గురు... వెంకీకి నచ్చలేదట!
on Jan 17, 2017
గత కొన్నేళ్లుగా వెంకటేష్ స్పీడు తగ్గింది. యేడాదికి కనీసం రెండు సినిమాలు వచ్చేలా చూసుకొనే వెంకీ... రెండేళ్లకు ఓ సినిమాతో సరిపెట్టుకొంటున్నాడు. 2016లో వచ్చిన బాబు బంగారం వెంకీని అతని అభిమానుల్నీ నిరాశ పరిచింది. అందుకే ఈసారి సేఫ్ గేమ్ ఆడాలన్న ఉద్దేశంతో రీమేక్ కథని ఎంచుకొన్నాడు. అదే.. `గురు`గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈసినిమాని జనవరి 26న విడుదల చేయాలనుకొంది చిత్ర బృందం. అయితే ఆ నిర్ణయం ఇప్పుడు మారింది. గురు ఏప్రిల్‌కి వాయిదా పడింది.
షూటింగ్ అయిపోయింది.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు వచ్చేశాయి.. ఈ దశలో సినిమాని వాయిదా వేయడం, అదీ రెండు నెలల పాటు ఎందుకో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అయితే... గురు సినిమా ఫైనల్ అవుట్ పుట్ విషయంలో వెంకీ అంత సంతృప్తిగా లేడని, సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని కొత్తగా రాసి, రీషూట్ చేయాలని భావిస్తున్నాడని, అందుకే ఈ సినిమా ఇప్పుడు రెండు నెలల పాటు వాయిదా పడిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి వెంకీ మనసులో ఏముందో?? ఈ సినిమాని ఎందుకు వాయిదా వేశాడో చిత్రబృందానికే తెలియాలి.