బక్కగా ఉండే రానా బీస్ట్ భల్లాలదేవగా ఎలా మారాడు?
on Aug 13, 2020
నటుడిగా ఫేమస్ అయిన రానా దగ్గుబాటి నిజానికి ఒక సినిమా ప్రొడ్యూసర్, ఒక టెలివిజన్ హోస్ట్, ఒక విజువల్ ఎఫెక్ట్స్ కోఆర్డినేటర్, ఒక వ్యాపారవేత్త. ఇన్ని కోణాలున్న రానా 1984 డిసెంబర్ 14న పుట్టాడు. 2020 ఆగస్ట్ 8న మిహీకా బజాజ్‌ను పెళ్లాడి ఒక ఇంటివాడయ్యాడు. నటుడిగా రానా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నది 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాలతోటే అనేది నిర్వివాదం. అయితే ఆ సినిమాలు చేయడానికి ముందు రానా చాలా సన్నగా, రివటలా ఉండేవాడు. అలాంటివాడు 'బాహుబలి'లో భీకరంగా కనిపించే భల్లాలదేవగా ఎలా మారాడు? కండలు తిరిగిన దేహాన్ని ఎలా పొందాడు.. అనేది ఆసక్తికరమైన విషయం.
అనేక ఇంటర్వ్యూల్లో తనకు నాన్-వెజిటేరియన్ ఫుడ్ అంటే ఇష్టమని తెలియజేశాడు రానా. అందులోనూ స్పైసీగా ఉండే చెట్టినాడ్ చికెన్ వంటకాలంటే బాగా ఇష్టమంటాడు. అలాగే తెలుగువాళ్లందరికీ ఎంతో ప్రియమైన బ్రేక్‌ఫాస్ట్ వంటకాలు ఇడ్లీలు, దోశలన్నా ఇష్టంగా తింటాడు. భల్లాలదేవ క్యారెక్టర్‌కు తగ్గట్లు మేకోవర్ కావడానికి తన ఆహారంలో పెద్దగా మార్పులేమీ చెయ్యలేదని రానా వెల్లడించాడు. ఎప్పుడూ తినే వంటకాలనే అప్పుడూ తినేవాడినని చెప్పాడు. కాకపోతే రోజుకు ఐదు నుంచి ఎనిమిది సార్లు తినేవాడినని చెప్పాడు. కాకపోతే అతను చెప్పిన వాటిలో ముఖ్యమైన అంశం.. స్వీట్లకు దూరంగా ఉండటం. తన నాలుకకు స్వీట్ల రుచి తగలకుండా చూసుకున్నాడు.
అయినప్పటికీ రానాకు సమతుల్య ఆహారం అందేలా జాగ్రత్తలు తీసుకున్నాడు అతని పర్సనల్ ట్రైనర్ కునాల్ గిర్. ఎక్కువగా వెజిటబుల్స్, మిల్క్ ప్రొటీన్లు అతని డైట్లో ఉండేవని ఒక ఇంటర్వ్యూలో కునాల్ వెల్లడించాడు. భల్లాలదేవ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ రోజుల్లో రానా రోజువారీ తిండి ఎలా ఉండేదంటే...
బ్రేక్‌ఫాస్ట్
నట్స్‌తో కూడిన ఒక బౌల్ ఓట్మీల్, బ్రౌన్ బ్రెడ్ ఐదు ముక్కలు, 8 ఎగ్ వైట్స్, వెజిటబుల్స్. పుచ్చకాయలు లేదా బొప్పాయి వంటి పండ్లు కూడా ఉండేవి.
స్నాక్ 1
ఉదయం 11 గంటలకు ఒ గ్లాస్ నీటిలో కలిపిన ప్రొటీన్ పౌడర్, కొన్ని తాజా పండ్లు.
లంచ్
ఆకుకూరలతో పాటు ప్రొటీన్ కోసం ఫిష్ లేదా చికెన్.
స్నాక్ 2
బ్రౌన్ బ్రెడ్ 4 ముక్కలు, నాలుగు అరటిపండ్లు. దీని తర్వాత అతను ఈవెనింగ్ వెయిట్ ట్రైనింగ్‌కు వెళ్లేవాడు.
డిన్నర్
రాత్రి 9 గంటలకు హైప్రొటీన్ ఫుడ్ తీసుకునేవాడు. ఎందుకంటే అప్పటిదాకా వెయిట్ ట్రైనింగ్ కారణంగా కండరాల టిష్యూలు బాగా నలిగిపోతాయి కాబట్టి వాటి మరమ్మత్తు కోసం అన్నమాట. ప్రొటీన్ ఫుడ్‌తో పాటు సలాడ్ కూడా తీసుకొనేవాడు.
ట్రైనర్ కునాల్ గిర్ ఆధ్వర్యంలో చెస్ట్‌పై ఫోకస్ చేసిన వర్కవుట్స్, బైసెప్స్ ఎక్కువగా చేసేవాడు రానా. అతని శరీరంలోని కండరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 9 సెట్ల వెయిట్ ట్రైనింగ్ సెషన్లను కునాల్ నిర్వహించేవాడు. వీటికోసం మూడు భిన్నమైన ఎక్సర్సైజులను రానా చేసేవాడు. వారానికి ఐదు రోజులు ఈ ఎక్సర్సైజులు ఉండేవి. రెండు రోజులు శరీరానికి రెస్ట్ ఇచ్చి మళ్లీ ఎక్సర్సైజులు మొదలుపెట్టేవాడు. దాని ఫలితమే 'బాహుబలి'లో మనం చూసిన భల్లాలదేవ రూపం!