ENGLISH | TELUGU  

వ‌ర్ధంతి స్పెష‌ల్ స్టోరీ: పాటల రసరాజు.. జాన‌ప‌ద గీతాల రారాజు.. కొసరాజు!

on Oct 27, 2020

 

తెల్లటి ధోతి, లాల్చి తొడుక్కుని జరీ అంచు కండువా భుజం  మీద వేసుకొని రైతు బిడ్డలా కనిపిస్తూ మూర్తీభవించిన తెలుగుతనం ఉట్టిపడేలా నిండైన విగ్రహంతో, ఎంతో నిగ్రహంతో కనిపించే వ్యక్తి కొసరాజు రాఘవయ్య చౌదరి. వీరు సంపన్న రైతు కుటుంబంలో గుంటూరు జిల్లా అప్పికట్ల గ్రామంలో 1905 జూన్ 23న‌ జన్మించారు. బాల్యం నుండి వ్యవసాయం అంటే మక్కువ. గ్రామీణ జీవితం పట్ల ఎంతో అవగాహన పెంచుకున్నారు. కొండముది నరసింహం పంతులు గారి వద్ద రామాయణ భాగవతాలను చదివి తెలుగు భాషపై పట్టు సాధించారు. పంతులుగారి ఆధ్వర్యంలోరామాయణాది నాటకాల్లో వేషాలు వేసేవారు. అప్పటి నుండే పాటలు రాయడం ప్రారంభించారు. బాలకవిగా ప్రసిద్ధులయ్యారు. పల్లెల్లోని రైతు జీవితాన్ని దగ్గర ఉండి గమనిస్తూ జానపద బాణీలకు దగ్గరయ్యారు.

'రైతు' పత్రికకు సంపాదకునిగా పని చేస్తున్నప్పుడు సముద్రాల రాఘవాచారిగారితో పరిచయం ఏర్పడింది. కొసరాజులోని ప్రతిభను పసిగట్టిన సముద్రాల గారు గూడవ‌ల్లి రామబ్రహ్మం గారికి పరిచయం చేశారు. రామబ్రహ్మం గారు కొసరాజు నిండైన విగ్రహం చూసి 'రైతుబిడ్డ'లో వేషం వేయించారు. ఆ పాత్రకు కొసరాజు ఆశించినంతటి ఆదరణ రాలేదు.
అదే చిత్రంలో1939లో పాటలు రాయించారు. “నిద్ర మేల్కొనరా తమ్ముడా.. గాఢ‌నిద్ర మేల్కొనరా తమ్ముడా”, "సై సైరా చిన్నపరెడ్డి” లాంటి పాటలు రాయగా అవి జ‌నంలో మారుమోగాయి.

ఆ తర్వాత ఆయన సొంత ఊరు వెళ్ళిపోయారు. 'పెద్ద మనుషులు' (1954)తో చిత్రసీమలో పునః ప్రవేశం చేసి మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. జానపద సాహిత్యం జీర్ణించుకున్న రచయిత ఆయన. వ్యంగ్యోక్తులతో పాటలు రాయాలంటే కొసరాజు గారే అనే స్థాయికి ఎదిగిపోయారు.

“గొర్రెల్నితినువాడే గోవిందా కొడతాడు
బర్రెలు తినేవాడు వస్తాడయ్యా
పగలే చుక్కలు మింటమొలిపింతునంటాడు
నగుబాటుతో తోక ముడిచేనయా”

అంటూ రాజకీయ నాయకుల మీద విసుర్లు విసిరి, ఆ సినిమాతో సినిమాల్లో స్థిరపడి, వందలాది పాటలు రాశారు. 'రాజు పేద' సినిమాలో రాసిన పాట “జేబులో బొమ్మ జేజేల బొమ్మ” అనే పాట ఆంధ్రదేశమంతా మారుమ్రోగింది. అభ్యుదయ గీతాలు, ప్రేమ గీతాలు, హాస్య పాటలు, భక్తి పాటలు.. ఇలా ఏ త‌ర‌హా పాట‌లు రాసినా భావగర్భితంగా ఉండి కొసరాజు గీతాలు ప్రత్యేక ముద్ర కలిగి ఉండేవి.

'రోజులు మారాయి' చిత్రంలోని “ఏరువాక సాగారోరన్నా చిన్నన్న.. నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న” పాటలో ఆరు గాలాలు శ్రమించే రైతు జీవితాన్ని ఎంతో మనోహరంగా కళ్లకు కట్టినట్టుగా చూపించారు. రైతు బాంధవుడు అనిపించుకున్నారు. కేవలం ఆ పాటతో అక్కినేని నాగేశ్వరరావు, వహీదా రెహ్మాన్ చిత్రసీమను ఒక ఊపు ఊపారు.

'ఇల్లరికం' చిత్రంలో “నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా”, "ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవిస్తేనే తెలియునులే" అనే పాటల‌ను ఆ రోజుల్లో పాడుకోని యువకులు లేరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.

