రవీనా టాండన్ మనవడిని చూశారా?!
on Aug 10, 2020
లైఫ్‌లో అమ్మానాన్నలు కావడం ఒక స్పెషల్ ఫీలింగ్ అయితే, అమ్మమ్మ తాతయ్యలు లేదా నానమ్మ తాతయ్యలు కావడం మరో అనిర్వచనీయమైన అనుభవం. మనవళ్లు మనవరాళ్లపై గ్రాండ్‌పేరెంట్స్‌కు ఉండే ప్రేమను వర్ణించలేం. తమ కళ్లముందు దోకాడుతూనో లేదా బుడి బుడి నడకలు వేస్తూనే కనిపించే ఆ పసికందులను చూస్తూ, వాళ్లతో ఆడుకుంటూ అమితానందాన్ని వారు పొందుతుంటారు. అలాంటి అనుభవాల్నీ, అనుభూతుల్నీ పొందుతున్నారు టాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలు చేసిన బాలీవుడ్ అందాల తార రవీనా టాండన్.
అవును. గత ఏడాదే ఆమె అమ్మమ్మగా ప్రమోషన్ పొందారు. ఈ లాక్డౌన్ కాలంలో తన బుజ్జి మనవడు ఏం చేస్తున్నాడో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. 21 ఏళ్ల వయసులో ఉండగానే 1995లో సింగిల్ మదర్‌గా ఇద్దరు పిల్లలను ఆమె దత్తత తీసుకున్నారు. ఆ ఇద్దరూ చనిపోయిన ఆమె కజిన్ కూతుళ్లు. వాళ్ల పేర్లు.. ఛాయ, పూజ. ఆ తర్వాత 2004లో అనిల్ తడానీతో వివాహం అయ్యాక స్వయంగా రణబీర్వర్ధన్, రష అనే ఇద్దరు పిల్లల్ని కన్నారు రవీనా. 2019 సెప్టెంబర్‌లో ఛాయ తల్లవడంతో, రవీనా అమ్మమ్మగా ప్రమోట్ అయ్యారు. ఛాయకు పుట్టిన బాబుకు రుద్ర అనే పేరు పెట్టారు.
లాక్డౌన్ దగ్గర్నుంచి తన మనవడిని కలుసుకోలేక పోతుండటంతో తెగ బాధపడిపోతున్నారు రవీనా. అయితే కూతురు ఛాయకు వీడియో కాల్ చేసి, రుద్ర ఏం చేస్తున్నాడో ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. రోజుకు ఓసారైనా వీడియో కాల్లో రుద్రను చూడకుండా ఉండలేకపోతున్నారు. మనవడు సరిగా నిద్రపోతున్నాడా, తిండి సరిగా తింటున్నాడా, బేబీ మసాజ్ చేయించుకుంటున్నాడా.. లాంటి ఆరాలు తీస్తున్నారు. అమ్మమ్మగా తన లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నానని రవీనా అంటున్నారు.
Also Read