పవనిజానికి సీన్ లేదు!
on Oct 10, 2017
వర్మ మళ్లీ కెలికాడు. ఈ దఫా పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేశాడు. నేరుగా పవర్ స్టార్ కి లెటరే రాసేశాడు. పవన్ కల్యాణ్ ‘ఇజం’ పేరుతో ఓ పుస్తకం రాసిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం చదివిన వర్మ... పవన్ పై లేఖాస్త్రాన్ని సంధించాడు.
‘హాయ్ పవన్.. మీ పవనిజం అంటే నాకు పిచ్చి. మీరు రాజకీయ పార్టీ పెడుతున్నారంటే నిజంగా చాలా ఆనందమేసింది. మీలో ఉన్న నిజాయితీ నాకిష్టం. మీ మొదటి రాజకీయ ప్రసంగంలో ఆ నిజాయితీ ప్రస్ఫుటంగా కనిపించింది. మీ నుంచి పుస్తకం వస్తుందంటే.. ఎంతో ఆసక్తిగా ఎదురు చూశా. పుస్తకాలు చదవడం ఇష్టం కాబట్టి.. రాగానే ఆబగా చదివేశా. అయితే... తీరా చదివాక... మీ ‘ఇజం’ బుక్ కి అంతసీన్ లేదని అర్థమైపోయింది. ఇది మీ తప్పు కాదు. ఈ పుస్తకం తేవడంలో కీలక పాత్ర పోషించిన రాజు రవితేజా ఈ పొరపాటుకు కారకుడు అని నా అభిప్రాయం. మీ భావాలను తాను స్కూల్ పిల్లాడిలా అర్థం చేసుకున్నాడు. అందుకే ఈ పుస్తకం ఇలా వచ్చింది. నేటి జనాలకు కావాల్సింది కచ్చితంగా ‘పవనిజం’ మాత్రమే. అది ఈ పుస్తకంలో 90 శాతం లేదు. అందుకే.. ఈ పుస్తకాన్ని నేను అంగీకరించలేకపోతున్నాను. నా రాతల్ని చూసి నాకు మీరంటే ఇష్టం లేదనుకోకండి. మీరన్నా.. మీ భావాలన్నా నాకిష్టం. ఐ లైక్ ఇట్’ అని రాశాడు వర్మ. మరి దీనిపై పవర్ స్టార్ ఎలా స్పందిస్తాడో చూడాలి.