హిందీ రాని వినాయక్.. ఛత్రపతి రీమేక్ సవాల్!
on Nov 29, 2020
టాలీవుడ్లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సాధించింది ఒకే ఒక్క హిట్ 'రాక్షసుడు' మూవీతోటే. అది తమిళ హిట్ ఫిల్మ్ 'రాక్షసన్'కు రీమేక్. హీరోగా శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చిన 'అల్లుడు శీను' సినిమా మంచి వసూళ్లు సాధించింది కానీ, కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. బోయపాటి శ్రీను తీర్చిదిద్దిన 'జయ జానకి రామ' సినిమాదీ అదే కథ. అయినప్పటికీ సాయిశ్రీనివాస్ సినిమాలు హిందీలో డబ్బయి యూట్యూబ్‌లో అనూహ్యమైన వ్యూస్ సాధించాయి. దీంతో తనకు నార్త్ ఆడియెన్స్‌లో మంచి ఇమేజ్ వచ్చిందనుకొని బాలీవుడ్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
బాలీవుడ్ ఎంట్రీకి ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ సూపర్ హిట్ ఫిల్మ్ 'ఛత్రపతి'ని ఎంచుకున్నాడు. పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడా ఈ రీమేక్‌ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. వీళ్ల కాంబినేషన్ ముందుగానే కుదిరింది. డైరెక్టర్‌నే శుక్రవారం (నవంబర్ 27) అధికారికంగా ప్రకటించారు. ఆ అవకాశం వి.వి. వినాయక్‌కు లభించింది. తనను 'అల్లుడు శీను'తో హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన వినాయక్నే మళ్లీ నమ్ముకున్నాడు శ్రీనివాస్. అయితే వినాయక్‌కు ఈ మూవీని తియ్యడం పెద్ద సవాలు కానుంది.
కొంతకాలంగా వినాయక్ డోలాయమాన స్థితిని ఎదుర్కొంటున్నాడు. మెగాస్టార్ కమ్‌బ్యాక్ ఫిల్మ్ 'ఖైదీ నంబర్ 150'కి డైరెక్ట్ చేసి, బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఆయన, ఆ తర్వాత సాయిధరమ్ తేజ్‌తో తీసిన 'ఇంటిలిజెంట్' మూవీతో డిజాస్టర్ రుచి చూశాడు. ఆ మూవీని చూసినవాళ్లు అదసలు వినాయక్ తీసిందేనా అనే సందేహంలో పడ్డారు. దాని తర్వాత ఏ స్టార్ హీరో నుంచి ఆయనకు పిలుపు రాలేదు. ఆ తర్వాత దిల్ రాజు కన్విన్స్ చేయడంతో 'శీనయ్య' అనే సినిమాతో నటుడిగా మారేందుకు సిద్ధపడ్డాడు. నరసింహారావు డైరెక్షన్లో శీనయ్యగా కొన్ని సన్నివేశాలు కూడా చేశాడు. ఆ క్యారెక్టర్ కోసం తన రూపాన్ని మార్చుకున్నాడు. కానీ చివరకు తనకే నచ్చక, నటించనని చెప్పేసి, ఆ ప్రాజెక్ట్‌ను వదిలేశాడు.
దాని తర్వాత 'లూసిఫర్' తెలుగు రీమేక్ డైరెక్షన్ చాన్స్‌ను మెగాస్టార్ ఆయనకే అప్పగించాడని వినిపించింది. తర్వాత ఏమైందో, ఆ ప్రాజెక్ట్ మిస్సయింది. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ 'ఛత్రపతి' హిందీ రీమేక్ ఛాన్స్ వచ్చింది. ఇది ఆయనకూ బాలీవుడ్లో డెబ్యూ మూవీనే. ఇప్పుడు ఈ హిందీ మూవీని ఆయన ఎలా డైరెక్ట్ చేస్తాడనే ఆసక్తి, సందేహం చాలామందిలో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. వినాయక్‌కు హిందీ రాదు. హిందీ రాకుండా హిందీ యాక్టర్లతో సీన్లు తియ్యడం అంత ఈజీ కాదు. దీని కోసం హిందీ వచ్చిన అసోసియేట్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్ల మీద ఆధారపడాల్సిందే.
పైగా.. టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శ్రీనివాస్‌ను బాలీవుడ్లో హీరోగా ఇంట్రడ్యూస్ చెయ్యడం అంటే ఆషామాషీ విషయం కాదు. యూట్యూబ్‌లో వ్యూస్ విపరీతంగా వస్తున్నాయి కాబట్టి, హిందీ ఆడియెన్స్ శ్రీనివాస్‌ను విపరీతంగా లైక్ చేస్తున్నారని అనుకోవడానికి వీల్లేదు. అలా అనుకుంటే అది భ్రమే. ఎందుకంటే రామ్ సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా యూట్యూబ్‌లో విపరీతంగా ఆదరణ పొందుతున్నాయి. వాటిని చూసి మెయిన్ స్ట్రీమ్ హిందీ సినిమాలు చేసెయ్యొచ్చనుకుంటే అది తొందరపాటే అవుతుంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు ప్రభాస్‌ను ఛత్రపతిగా చూసేశారు. అందువల్ల వారు హిందీ మాట్లాడే ఛత్రపతిని శ్రీనివాస్ రూపంలో చూస్తారనుకోవడం భ్రమే అవుతుంది. కేవలం హిందీ ఆడియెన్స్ కోసమే శ్రీనివాస్‌ను ఛత్రపతిగా మలచాలి. దాంతో వినాయక్‌కు 'ఛత్రపతి' రీమేక్ ఒక విషమ పరీక్ష కానుంది. ఆ పరీక్షను ఆయన ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.
Also Read