English | Telugu

వెంకీ-చైతూ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్!

on Dec 14, 2019

 

మిశ్రమ స్పందన మధ్య 'వెంకీమామ' మూవీ ఓపెనింగ్ కలెక్షన్లు అదిరిపోయాయి. మేనమామ మేనల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య అవే తరహా పాత్రల్లో నటించిన ఈ సినిమా తొలి రోజు ఆ ఇద్దరి కెరీర్లకూ బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన సినిమాగా 'వెంకీమామ' నిలిచింది. జాతకాలను హైలైట్ చేస్తూ డైరెక్టర్ బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.8 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరచింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన వెంకీ ముందుపటి సినిమా 'ఎఫ్2' కంటే ఎక్కువగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు రావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 'ఎఫ్2' 4.95 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. అయితే 'వెంకీమామ' వచ్చేవరకు వెంకటేశ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ మారుతి డైరెక్ట్ చేసిన 'బాబు బంగారం' మూవీ పేరిట ఉన్నాయి. ఆ సినిమా ఫస్ట్ డే 5.56 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు 'వెంకీమామ' ఆ రికార్డును చెరిపేసి, వెంకీ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్‌ను సాధించింది.

'ఎఫ్2'లో వరుణ్‌తేజ్ కూడా ఇంకో హీరోగా నటించినప్పటికీ, తనదైన విలక్షణ శైలి హాస్య నటన, హావభావాలతో సినిమానంతా వెంకటేశ్ తన భుజాలపై మోశాడనే పేరు తెచ్చుకున్నాడు. అది నిజం కూడా. ఇప్పుడు 'వెంకీమామ'కు వచ్చిన ఓపెనింగ్స్ కూడా వెంకటేశ్ వల్లే వచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి నాగచైతన్య కోసం ఈ సినిమాని వెంకటేశ్ చేశాడన్నట్లు ప్రచారం జరిగింది. డైరెక్టర్ బాబీ సైతం ఈ సినిమాలో నాగచైతన్య క్యారెక్టర్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేశామని చెప్పాడు. కానీ దానికి విరుద్ధంగా సినిమాలో వెంకటేశ్ క్యారెక్టరే ఎక్కువసేపు కనిపించింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రి క్లైమాక్స్ ముందు నాగచైతన్య క్యారెక్టర్ చాలాసేపు కనిపించలేదు. అంతేకాదు, మాస్ యాంగిల్ పరంగా కూడా వెంకీ క్యారెక్టర్ ఎలివేట్ అయినట్లు చైతన్య క్యారెక్టర్ ఎలివేట్ కాలేదు. 'వెంకీమామ' సినిమా చూసినవాళ్లకు వెంకీ కోసమే ఈ సినిమాని చైతన్య చేసినట్లు అనిపించక మానదు.

నాగచైతన్య కెరీర్ పరంగా చూసుకున్నా ఇది అతని హయ్యెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్లు కావడం గమనార్హం. ఇదివరకు మారుతి డైరెక్ట్ చేసిన 'శైలాజారెడ్డి అల్లుడు' సినిమా ఫస్ట్ డే 5.45 కోట్ల షేర్‌తో చైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. ఇప్పుడు దాన్ని 'వెంకీమామ' తిరగరాసింది. సందర్భవశాత్తూ 'వెంకీమామ' రాకముందు మామా అల్లుళ్ల ఇద్దరి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సినిమాలను డైరెక్ట్ చేసింది మారుతియే. నేడు మారుతిని బాబీ బీట్ చేశాడన్న మాట. తెలంగాణలో 2.37 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన 'వెంకీమామ', రాయలసీమలో 1.6 కోట్లను వసూలు చేసింది. అలాగే ఆంధ్రా ఏరియాలో 2.42 కోట్ల రూపాయల షేర్ సాధించింది. 

గ్రామీణ నేపథ్యంలో హాయిగా సాగే కథను అనవసరంగా టెర్రరిజం, ఆర్మీ నేపథ్యంతో దారి మళ్లించారనే విమర్శలు వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ ఆశించిన రీతిలో రావడంతో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ ఫీలవుతున్నారు. శనివారం, ఆదివారం కూడా మంచి వసూళ్లు వస్తాయనే నమ్మకంతో వారున్నారు. నిజానికి ఈ సినిమా విడుదల తేదీ విషయంలో నిర్మాత సురేశ్‌బాబు మీమాంసకు గురయ్యారు. డిసెంబర్‌లో రిలీజ్ చెయ్యాలా, సంక్రాంతికి తేవాలా.. అని మల్లగుల్లాలు పడ్డారు. ఒకానొక సమయంలో డిసెంబర్ 25న క్రిష్టమస్‌కు తీసుకొస్తారని కూడా వినిపించింది. అయితే అనూహ్యంగా డిసెంబర్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అప్పటికి పబ్లిసిటీ కూడా సరిగా చెయ్యలేదు. కేవలం పది రోజుల గడువుపెట్టుకొని ఆయన రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆ తర్వాతే విగరస్‌గా రోజూ ఏదో ఒక ఈవెంట్‌తో పబ్లిసిటీని ప్లాన్ చేసి, జనంలో ఆ సినిమాపై క్యూరియాసిటీ పెంచగలిగారు. వెంకటేశ్, నాగచైతన్య తొలిసారి స్క్రీన్‌పై కలిసి కనిపిస్తున్నారనే ప్రచారం ఈ సినిమాకి బాగా వర్కవుట్ అయ్యి, వాళ్ల కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చేలా చేసింది. అయితే సినిమాకు అసలైన పరీక్ష సోమవారం ఎదురు కానున్నది. ఆ రోజు కూడా వసూళ్లు బాగుంటే, సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లే అవకాశాలున్నాయి.


Cinema GalleriesLatest News


Video-Gossips