రివ్యూ... విన్నర్
on Feb 24, 2017
మామయ్యల మాదిరిగా ఎదగాలనుకోవడం వేరు..మామయ్యల మాదిరిగానే చేయాలనుకోవడం వేరు. ఈ విషయంలో ఆరంభం నుంచి క్లారిటీ మిస్సయిన మెగా హీరో సాయి ధరమ్ తేజ. తిక్క సినిమా అందించిన చేదు అనుభవంతో కాస్త క్లారిటీ తెచ్చుకుని, చేసిన సినిమా విన్నర్. టాగోర్ మధు లాంటి అభిరుచి గల నిర్మాత, గోపీచంద్ మలినేని లాంటి బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సక్సెస్ లు వున్న దర్శకుడు కలిసి అందించిన సినిమా కావడంతో విన్నర్ సినిమాపై కాస్త ఆసక్తి కలిగింది. హార్స్ రేస్ నేపథ్యంలో తయారైన ఈ సినిమా టైటిల్ లోనే విన్నర్ నా? లేక సినిమా కూడా విన్నింగ్ హార్సేనా చూద్దాం.
కథ
భార్య చనిపోయిన తరువాత తండ్రి కోరిక మేరకు తన కొడుకును తీసుకుని ఇంటికి వస్తాడు మహేందర్ రెడ్డి. కానీ ఆ తండ్రికి తన కొడుకు కావాలి కానీ మనవడు కాదు.దాంతో కుట్ర చేసి మనవడు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయేలా చేస్తాడు. అలా వెళ్లిపోయిన కుర్రవాడు తండ్రి అన్నా, తండ్రి ఇన్ వాల్వ్ అయిన హార్స్ రేస్ లు అన్నా విముఖతతో పెరుగుతాడు. కానీ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం, తన తండ్రికి దగ్గర కావడం కోసం మళ్లీ ఆ హార్స్ రేస్ లోనే గెలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక మిగిలిన కథ ప్రేక్షకుల ఊహకు అందేదే.
ఎలా వుంది?
ఇష్టంలేకపొయినా ఓ లక్ష్యం కోసం కష్టపడి క్రాఫ్ట్ ను నేర్చుకుని, అప్పటికే ఆ క్రాఫ్ట్ లో బలంగా వున్న విలన్ ను ఎదుర్కొని గెలిచే హీరో కథతో ఇప్పటికి చాలా సినిమాలు వచ్చాయి. తమ్ముడు, ఇడియట్ ఇలా చాలా వున్నాయి ఉదాహరణలు. ఈ సినిమాలో అందుకోసం ఎంచుకున్న క్రాఫ్ట్ హార్స్ రేస్. జనాలకు బాగా తెలిసిన ఈ థిన్ ప్లాట్ ను ఎంచుకోవడంతో, దీనికి బలం కూర్చడం కోసం కథకుడు,దర్శకుడు కలిసి చాలా పిల్లి మొగ్గలు వేయాల్సి వచ్చింది. కథలో కొత్త పాయింట్ వుందని చెప్పుకోవడం కోసం తాతను విలన్ ను చేసారు. పాయింట్ అనుకోవడం వరకు బాగానే వుంది. కానీ దాన్ని ఎస్టాబ్లిష్ మాత్రం చేయలేకపోయారు. పాయింట్ చిన్నది కావడంతో తొలి భాగం అంతా హీరో ప్రేమ వ్వవహారంతో నింపేసారు. దానికి ఎంటర్ టైన్ మెంట్ అనే ముసుగు తొడిగేందుకు పృధ్వీ, వెన్నెల కిషోర్ వగైరాలను వాడుకున్నారు. కానీ ప్రేక్షకుడు సినిమా ఎంతకూ ముందుకు కదలడం లేదన్న ఫీల్ కు వచ్చేసరికి ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఓకె. ఇక సినిమా చకచకా పరుగెడుతుంది అనుకుంటే, మరింత నెమ్మదిస్తుంది అక్కడి నుంచి.
హీరోకి బదులుగా మరో డూప్లికేట్ ను తేవడం,తండ్రి వాడు తన కొడుకే అని నమ్మేయడం అంతా ఫన్నీగా వుంది. పోనీ సవాళ్లు, ప్రతి సవాళ్ల నడుమ కథ క్లయిమాక్స్ కు చేరుకున్నాక, అక్కడ అయినా దర్శకుడు తన ప్రతిభను ప్రదర్శించగలిగాడా అంటే, అదీ లేదు. రేస్ లో గెలవడానికి విలన్ అనుసరించేది పాత చింతకాయపచ్చడి లాంటి అయిడియా. దాంతో క్లయిమాక్స్ నిట్టనిలువుగా పడిపోయింది.
సినిమాలో మరో మైనస్ ఏమిటంటే సంభాషణలు. మరీ బ్లాండ్ గా వున్నాయి అబ్బూరి రవి మాటలు. ఏమాత్రం హుషారు లేదు. అబ్బూరి రాసిన కామెడీ ట్రాక్ లు, కోన వెంకట్ బృందం నుంచి అరువు తెచ్చుకున్నట్లు వుంది. అయినా ట్రాకులు అన్నీ కుంచెం ఫరవాలేదు. థమన్ మళ్లీ షరా మామూలుగా పాత ట్యూన్లే ఇచ్చాడు. అయితే సితారా..ఓ సితార పాట బాగుంది.
హీరో సాయి ధరమ్ తేజ ఈసారి కాస్త సెటిల్డ్ ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. కానీ మాటల్లో మెగా ప్రస్తావనలు, అక్కడక్కడ మెగా హీరోల ఛాయలు అతని ప్రయత్నాన్ని మళ్లీ కాస్త దారి మళ్లించాయి. దాంతో తేజు ఇంకా మారలేదు అనే ఫీల్ కలుగుతుంది.
ఇలాంటి సినిమాకు ప్లస్ పాయింట్ ఒకటే. పెట్టిన ఖర్చు.దాన్ని తెరపైకి తీసుకువచ్చిన చోటాకే నాయుడు ఫొటొగ్రఫీ. సినిమాను చాలా రిచ్ గా చూపించడమే కాకుండా, కలర్ ఫుల్ గా, అందంగా చూపించాడు చోటా. అదే కనుక లేకపోతే సినిమా పరిస్థితి మరీ ఇబ్బందిగా వుండేది. ఫస్ట్ హాఫ్ లో పృధ్వీ, సెకెండాఫ్ లో ఆలీ కాస్త నవ్వించే ప్రయత్నం చేసారు. జగపతిబాబు కు మంచి క్యారెక్టర్ దొరికింది బాగానే చేసాడు. కానీ ముఖేష్ రుషి క్యారెక్టర్ ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. రకుల్ అందాలను ప్రేక్షకులకు ఎరగా వేసే ప్రయత్నం కాస్త ఎక్కువే చేసారు. చోటా తన కేమేరాను ఆమె లో కట్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసాడు చాలా సార్లు.
మొత్తం మీద వీక్ స్క్రిప్ట్, వీక్ డైలాగ్స్, వీక్ డైరక్షన్ కలిసి విన్నర్ ను కాస్తా లూజర్ ను చేసాయి.
రేటింగ్: 2.25