!" వ్యంగ్యంగా అన్నాడు ప్రకాశం.
    
    "చిన్నవాడ్ని కాబట్టే చెప్తున్నాను మావయ్యా పెద్దవాడినై ఉంటే...." అని ఆపేశాడు.
    
    ప్రకాశం రెచ్చిపోతూ, ఊ... పెద్దవాడివై యుంటే, ఏం చేసేవాడివిరా... చెప్పరా?" అంటూ మాధవ్ దగ్గరకొచ్చి అతని కాలర్ పుచ్చుకుని లాగుతూ అడిగాడు.
    
    మాధవ్ మాట్లాడలేదు, కదలకుండా అలాగే నిలబడ్డాడు.
    
    "ఏం మాట్లాడవూ? నన్ను కూడా కొట్టేవాడివా! అదేనా నీ ఉద్దేశం?" అని కళ్ళు పెద్దవిచేసి అడిగాడు.
    
    మాధవ్ మీద ప్రకాశం చెయ్యి వేసేసరికి నలుగురు యువకులు ఆవేశపడుతూ ముందుకి రాబోయారు. మాధవ్ వారిని ఆగమని చెయ్యి చూపించాడు. ఆ తర్వాత నెమ్మదిగా ప్రకాశం చేతిని తొలగిస్తూ "వయసులో పెద్దవాడినై ఉంటే ... నీ బావమరిదితోపాటు నిన్నూ దార్లో పెట్టి ఉండేవాడిని!" అన్నాడు.
    
    ఆ మాటకి అక్కడ మూగినవాళ్ళు గొల్లున నవ్వారు.
    
    ప్రకాశం మొహం నల్లగా మాడిపోయింది. కోపంతో ఊగిపోతూ, మాధవా! నువ్వు చేస్తున్నదానికి ఇంతకి ఇంతా అనుభవిస్తావు. పల్లెటూరు ఆప్యాయతలే ఇంతవరకూ చూశావు... పగలూ, పంతాలూ ఇప్పుడు చూస్తావు! పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ.... రుచి చూపిస్తాను!" అంటూ రంకెలువేస్తూ వెళ్ళిపోయాడు.
    
    చుట్టూ మూగిన జనం మాధవ్ దగ్గరగా వచ్చి, "భలేగా మాట్లాడారు బాబూ! ఆ బామ్మరిది వచ్చినప్పటినుండీ ఈయనగారు పొలంవైపు వెళ్ళడమే మానుకున్నాడు. ఆడిష్టం వచ్చినట్లల్లా ఆడు ఆడ్తున్నాడు. సుబ్బారాయుడు గారుంటే ఇట్టా వుండేదిగాదు. జీతగాళ్ళని కన్నబిడ్డల్లా చూసుకునేవారు! అన్నారు.
    
    మాధవ్ చిన్నగా నవ్వి, "ఈ కోపం ఇంటికెళ్ళేదాకా ఉండదులెండి. చిన్న మావయ్యకి ప్రథమకోపం మీరు మీ పనులు చూసుకోండి!" అని బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.
    
                                                                 * * *
    
    "రాధా కాగులోంచి వేడినీళ్ళు తెచ్చిపెట్టు!" పురమాయించాడు ఒంటికి నూనె రాసుకుంటూ గిరి.
    
    రాధ కళ్ళెత్తి అతనివంక వింతగా చూసింది.
    
    ఒంటినిండా నూనెరాసుకుని చిన్న నిక్కరువేసుకుని కుర్చీపీట మీద కూర్చుని ఉన్నాడు. ఆమె చూడగానే జబ్బలు చరుచుకుంటూ, "ఏంటా చూపూ?" పరాయివాడినేం కాదులే!" అని నవ్వాడు.
    
    రాధ చిరాగ్గా తల తిప్పుకుని, "నరసమ్మకి చెప్తాను!" అని కదలబోయింది.
    
    "ఏం, నువ్వు ఇవ్వకూడదా? నువ్వేం మహారాణీవా?" అన్నాడు గిరి.
    
