కార్తికేయతో సమంత... మాటలయ్యాయి!
on Oct 26, 2020
యువ కథానాయకుడు, 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయతో అగ్ర కథానాయిక సమంత నటిస్తుందా? అంటే... 'నటించవచ్చు' అని సమాధానం చెప్పాలి. 'వైల్డ్ డాగ్' చిత్రీకరణ నిమిత్తం కింగ్ అక్కినేని నాగార్జున మనాలి వెళ్లడంతో... ఆదివారం బిగ్ బాస్ ఎపిసోడ్ హోస్ట్ గా ఆయన కోడలు సమంత వచ్చారు. ఇదే షోలో కార్తికేయ కూడా సందడి చేశారు. ఆయన ఓ పాటకు డాన్స్ చేశారు. ఆ తరువాత కార్తికేయ, సమంత మధ్య సినిమాకు సంబంధించిన చర్చ జరిగింది.
షో నుండి 'మహర్షి' ఫేమ్ దేవి ఆదివారం ఎలిమినేట్ అయింది. ఆ సమయంలో కార్తికేయ స్టేజి మీద ఉన్నాడు. "దేవికి నీ సినిమాలో ఛాన్స్ ఇవ్వాలి" అని కార్తికేయను సమంత రిక్వెస్ట్ చేశారు. "మహేష్ గారి సినిమాలో ఆ అమ్మాయి నటించింది" అని గుర్తు చేస్తూనే... తన సినిమాలో అవకాశం తప్పకుండా ఇస్తానని మాటిచ్చాడు. పనిలో పనిగా తనతో ఓ సినిమాలో నటించాల్సిందిగా సమంతను రిక్వెస్ట్ చేశాడు. వెంటనే సమంత ఓకే చెప్పేశారు. మనం ముగ్గురం కలిసి ఓ సినిమాలో నటిద్దామని మాటిచ్చేశారు. మాటలు అయితే పూర్తయ్యాయి... దర్శక నిర్మాతలు ఎవరైనా మంచి కథతో వెళ్తే సినిమా కూడా పట్టాలు ఎక్కుతుందని ఆశించవచ్చు.
Also Read