వీళ్లకంటే రాజకీయనాయకులు నయం
on Aug 9, 2017
ఏ విషయాన్నయినా... ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టేట్టు... ఇంకా మాట్లాడితే.. ముఖం మీద కొ్ట్టేట్టు చెప్పడం దర్శకుడు తేజా స్టయిల్. ఇరవైనాలుగ్గంటలూ వ్యక్తిపూజలూ, భజన.. ఇదే సినిమా పరిశ్రమ పరిస్థితి. కానీ... తేజా మాత్రం ఈ విషయంలో విరుద్దం. నిర్మొహమాటంగా ఎవర్నయినా సరే... లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంటాడు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమావాళ్లందరినీ కడిగిపారేశారాయన. ‘రాజకీయ నాయకులు అయిదేళ్లకు ఓ సారి పార్టీ మారిస్తే... సినిమా వాళ్లు ప్రతి శుక్రవారానికీ ఓ సారి పార్టీ మార్చేస్తారు. ఈ ప్రపంచంలో నమ్మకూడని వాళ్లు ఎవరైనా ఉన్నారంటే... వాళ్లు కచ్చితంగా సినిమా వాళ్లే. సినిమా ఫ్లాప్ అయ్యిందంటే... తొలి షో పడిందగ్గర్నుంచే ఫేస్ లో హవభావాలు మారిపోతుంటాయ్. హిట్ అయితే... ఇక నువ్వే దేవుడివి. మొన్నటిదాకా నా సినిమాలు బాగా ఆడలేదు. ఇప్పటికీ నాకు హిట్ లేదు. దాంతో ఒక్కడు కూడా నా దగ్గరకొచ్చి సినిమా తీసిపెట్టమన్న పాపాన పోలేదు. ఇప్పుడు ‘నేనే రాజు నేనే మంత్రి’ చేశాను. ఆ సినిమా ట్రైలర్ బావుందనే టాక్ వచ్చింది. అంతే.. సూట్ కేసులు పట్టుకొని నా దగ్గరకు వస్తున్నారు. రేపు ఆ సినిమా ఆడకపోతే.. వీళ్లెవరూ కనిపించరు. నాకు తెలుసు’అంటూ కుండ బద్దలు కొట్టాడు తేజా.