    "ఏవిట్రా? ఏం కావాలీ?" వంటింట్లో ఉండి శాంత గొంతు పెంచి అడిగింది. ఆమె తలకి శొంఠి పట్టీ వేసుకుని ఉంది. రెండు రోజులుగా బాగా తలనొప్పి జ్వరంతో బాధపడుతోంది. నిమిషం తీరుబడి లేకుండా చేసినా పని కావడంలేదు. ఇప్పుడు గిరి గొడవ చేస్తే ఆమె ఊరుకోదు. అరిచి ఇంకా తలనొప్పి తెచ్చుకుంటుంది. అందుకని రాధ వెంటనే పరికిణి పైకిదోపి కాగులోంచి వేడినీళ్ళు బక్కెట్టులోకి తోడి మోసుకొచ్చింది.
    
    గిరి విజయగర్వంతో చూస్తూ "కాసిని చన్నీళ్ళు కూడా కలుపు!" అన్నాడు.
    
    రాధ చన్నీళ్ళు అందులో పోస్తూండగా నీళ్ళు చింది ఆమె పాదాల మీదపడ్డాయి. రాధ "అ...మ్మా...!" అని అరిచింది. పచ్చని పాదం ఎర్రగా కందిపోయింది. పాదం పట్టుకుని కూర్చుండిపోయింది.
    
    "ఈమాత్రానికే ఓర్చుకోలేకపోతే ఎలా?" అంటూ గిరి ఆమె దగ్గరగా జరిగి కుచ్చిళ్ళు పైకి తియ్యబోయాడు.
    
    రాధ గబుక్కున దూరం జరిగి, "వద్దు! ఏం కాలేదు!" అంది.
    
    "చూడనీ!" అతను బలవంతంగా ఆమె కాలు పట్టుకోబోయాడు.
    
    రాధ అనాలోచితంగానే బలంగా ఝాడించి తన్నింది. ఆ తావుకి గిరి నూనె రాసుకున్న ఒంటితో నున్నని గచ్చుమీద జారి వెనక్కిపడ్డాడు.
    
    "అమ్మమ్మా! పెద్దమ్మా....! మావయ్యని రాధ కాలితో తన్నింది. మావయ్య పడిపోయాడు!" అంటూ నాకు కేకలు పెడుతూ వచ్చింది.
    
    రాధ కమగారుగా లేచి నిలబడింది.
    
    ఆ కేకలకి వెంకాయమ్మ, శాంత, సూరమ్మ, సన్యాసీ పరుగు పరుగున వచ్చారు.
    
    గిరి లేవబోతుంటే మళ్ళీ పట్టు కుదరక జారిపడ్డాడు. అది చూసి సన్యాసిరావు ఫక్కున నవ్వాడు.
    
    గిరి గుర్రుమని చూశాడు. గొప్ప అవమానంగా ఫీలయ్యాడు. రాధ తల వంచుకుని ఉంది. ఆమెకూడా పెదవి చివర్లనుండి నవ్వుతూనే ఉండి ఉంటుందని అతని అనుమానం.
    
    "ఓరి నాయనో... ఓరి తండ్రోయ్... ఇలా పరాయి పంచనచేరి తన్నులూ, దెబ్బలూ తినాలని నీకే దేవుడు రాసి పెట్టాడురా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఈ పిల్ల నిన్ను ఈడ్చి తన్నేటంత పని నువ్వేంచేశావురా?" శోకాలు పెడుతూ అడిగింది వెంకాయమ్మ.
    
    గిరి తల్లి చెయ్యి ఆసరాతో లేచి నిలబడుతూ "వేడినీళ్ళు చిందాయని 'అమ్మా!' అని అరిచింది. చిన్నపిల్ల కదా అని 'ఎక్కడ కాలిందమ్మా?' అని 'ఎక్కడ కాలిందమ్మా?" అని చూడబోయాను అంతే....! కాలితో నా మొహం మీద ఒక్క తన్ను తన్నింది. అబ్బా... అమ్మా...!" అన్నాడు.
    
    "ఏం చేస్తాం నాయనా? ఒక్కగానొక్క గారాబు బిడ్డ కదా! ఆవిడ 'కా' అంటే 'కా', 'కీ' అంటే 'కీ' ఈ ఇంట్లో మన రాత సరిగ్గా లేక ఈ పంచన చేరాం. పద, నాలుగు చెంబులు పోసుకుని పడుకుందువుగాని!" అంటూ కళ్ళొత్తుకుంది వెంకాయమ్మ.