వరుణ్ తేజ్ ' మిస్టర్ ' చదువుల్లో టాప్..!
on Apr 29, 2016
శ్రీను వైట్ల, వరుణ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా మిస్టర్. చాలా కాలం తర్వాత కాలేజ్ లవ్ స్టోరీ సినిమా తీస్తున్నాడు శ్రీనువైట్ల. ప్రస్తుతం వైట్లకు హిట్ చాలా అవసరం. వరస డిజాస్టర్లతో డీలా పడిన శ్రీను తనకు చాలా ఇష్టమైన లవ్ జానర్ ను ఎంచుకుని సినిమా తీస్తున్నాడు. నిజానికి శ్రీను వైట్ల కమర్షియల్ సినిమా కంటే లవ్ స్టోరీని చాలా బాగా హ్యాండిల్ చేయగలడు. కానీ ఢీ తర్వాతి నుంచీ ఒక ఫార్ములాకు అంకితమైపోవడంతో, వైట్ల కెరీర్ ప్రమాదంలో పడింది. ఆనందం, సొంతం సినిమాల్లో కాలేజ్ లవ్ స్టోరీలను వైట్ల తెరకెక్కించిన విధానం ఎలాంటిదో తెలిసిందే.
అందుకే మళ్లీ తనకు చాలా ఇష్టమైన ఈ ఫార్మాట్లో వెళ్లి, లవ్ స్టోరీతో హిట్ కొట్టాలనుకుంటున్నాడు. మిస్టర్ లో వరుణ్ చురుకైన ర్యాంకర్ కుర్రాడిలా కనిపిస్తాడట. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత రిస్కైనా చేయడానికి వెనకాడని మనస్తత్వం తో ఉంటాడని మూవీ టీం చెబుతోంది. నిన్న జరిగిన మిస్టర్ ముహూర్తపు షాట్ కు హీరో వెంకటేశ్ క్లాప్ ఇచ్చారు. బేబీ భవ్య సమర్పణలో, నల్లమలుపు శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీజేమేయర్ స్వరాలందిస్తున్న ఈ మూవీలో వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం హిట్ కాంబో శ్రీను వైట్ల, గోపీమోహన్, శ్రీధర్ సీపాన కలిసి పనిచేడం విశేషం.