'హోమ్ ఎలోన్' చిన్నారి హీరో ఇప్పుడేం చేస్తున్నాడు?
on Nov 29, 2020
హోమ్ ఎలోన్ (Home Alone) ఒక క్లాసిక్. ముప్పై ఏళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా ఇప్పటికీ టీవీ వీక్షకుల్ని అలరిస్తూనే ఉంటుంది. దాన్ని ఒకటికి మించి ఎక్కువ సార్లు చూసినవాళ్లు చాలా మందే ఉంటారు. హాలీడేస్‌లో ఇంట్లో ఒంటరిగా గడిపే ఒక బాలుడి కథ ఇది. మొదట అలా ఒంటరిగా ఉండటం అనే ఆలోచన సరదాగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత అదెంత ప్రమాదకరమో ఎనిమిదేళ్ల ఆ బాలుడు కెవిన్ మెక్కాలిస్టర్కు అర్థమవుతుంది. ఎందుకంటే ఇద్దరు దొంగలు ఆ ఇంటిని దోచుకోవడానికి వస్తారు. 1990లో ఆ సినిమా రిలీజయ్యింది. అంటే ఈ క్రిస్టమస్‌కు ఆ క్లాసిక్ వచ్చి 30 ఏళ్లవుతున్నాయన్న మాట. ఆ సినిమాలోని ప్రధాన పాత్ర కెవిన్ మెక్కాలిస్టర్గా నటించిన అప్పటి చిన్నారి మకౌలే కుల్కిన్ 30 ఏళ్ల తర్వాత ఇప్పుడెలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది కదూ!!
కుల్కిన్ ఎనిమిదేళ్ల కొంటె పిల్లాడు కెవిన్ మెక్కాలిస్టర్గా నటించాడు. తన కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉండాలని ఆ పిల్లాడు కోరుకుంటాడు. అనుకోకుండా కుటుంబం అతడిని ఒంటరిగా ఇంట్లో వదిలిపెట్టి వెళ్లడంతో అతడి కల నిజమవుతుంది. ఆ పాత్రను కుల్కిన్ ఉన్నత స్థాయిలో పోషించి, అప్పుడే ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. బాల నటుడిగా 90ల తొలినాళ్లలో కొన్ని సినిమాల్లో నటించాడు కుల్కిన్. వాటిలో 'మై గాళ్' మూవీలో చేసిన థామస్ జె. సెనెట్ క్యారెక్టర్‌కు కూడా చాలా మంచి పేరొచ్చింది. ఆ పాత్రలో అతడి నటనకు కంటనీరు తిరగని వారుండరు. 'ద గుడ్ సన్'లో ఎలిజా వుడ్‌తో పాటు నటించాడు. 1994లో 'రిచీ రిచ్'గా అలరించాడు. ఆ తర్వాత 'హోమ్ ఎలోన్ 2: లాస్ట్ ఇన్ న్యూయార్క్'లో కెవిన్‌గా తన పాత్రను మరోసారి పోషించాడు.
అనంతరం పదేళ్లపాటు నటనకు దూరమైన కుల్కిన్ 'పార్టీ మాన్‌స్టార్'తో అడల్ట్ యాక్టర్‌గా కెరీర్‌ను పునఃప్రారంభించాడు. ఆ తర్వాత మాండీ మూర్, జెనా మలోన్, ప్యాట్రిక్ ఫ్యూజిట్తో కలిసి కల్ట్ క్లాసిక్ 'సేవ్డ్'లో కనిపించాడు. విల్ అండ్ గ్రేస్, రోబో చికెన్, డాల్ఫేస్ షోలలో గెస్ట్ రోల్స్ చేశాడు. త్వరలో 'అమెరికన్ హారర్ స్టోరీ' సిరీస్‌లో కనిపించబోతున్నాడు.
Also Read