డిసెంబర్ 13నే వస్తోన్న 'వెంకీమామ'
on Dec 2, 2019
వెంకటేశ్, నాగచైతన్య తొలిసారి కలిసి నటిస్తోన్న 'వెంకీమామ' మూవీ డిసెంబర్ 13న విడుదలవుతోంది. ఆ రోజు వెంకటేశ్ పుట్టినరోజు కావడం గమనార్హం. కె.ఎస్. రవీంద్ర (బాబీ) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని డి. సురేశ్‌బాబు, టి.జి. విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతూ జోడీగా రాశీ ఖన్నా నటించారు. కొన్ని రోజుల క్రితం వరకు ఈ సినిమా విడుదల విషయంలో చాలా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. సంక్రాంతికి ఈ మూవీని తీసుకురావాలా లేక డిసెంబర్లోనే విడుదల చెయ్యాలా అనే విషయంలో నిర్మాతలు మల్లగుల్లాలు పడుతూ వచ్చారు. ఐదారు రోజుల క్రితం క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల చెయ్యడానికి నిర్మాతలు సంకల్పించారనే ప్రచారం జరిగింది.
కానీ ఇవాళ డిసెంబర్ 13నే వస్తున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కారణం.. ఇప్పటిదాకా ఈ సినిమాకి సరైన ప్రమోషన్ జరగకపోవడమే. మధ్యలో మరో పది రోజుల సమయమే ఉండటంతో ఈ లోపుగా విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉంది. మేనమామ మేనల్లుళ్లయిన వెంకీ, చైతూ కలిసి నటించడమే ఈ సినిమాకి ప్రేక్షకుల్ని రప్పిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారేమో తెలీదు. అందుకే ప్రచార కార్యక్రమాలకు తగినంత సమయం లేకున్నా విడుదలకు సిద్ధపడుతున్నారు. సినిమాని ఎప్పుడు రిలీజ్ చెయ్యాలనే విషయంలో పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించే సురేశ్‌బాబు ఈ సినిమాని డిసెంబర్ 13న రిలీజ్ చెయ్యాలని సంకల్పించడానికి కారణం లేకుండా ఉండదు.
Also Read