త్రివిక్రమ్ కి ఏమైంది?
on Jan 10, 2018
తన కలం బలంతో యువతరం హృదయాలను గిలిగింతలు పెట్టిన త్రివిక్రమ్ పెన్ లో ఇంక్ ఇంకిపోయిందా? శూలాల్లాంటి సంభాషణలతో సమాజాన్ని ప్రశ్నించిన త్రివిక్రమ్ కలానికి కళ తగ్గిందా? చిన్నా, పెద్దా, ఆడా, మగ తేడా లేకుండా అందర్నీ నవ్వుల్లో ముంచెత్తిన త్రివిక్రమ్ పంచ్ లలో మునుపటి పవర్ ఏది? అసలేమైది త్రివిక్రమ్ కి? ఇవి ప్రతి తెలుగు ప్రేక్షకుడ్నీ వెంటాడుగున్న ప్రశ్నలు.
తెలుగు సినిమా పుట్టాక చాలామంది రచయితలొచ్చారు. కానీ...తర్వాతి తరాన్ని ప్రభావితం చేసిన రచయితలు మాత్రం కొందరే. ఆ కోవకు చెందినవారే పింగళి, ఆత్రేయ, ముళ్లపూడి, జంధ్యాల, పరుచూరి బ్రదర్స్... తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్. అందులో సందేహమే లేదు.
మాటల రచయితగా ఉన్నప్పుడు రకరకాల కథలకు మాటలు రాశాడు త్రివిక్రమ్. ఆ మాటల వల్లే హిట్ అయిన సినిమాలున్నాయ్. స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు.. తదితర సినిమాల్లో డైలాగులే అందుకు నిదర్శనం. మాటల రచయితగా ఆయన ఉన్నంతవరకూ ఆ రంగంలో త్రివిక్రమే నంబర్ వన్.
‘నువ్వే నువ్వే’తో మెగా ఫోన్ పట్టాడు. హిట్ కొట్టాడు. తర్వాత అతడు, జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ, అజ్ఙాతవాసి సినిమాలు చేశాడు. అందులో కొన్ని హిట్లు.. కొన్ని ఫట్లు. ‘సక్సెస్ ఫుల్ దర్శకుడు’ అనిపించుకున్నాడు కానీ... దానితో పాటు కొన్ని సినిమాల పుణ్యమా అని ‘గ్రంథచోరుడు’ అన్న అపప్రదను కూడా మూటగట్టుకున్నాడు.
’అతడు’ అనగానే... ‘వారసుడొచ్చాడు’ అంటున్నారు. ’అఆ’ అనగానే.. ‘మీనా’ నవల గురించి మాట్లాడుతున్నారు. రీసెంట్ గా ’అజ్ఙాతవాసి’ సినిమా విషయంలో జరిగిన రచ్చ గురించి తెలిసిందే. ఫ్రెంచి సినిమా ‘లార్గో వించ్’ని కాపీ చేసి తీశాడని గొడవ గొడవ చేశారు. సరే.. తీస్తే తీశాడు.. సినిమా అయినా బాగా తీశాడా! అంటే అదీ లేదు. దారుణమైన టాక్.
ఏదిఏమైనా. గతంలో ఆయన సినిమాల్లో వినిపించిన, అనిపించిన, కనిపించిన మాటల గారడి.. పోనూ పోనూ కళావిహీనం అవుతూ అభిమానుల్ని వేదనకు గురి చేస్తోంది. త్రివిక్రమ్ లాంటి తెలివైన, మేథసంపత్తి గల రచయిత, దర్శకుడు ఇలా చెడ్డపేరు తెచ్చుకోడం బాధాకరం.
త్రివిక్రమ్ ని చూసి పెన్ పట్టిన రైటర్లున్నారు. త్రివిక్రమ్ ని చూసి సినిమాల వైపు నడిచిన ఔత్సాహికులున్నారు. త్రివిక్రమ్ ని చూసి త్రివిక్రమ్ లా మారిపోయిన అభిమానులున్నారు. కలంతో త్రివిక్రమ్ చేసిన మాయ అలాంటిది. అందుకే.. ఆయన ‘మాటల మాంత్రికుడు’ అయ్యారు. అలాంటి మాటల మంత్రికుడిలో ఏంటీ అలసత్వం?
రానున్న సినిమాలైనా త్రివిక్రమ్ పవరేంటో మళ్లీ తెలియజేస్తాయా?... మాటల మాంత్రికుడికి గత వైభవం మళ్లీ వస్తుందా? దానికి కాలమే సమాధానం చెప్పాలి?