జూదం, పేకాట లాంటి ఆటల వల్ల ఇల్లు ఒళ్ళు ఎలా గుల్ల అవుతుందనే విషయాన్ని 'కులగోత్రాలు' సినిమాలో “అయ్యయ్యో చేతుల డబ్బులు పోయినే.. జేబులు ఖాళీ ఆయెనే” అంటూ రాశారు. అలాగే సిగరెట్ తాగడం ఎంత హానికరం అనే దాన్ని హాస్యభరితంగా పాటగా మలవడం వారికే చెల్లింది.
“సరదా సరదా సిగరెట్టు ఇది దొరలు తాగు బల్ సిగరెట్టు
కంపు కొట్టు ఆ సిగరెట్టు కాల్చకోయి నాపై ఒట్టు”

.. ఇలా ఒక చరణం అందిస్తే చాలు ఈతరం ఆ తరం అనకుండా తెలుగువారందరూ పూర్తి పాట పాడగలుగుతారు.

కొసరాజు గారికి ఎద్దులు అంటే ఎంతో ప్రేమ. పశువులు మనుషులకు చేసే సేవలు గురించి హృదయాలకు హత్తుకునేలా రాశారు. 'నమ్మినబంటు'లో “చెంగుచెంగునా గంతులు వేసే.. వో జాతి వెన్నెల బుజ్జాయిల్లారా నోరులేని తువ్వాయిలారా” అంటూ రాసినా, 'గోవుల గోపన్న' చిత్రంలో గోమాతను గురించి, మన సంస్కృతిలో గోమాత పవిత్రత అది మనుషులకు చేసే మేలు గురించి, “వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా.. గోమాతను నేనేరా నాతో సరిపోలవురా” అంటూ వర్ణిస్తూ వారిలో ఉన్న భూతదయను చాటారు.

'లవకుశ' (1963)లో “ఏ  నిమిషానికి ఏమిజరుగునో ఎవరూహించెదరు” అనే గొప్ప పాటను రాశారు. ఆ చిత్రం విడుదలకు ముందు డిస్ట్రిబ్యూటర్లకు చూపించినప్పుడు మొత్తం సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్లు చాలా నిరాశకు లోనయ్యారు. చిత్రమంతా సంగీతభరితమైన పాటలతోనే నిండిపోయింది. ప్రేక్షకులకు బోరు కొట్టే అవకాశం ఉంది కాబట్టి హాస్యనటుడు రేలంగి, గిరిజ గార్లతో ఒక సన్నివేశం పెట్టి దానికి తగ్గట్టుగా జానపద గీతం కొసరాజుతో రాయించి పెట్టమన్నారు. అలాగే కొసరాజుతో పాట రాయించారు.
“వల్లనోయి మామా నీ పిల్లను
అగ్గి ముట్టుకున్న-అర చేత్తో పట్టుకున్న
వల్లనోయి మామా నీ పిల్లను”

అనే పాటతో నిర్మాతలు సన్నివేశం చిత్రించారు. ఆ పాట ఇచ్చిన కిక్ తో సినిమా అనుకున్నదానికన్నా హిట్ అయిపోయింది.

'మూగ మనసులు'లోని "గౌరమ్మా నీ మొగుడెవరమ్మా.. బిక్షం అడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి" అంటూ ప్రేక్షకులకు సాత్వికతతో కూడిన వేదాంతాన్ని బోధించారు.

'శ్రీకృష్ణ పాండవీయం' (1966) పౌరాణిక చిత్రం కోసం రాసిన “మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా” పాట సమకాలీన సమాజానికి నీతి బోధ కావించేదిలా ఉంది. ఆ పాట ఎంతో ప్రజాదరణ పొందింది.

ఇలాంటి ఆపాత మధురాలైన పాటలను వంద‌ల‌ సంఖ్యలో అందించిన కొస‌రాజు గారికి “కవిరత్న”, “జానపద కవి సార్వభౌమ” అనే బిరుదులు వరించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1984లో రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి తమ వంతు బాధ్యతగా ఆ రసరాజును సత్కరించి గౌరవించింది. అంత గొప్ప ప్రజాకవి 1987 అక్టోబ‌ర్ 27న స్వర్గస్తులయ్యారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా వారు అందించిన పాటలు పండిత పామర జనాల గుండెల్లో ఈనాటికీ భద్రంగా ఉన్నాయి.

- రావుల పుల్లాచారి
                                                                                                                                               (విశ్రాంత పర్యవేక్షకులు)
హుజూరాబాద్
 

(ఈ వ్యాసరచయితకు ప్రముఖ రచయిత, నటుడు రావి కొండలరావు ఒక సందర్భంలో చెప్పిన విషయాల ఆధారంగా రాసినది మాత్రమే)


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.