ENGLISH | TELUGU  

'వ‌కీల్ సాబ్' మూవీ రివ్యూ

on Apr 9, 2021

 

సినిమా పేరు: వ‌కీల్ సాబ్‌
తారాగ‌ణం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ప్ర‌కాశ్ రాజ్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల‌, వంశీకృష్ణ‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, శ్రుతి హాస‌న్ (గెస్ట్‌)
మాట‌లు: శ్రీ‌రామ్ వేణు, మామిడాల తిరుప‌తి
పాట‌లు:  రామ‌జోగ‌య్య శాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ‌
మ్యూజిక్‌: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ:  పి.ఎస్‌. వినోద్‌
ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ పూడి
ప్రొడ‌క్ష‌న్ డిజైన్:  రాజీవ‌న్‌
స‌మ‌ర్ప‌ణ‌:  బోనీ క‌పూర్‌
నిర్మాత‌లు:  దిల్ రాజు, శిరీష్‌
ద‌ర్శ‌క‌త్వం: శ్రీ‌రామ్ వేణు
బ్యాన‌ర్‌: శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
విడుద‌ల తేదీ: 9 ఏప్రిల్ 2021

"ఆర్ యు ఎ వ‌ర్జిన్‌?" అని కోర్టు బోనులో నిల్చొని వున్న యువ‌కుడ్ని అడిగాడు వ‌కీల్ సాబ్‌. షాకైపోయి, "అబ్జెక్ష‌న్ యువ‌రాన‌ర్" అంటూ అడ్డుకోబోయాడు ప్రాసిక్యూట‌ర్ నందాజీ. "మీరైతే అమ్మాయిల్ని అడ‌గొచ్చు. మేమైతే అబ్బాయిల్ని అడ‌క్కూడ‌దా? ఏం న్యాయం నందాజీ ఇది?  కూర్చోండి. కూర్చోండి చాలు." అని గ‌ద్దించాడు వ‌కీల్ సాబ్‌. చేసేదేం లేక కూర్చొన్నాడు నందాజీ. 'వ‌కీల్ సాబ్' ట్రైల‌ర్‌లో ఈ సీన్ చూశాక సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఎట్లా పెరిగాయో మ‌నం చూస్తూనే ఉన్నాం. వ‌కీల్ సాబ్ క్యారెక్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ విజృంభ‌ణ ఎలా ఉంటుందో, సినిమా మొత్తంగా మెప్పిస్తుందా, లేదా అనే ఆత్రుత‌తో ఎదురుచూస్తూ ఉన్నారు ఫ్యాన్స్‌, జ‌న‌ర‌ల్ ఆడియెన్స్‌. మ‌రి ఈరోజే మ‌న‌మందుకు వ‌చ్చేసిన 'వ‌కీల్ సాబ్' ఎలా ఉన్నాడో ఓ లుక్కేద్దామా...

క‌థ
బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'పింక్‌'కు రీమేక్ కాబ‌ట్టి 'వ‌కీల్ సాబ్' క‌థేమిటన్న‌ది చాలామందికి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ మ‌నం కూడా చెప్పుకోవాలి క‌దా. వేరే వేరే ఏరియాల నుంచి వ‌చ్చిన ప‌ల్ల‌వి, జ‌రీనా, దివ్య అనే ముగ్గురమ్మాయిలు హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు చేస్తూ, ఒక అపార్ట్‌మెంట్‌లో క‌లిసుంటా‌రు. ఒక రాత్రి ఒక అమ్మాయి ఆఫీసోళ్లిచ్చిన పార్టీకెళ్లి నైట్ పూట ఓ క్యాబ్‌లో వ‌స్తూవుంటే ఆ క్యాబ్ మ‌ధ్య‌లో బ్రేక్‌డౌన్ అవుతుంది. ఆ డ్రైవ‌ర్ మీద అనుమాన‌మొచ్చి ఆ దారిన‌పోయే ఓ కార్‌ను లిఫ్ట్ అడుగుతారు ఆ అమ్మాయిలు. ఆ కారులో ప‌ల్ల‌వి క్లాస్‌మేట్ ఉంటా‌డు. దాంతో సేఫ్‌గా ఫీలై, ఆ కారులో వెళ్తారు అమ్మాయిలు. ఆ త‌ర్వాత జ‌రిగే ఘ‌ట‌న‌తో వాళ్ల లైఫ్ ఆగ‌మాగం అవుతుంది. వాళ్ల‌మీద ఎంపీ కొడుకు వంశీ అటెంప్ట్ టు మ‌ర్డ‌ర్ కేసు పెడ‌తా‌డు. ఆ ముగ్గుర‌మ్మాయిల్ని ఆదుకోవ‌డానికి వ‌కీల్ సాబ్ వ‌స్తాడ‌‌ని వేరే చెప్పాలా! అదీ క‌థ‌.

