ఆర్జీవీ.. రోజూ గిల్లేవాడు!
on Apr 1, 2020
రామ్‌గోపాల్ వర్మపై 'ఆర్జీవీ' అనే సినిమా తీస్తానని ప్రతినబూనిన సీనియర్ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.. చేతల్లో దాన్ని చూపించే పనిలో నిమగ్నమయ్యారు. ఏప్రిల్ 2 శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని 'ఆర్జీవీ' టైటిల్ లోగోను విడుదల చేశారు. ఆ టైటిల్‌కు 'రోజూ గిల్లే వాడు' అనే ట్యాగ్‌లైన్ పెట్టడం గమనార్హం. ఈ సందర్భంగా జొన్నవిత్తుల మాట్లాడుతూ 'తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు'.. తన పిచ్చి ఇజంతో యువతను పెడత్రోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసఫీ మీద సంధించిన రామబాణమే ఈ సినిమా అని, అందుకే 'శ్రీరామనవమి' పర్వదినాన ఈ మూవీ టైటిల్ లోగో విడుదల చేశామనీ తెలిపారు.
ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరిస్తోన్న 'కార్తికేయ' చిత్ర నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ, కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే చిత్రీకరణ ప్రారంభిస్తామని, సామాజిక బాధ్యత లేని ఒక కుహనా మేధావి ఐడియాలజీ సమాజాన్ని ఎలా కలుషితం చేస్తుందో తెలిపేదే ఈ సినిమా అని చెప్పారు.
సురేష్, రాశి, శ్రద్ధా దాస్, అమిత్, పునర్నవి భూపాలం, తేజ తదితరులు తారాగణమైన ఈ చిత్రాన్ని మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్నారు. వీణాపాణి సంగీతం, వేదాంత్ మల్లాది సినిమాటోగ్రఫీ అందిస్తన్న ఆర్జీవీ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో పాటు కథ, చిత్రానువాదం (స్క్రీన్‌ప్లే), మాటలు, పాటలను కూడా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అందిస్తున్నారు.
కాగా ఈ సినిమాకు 'ఆర్జీవీ' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయడానికి ఇదివరకే తెలుగు ఫిల్మ్ చాంబర్ నిరాకరించింది. రామ్‌గోపాల్ వర్మ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకొస్తేనే రిజిస్టర్ చేస్తామని చెప్పింది. అయినప్పటికీ ఆ టైటిల్‌కే జొన్నవిత్తుల కట్టుబడి ఉన్నారని తాజా టైటిల్ లోగో ఆవిష్కరణతో స్పష్టమైంది.
Also Read