ఈ శుక్రవారం... కొత్త హీరోయిన్లకు అంకితం!
on Jul 10, 2019
నదిలో కొత్త నీరు ప్రవహించడం... తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తుండటం సహజమే. అయితే... ఈ శుక్రవారం విడుదలవుతున్న నాలుగు సినిమాల్లోనూ కొత్త హీరోయిన్లు నటించారు. మొత్తం మీద ఐదుగురు కొత్త హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. అఫ్కోర్స్... ఇద్దరు కొత్త హీరోలు కూడా వస్తున్నారనుకోండి.
'దొరసాని'తో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, 'రాజ్‌దూత్'తో దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్ హీరోలుగా పరిచయం అవుతున్నారు. 'దొరసాని' విడుదలకు ముందే ఆనంద్ దేవరకొండకు మరో సినిమా వచ్చింది. శ్రీహరిపై సాయం పొందిన కొందరు మేఘాంశ్ తో సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. హీరోలను పక్కన పెడితే... ఈ నెల 12న తెలుగు తెరకు హీరోయిన్లగా పరిచయం అవుతున్న శివాత్మిక రాజశేఖర్, ఐశ్వర్యా రాజేష్, అన్యా సింగ్‌పై అందరి దృష్టి నెలకొని ఉంది. వాళ్ల జాతకాలకు ఈ శుక్రవారం కీలకంగా మారింది.
తెలుగులో విడుదలవుతున్న ఐశ్వర్యా రాజేష్ తొలి సినిమా 'కౌసల్యా కృష్ణమూర్తి'. డబ్బింగ్ సినిమా మణిరత్నం 'నవాబ్'లో ఆమెను తెలుగు ప్రేక్షకులు చూశారు. అలాగే, తమిళంలో పాతిక సినిమాల్లో నటించారు. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఒక సినిమా, 'మిస్ మ్యాచ్' అని మరో సినిమా చేస్తున్నారు. అయితే... ఇవన్నీ నటిగా ఆమె ప్రతిభను చూపించే సినిమాలు. ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో ఉండాలంటే గ్లామర్ ఇమేజ్ కావాలి. గ్లామర్ పరంగా ఐశ్వర్యా రాజేష్‌కు ఎన్ని మార్కులు పడతాయో చూడాలి.
శుక్రవారం హీరోయిన్గా పరిచయం అవుతున్న మరో అమ్మాయి శివాత్మిక. యాంగ్రీ స్టార్ రాజశేఖర్., జీవిత దంపతుల రెండో కుమార్తె. 'దొరసాని' ప్రచార చిత్రాల్లో శివాత్మిక అప్పియరెన్స్ ఆకట్టుకుంది. సినిమాలో ముద్దులు ఉండటంతో కథానుగుణంగా హద్దుల్లో రొమాంటిక్ సీన్స్ చేస్తుందనే సంకేతాలు ఇండస్ట్రీకి వెళ్లాయి. నటిగా ఎలా చేస్తుందనేది తెలియాలి. అది శుక్రవారం తెలుస్తుంది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఈ శుక్రవారం అడుగుపెడుతున్న మరో హీరోయిన్ అన్యా సింగ్. రెండేళ్ల క్రితం హిందీలో ఒక సినిమా చేసింది. అంతగా ఆడలేదు. తర్వాత యాక్సిడెంట్ కావడంతో కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ వస్తోంది. సందీప్ కిషన్ హీరోగా, నిర్మాతగా చేసిన 'నిను వీడని నీడను నేనే'లో అన్యా సింగ్ నటించింది. బికినీ వేయడానికి, బోల్డ్ సీన్స్ చేయడానికి రెడీ. సందీప్ కిషన్ సినిమా హిట్ అయితే యంగ్ హీరోల పక్కన ఆమెకు అవకాశాలు వస్తాయి. 'రాజ్‌దూత్'తోనూ ఇద్దరు కొత్త హీరోయిన్లు వస్తున్నారు. మొత్తానికి ఈ శుక్రవారం కొత్తవాళ్లకు అంకితం అయింది.