విశ్లేష‌ణ‌
ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని, ఆయ‌నకు త‌గ్గ‌ట్లు ఒరిజిన‌ల్ 'పింక్' స్టోరీని పూర్తిగా క‌మ‌ర్షియ‌లైజ్ చేసిన సినిమా 'వ‌కీల్ సాబ్'‌. అందుక‌ని 'పింక్' చూసిన క‌ళ్ల‌తో ఈ సినిమాని చూసినోళ్లు డిజ‌ప్పాయింట్ అవుతా‌రేమో కానీ, ఆ సినిమాని మ‌న‌సులోకి రానియ్య‌కుండా చూస్తే న‌చ్చుతుంద‌నేది నా ఫీలింగ్‌. 

సెకండాఫ్ అంతా ఒరిజిన‌ల్ మూవీ 'పింక్' లెక్క‌నే కోర్డులోనే ఎక్కువ‌గా న‌డుస్తుంది. కానీ ఫ‌స్టాఫ్‌లో వ‌కీల్ సాబ్ క‌థేందో ఫ్లాష్‌బ్యాక్‌లో చూపిచ్చిదంతా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం స్క్రిప్ట్‌లో ఎక్స్‌ట్రాగా చేర్చింద‌న్న మాట‌. ఫ్యాక్టరీల పేరిట‌, అభివృద్ధి పేరిట‌ భూములు కోల్పోయిన వారి కోసం, ఇళ్లు కోల్పోయిన వారి కోసం రియ‌ల్ లైఫ్‌లో‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన ఆందోళ‌న‌ల‌ను దృష్టిలో పెట్టుకొని, పేద‌ల‌కు అండ‌గా ఉండే వ‌కీల్ సాబ్‌గా ఆ క్యారెక్ట‌ర్‌ను డైరెక్ట‌ర్ శ్రీ‌రామ్ వేణు డిజైన్ చేశాడు. అలాగే వ‌కీల్ సాబ్ భార్య క్యారెక్టర్‌ను కూడా ఫ్లాష్‌బ్యాక్‌లోనే వ‌చ్చేట్లు మార్చాడు. అంతేకాదు, సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ క్యారెక్ట‌ర్ 50 నిమిషాల సేపే ఉంటుంద‌ని జ‌రిగిన ప్ర‌చారం త‌ప్ప‌ని తేలిపోయింది. సినిమా మొద‌లైన 20 నిమిషాల త‌ర్వాత వ‌కీల్ సాబ్ క్యారెక్ట‌ర్ ఎంటర‌వుతుంది. అక్క‌డ్నుంచి సినిమా అంతా వ‌కీల్ సాబ్ ఉంటా‌డు. ఇంక ఆయ‌న ఫ్యాన్స్‌కు కావాల్సిందేముంటుం‌ది!

