రానా... రాక్షస రాజ్యంలో రావణుడు!
on Jan 23, 2020
తెలుగు తెరపై ఇప్పటివరకూ వచ్చిన అతి క్రూరమైన, కర్కశమైన ప్రతినాయక పాత్రలలో 'బాహుబలి'లోని బల్లాలదేవ పాత్ర ఒకటి. అతడు ఎంత క్రూరుడు కాకపోతే సోదరుడి భార్యపై మనసుపడి సంకెళ్ళతో బంధిస్తాడు చెప్పండి? పైగా, తనను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. పురాణాల్లోకి వెళితే రావణుడు కూడా ఇంచు మించు ఇదే విధమైన పని చేశాడు. రాముడి భార్య సీత పై మనసు పడి ఆమెను అపహరించుకుని వెళ్లి బంధిస్తాడు. ఇప్పుడు వీరిద్దరి ప్రస్తావన ఎందుకంటే... 'బాహుబలి'లో భల్లాలదేవగా ప్రతినాయకుడి పాత్రలో కనిపించిన రానా దగ్గుబాటి, ఈసారి రావణుడిగా సరికొత్త ప్రతినాయక పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నాడని సమాచారం.
దర్శకుడు తేజ ఇటీవల 'రాక్షస రాజ్యంలో రావణుడు' అని ఓ టైటిల్ రిజిస్టర్ చేయించారు. అది రానా కోసమే అని దర్శకుడు సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇంతకు ముందు రానా హీరోగా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా చేశారు తేజ. అందులో హీరో పాత్ర అక్కడక్కడా ప్రతినాయక ఛాయలతో సాగుతుంది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. 'రాక్షస రాజ్యంలో రావణుడు' చిత్రంలో హీరోగా రానా పాత్ర కూడా ప్రతినాయక ఛాయలతో ఉంటుందట. నెగిటివ్ షేడ్ హీరో రోల్ అన్నమాట. సమకాలీన సామాజిక అంశాలతో డార్క్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' చేస్తున్నారు రానా. బహుశా... ఆ సినిమా పూర్తయిన తర్వాత తేజ సినిమా ప్రారంభిస్తారు ఏమో?