'ఆర్ఆర్ఆర్'లో ఆలియా సాంగ్!
on Oct 30, 2020
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'గంగూబాయ్ కతియవాడి' సినిమాలో ఆలియా భట్ టైటిల్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇందులో ఆమెపై చిత్రీకరిస్తున్న పాటలను శ్రేయా ఘోషల్ పాడుతోంది. అయితే యస్.యస్. రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్'లో ఆమె పాటను ఆమే పాడుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇంతియాజ్ అలీ సినిమా 'హైవే', శశాంక్ ఖైతాన్ డైరెక్ట్ చేసిన 'హంప్టీ శర్మా కీ దుల్హనియా' సినిమాల్లో ఆలియా స్వయంగా పాడిన పాటలను మనం విన్నాం.
'ఆర్ఆర్ఆర్' మూవీలో ఆలియాకు డాన్స్ చేస్తూ పాడే ఓ పెద్ద పాట ఉంది. ఆ పాటను ఆమె పాడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఇది తెలుగు వెర్షన్ కోసం కాదు, హిందీ వెర్షన్ కోసం. తెలుగు సినిమాకు వేరే సింగర్ పాడతారని సమాచారం. 'ఆర్ఆర్ఆర్'లో ఆలియా క్యారెక్టర్ నిడివి చాలా తక్కువే ఉంటుందని అంతర్గత వర్గాలు తెలిపాయి. టైటిల్స్‌లో ప్రత్యేక పాత్రలో అని ఆలియా పేరును పేర్కొంటారని ఆ వర్గాలు చెప్పాయి.
వచ్చే సోమవారం, అంటే నవంబర్ 2న 'ఆర్ఆర్ఆర్' షూట్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తోంది ఆలియా. ఇందులో ఆమె అల్లూరి సీతారామరాజు జోడీ సీత పాత్రను పోషిస్తోంది. రామరాజుగా రామ్ చరణ్ నటిస్తోన్న విషయం తెలిసిందే. మరో జంటగా జూనియర్ ఎన్టీఆర్, ఒలీవియా మోరిస్ కనిపించనున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ కూడా ప్రత్యేక పాత్రల్లో దర్శనమిస్తారు.