నాకైతే ఫ‌స్టాఫ్ పెద్ద‌ ఎట్రాక్టివ్‌గా అనిపించ‌లేదు. సెకండాఫ్ బాగుంది. కోర్టు డ్రామాలో టెంపోని గ్రాడ్యువ‌ల్‌గా పెంచుకుంటూ రావ‌డంలో డైరెక్ట‌ర్ స‌క్సెస‌య్యాడు. ఒరిజిన‌ల్‌లో ఉన్న‌ట్లే కోర్టు సీన్ల‌న్నీ న‌డిచా‌య్‌. "స్టేట్ వ‌ర్సెస్ వేముల ప‌ల్ల‌వి" కేసుగా హియ‌రింగ్‌కు వ‌చ్చిన కేసులో నందాజీ వ‌ర్సెస్ వ‌కీల్ సాబ్ అన్న‌ట్లు న‌డిచిన వాద‌న‌లు ఇంటెరెస్టింగ్‌గా అనిపించా‌య్. అమ్మాయిల త‌ర‌పున వాదిస్తూ వ‌కీల్ సాబ్ రైజ్ చేసే క్వ‌శ్చ‌న్స్ అంద‌ర్నీ ఆలోచింప‌జేసేట్లు ఉన్నా‌య్‌. 

అమ్మాయి న‌వ్వితే.. ప‌క్క‌నున్న అబ్బాయిని ట‌చ్ చేస్తే.. ఇంక ఆ ప‌ని చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లేనా? అబ్బాయిలు ఏ టైమ్‌లోనైనా బ‌య‌ట తిర‌గొచ్చు, అమ్మాయి రాత్రిపూట బ‌య‌ట‌కొస్తే, తిరుగుబోత‌ని ముద్రేస్తారా? వ‌ర్జినిటీ అనేది అమ్మాయిల‌కేనా, అబ్బాయిల‌కుండ‌దా?.. అని వ‌కీల్ సాబ్ ఒక్కో ప్ర‌శ్నే వేస్తుంటే కోర్టంతా గ‌ప్‌చుప్ అయిపోయే సీన్ న‌చ్చ‌నివాళ్లుంటారా!  అమ్మాయికి ఇష్టం లేకుండా ఆమెను తాకే అధికారం భ‌ర్త‌కు కూడా ఉండ‌ద‌ని వ‌కీల్ సాబ్ అంటే సూప‌ర్ అనిపిస్తుంది. ఇవేవీ కొత్త విష‌యాలు కాదు. చాలామందికి తెలిసిన విష‌యాలే. కానీ తెలీన‌ట్లుగా ఉండిపోతున్నాం. 'వ‌కీల్ సాబ్' సినిమాతో ఈ విష‌యాల‌న్నింటినీ మ‌రోసారి ప‌వ‌ర్‌ఫుల్‌గా మ‌న‌ముందు ప్రెజెంట్ చేశారంతే!

కోర్టులో ముగ్గుర‌మ్మాయిలు ఎదుర్కొనే ప్ర‌శ్న‌లు చూస్తే మ‌న గుండెలు మండిపోతాయ్‌. ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ నందాజీ పీక పిసికెయ్యాల‌న్నంత కోపం వ‌స్తుంది. ఆ అమ్మాయిలు ఎదుర్కొనే పెయిన్, ఆ క‌ష్టం ఎవ‌రికీ రాకూడ‌ద‌నిపిస్తుంది. అట్లా అనిపిచ్చిందంటే సినిమా స‌క్సెస్ అయిన‌ట్లే క‌దా!

టెక్నిక‌ల్‌గా చూస్తే సినిమా మొత్తంలో ఎక్కువ‌ క‌ష్ట‌ప‌డిందీ, బాగా అనిపిచ్చిందీ త‌మ‌న్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్‌. ఫెంటాస్టిక్ బీజియంతో కోర్టు సీన్ల‌ను, అమ్మాయిలు ప‌డే పెయిన్‌ను హృద‌యాల‌కు హ‌త్తుకొనేట్లు చేశాడు. "మ‌గువా మ‌గువా" సాంగ్ ఇప్ప‌టికే బాగా పాపుల‌ర్ అయ్యింది కదా. సినిమాటోగ్రాఫ‌ర్ పి.ఎస్‌. వినోద్ కూడా బాగానే ప‌నిచేశాడు. యాక్ష‌న్ సీన్లు మాత్రం ప‌వ‌ర్‌స్టార్ రేంజికి త‌గ్గ‌ట్లు లేవు. త‌క్కువ బ‌డ్జెట్‌తో తీస్తే ఎలాంటి క్వాలిటీతో వ‌స్తాయో, అలాంటి క్వాలిటీ క‌నిపించింది ఫైటింగ్ సీన్ల‌ల్లో. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ ఓకే. రైట‌ర్ తిరుప‌తితో క‌లిసి డైరెక్ట‌ర్ శ్రీ‌రామ్ వేణు క‌లిసి రాసిన డైలాగ్స్ ఆక‌ట్టుకున్నాయ్‌‌. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ ఇంకా క్వాలిటీగా ఉన్న‌ట్ల‌యితే 'వ‌కీల్ సాబ్' ఇంకా క్వాలిటీతో వ‌చ్చేద‌ని నాకు అనిపిచ్చింది!‌

