బరువు తగ్గాలని 10 లీటర్ల నీళ్లు తాగుతూ వచ్చిన విద్యా బాలన్!
on Sep 26, 2020
ప్రస్తుతం దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన ఫిమేల్ యాక్టర్స్‌లో విద్యా బాలన్ ఒకరనే విషయం అందరూ అంగీకరిస్తారు. కేవలం నటనతోనే కాకుండా, తన జీవన విధానం ద్వారా, క్లిష్ట కాలంలో తీసుకొనే నిర్ణయాల ద్వారా ఆమె మనల్నెప్పుడూ ఇంప్రెస్ చేస్తూనే ఉంటుంది. ఇటీవలే 'శకుంతలాదేవి' మూవీలో టైటిల్ రోల్లో ఆమె పర్ఫార్మెన్స్ను ఇప్పుడప్పుడే మరచిపోగలమా!
2012లో సంప్రదాయ బద్ధంగా జరిగిన వేడుకలో సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ను పెళ్లాడింది విద్యా బాలన్. ఆమెను పెళ్లికి ముందూ, పెళ్లికి తర్వాతా చాలా కాలం పాటు వేధించిన సమస్య.. బరువు! ఈమధ్య ముంబై టాబ్లాయిడ్ మిడ్-డేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లావు సమస్యను తగ్గించుకోడానికి సంవత్సరాల తరబడి ఎలాంటి పోరాటం చేస్తూ వచ్చిందో వివరంగా చెప్పుకొచ్చిందామె.
"చాలా కాలం పాటు నేను నా బాడీని ద్వేషించాను. కారణం, 'ఫ్యాట్ గాళ్'గా నన్నెప్పుడూ అందరూ అభివర్ణించడం. చిన్నప్పుడు బొద్దుగా ఉన్న నన్ను క్యూట్‌గా ఉన్నావనేవాళ్లు. అలా అనడాన్ని ఎంజాయ్ చేసేదాన్ని. నేను పెద్దదాన్ని అవుతున్నకొద్దీ, ఇంత అందమైన ముఖం పెట్టుకొని బరువెందుకు తగ్గవని జనం అనడం మొదలుపెట్టారు. నా సినిమాలు సరిగా ఆడకపోతే, అది నా బరువైన బాడీ వల్లేనని భావించేదాన్ని. ఒకానొక సమయంలో నా జీవితంలో నా శరీరమే అతిపెద్ద సమస్యగా నాకు కనిపించింది." అని చెప్పింది విద్య.
దాంతో బరువు తగ్గడానికి ఏం చేసిందో వెల్లడిస్తూ, "దెయ్యం పట్టినదానిలా వర్కవుట్స్ చేస్తూ, నాకిష్టమైన తిండిని త్యాగం చేశాను. అనేక సంవత్సరాలు అలా చేసినా, బరువు పెరుగుతూనే ఉన్నాను కానీ తగ్గలేదు. ఎప్పుడైనా బరువు తగ్గితే, లావుగా ఉన్నప్పుడే బాగున్నాననిపించేది. కానీ మళ్లీ బరువు పెరిగితే అదొక నైట్‌మేర్‌లా మారేది. నాకు 17 సంవత్సరాల వయసున్నప్పుడు రోజులకు 10 లీటర్ల నీళ్లు తాగితే బరువు తగ్గుతానని ఎవరో చెప్పారు. అలా చేయడం మొదలుపెట్టాను. దాంతో దాదాపు ప్రతి రోజూ రాత్రి వాంతి చేసుకొనేదాన్ని. మావాళ్లు భయపడిపోయి నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకుపోయారు. నేనేం చేస్తున్నానో చెప్పినప్పుడు ఆయన నాపై బాగా కోప్పడ్డారు. నీళ్లు తాగడం ఆపగానే, మళ్లీ లావైపోయాను. నా బాడీ టైప్ అలాంటిది. దాన్ని నేను మార్చలేను." అని ఆమె చెప్పింది.
చివరకు 2019లో తన హార్మోన్ల వల్లే ఇది జరుగుతోందని రియలైజ్ అయ్యింది విద్యా బాలన్. "యాక్టర్‌గా కొనసాగడాన్ని నేను ఇష్టపడుతున్నాననీ, మిగతావేవీ పట్టించుకోవాల్సిన పనిలేదనీ 2019లో అర్థం చేసుకున్నాను. నా శరీరమే నన్ను లైవ్‌గా ఉంచుతోంది కాబట్టి అదేపనిగా ఎక్సర్సైజ్లు చెయ్యడం మానేశాను. నాకేది తినాలనిపిస్తే అది తినడం మొదలుపెట్టాను. దాంతో, నా హార్మోన్లు బ్యాలెన్స్ అవడం ప్రారంభించాయి. నాకు తినాలనిపించినప్పుడల్లా హల్వా తింటూ వస్తున్నా. చాలా కాలం తర్వాత ఇప్పుడు రెండు కిలోల బరువు తగ్గాను." అంటూ తన వెయిట్ లాస్ అండ్ వెయిట్ గైన్ స్టోరీ చెప్పుకొచ్చింది విద్యా బాలన్.