న‌టీన‌టుల అభిన‌యం
వ‌కీల్ సాబ్ క్యారెక్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చులాగ్గా ఇమిడిపోయాడు. వ‌కీల్ సాబే ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ప‌వ‌న్ క‌ల్యాణే వ‌కీల్ సాబ్ అన్న‌ట్లు ఉంది సినిమా చూస్తుంటే. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను స్టూడెంట్ అంటే మాత్రం రియ‌లిస్టిగ్గా అనిపించ‌లేదు. వ‌య‌సు తెలిసిపోతుండ్లా! పైగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అంత ఫిట్‌గా కూడా క‌నిపించ‌లేదు. ఇది త‌ప్పితే కోర్టు సీన్ల‌లో ప‌వ‌ర్‌స్టార్ అనే పేరుకు త‌గ్గ‌ట్లు ప‌వ‌ర్‌హౌస్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నందాజీ క్యారెక్ట‌ర్‌లో ప్ర‌కాశ్ రాజ్ జీవించాడు. ప్ర‌కాశ్ రాజ్ చెల‌రేగిపోయి వాదించ‌డం వ‌ల్ల కూడా వ‌కీల్ సాబ్ క్యారెక్ట‌ర్ బాగా ఎలివేట్ అయ్యిందనేది నా ఒపీనియ‌న్‌. 

స్టోరీ ఎవ‌రి మీద న‌డిచిందో ఆ ముగ్గుర‌మ్మాయిలుగా నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముగ్గురిలో ఎవ‌రినీ త‌క్కువ చెయ్య‌లేం. త‌మ క్యారెక్ట‌ర్ల‌లోని పెయిన్‌ను ఆడియెన్స్ గుండెల‌కు తాకేలా ప‌ర్ఫార్మ్ చేశారు. నివేదాలో ఎంత చ‌క్క‌టి న‌టి ఉందో ఈ సినిమా మ‌రోసారి చూపిచ్చింది. అంజ‌లి గురించి ప్ర‌త్యేకించి చెప్పాలా! 'మ‌ల్లేశం' సినిమాతో లైమ్‌లైట్‌లోకి వ‌చ్చిన అన‌న్య స‌ర్‌ప్రైజింగ్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎంపీ కొడుకు వంశీగా వంశీకృష్ణ‌, ఎంపీగా ముఖేష్ రుషి త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. వ‌కీల్ సాబ్ భార్య‌గా గెస్ట్ రోల్‌లో శ్రుతి హాస‌న్ మెరిసింది.

తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌
ఓవ‌రాల్‌గా చెప్పాలంటే.. అంద‌ర్నీ ఆలోచింప‌జేసే, అనాది నుంచి స్త్రీల‌పై మ‌నం ఏర్ప‌ర‌చుకున్న అభిప్రాయాల్ని మార్చుకోవాల‌ని చెప్పే మంచి సినిమా 'వ‌కీల్ సాబ్'‌. న‌టునిగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌లోని మ‌రో కోణాన్ని చూపించిన సినిమా.. టిక్కెట్‌పై పెట్టిన డ‌బ్బుకు న్యాయం చేసే సినిమా!

రేటింగ్ - 3/5

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.