ఐదేళ్ల 'బాహుబలి': సెలబ్రేట్ చేసుకున్న ప్రభాస్, రానా
on Jul 10, 2020
బాహుబలిగా ప్రభాస్, భల్లాలదేవగా రానా దగ్గుబాటి నటించిన 'బాహుబలి: ద బిగినింగ్' మూవీ జూలై 10తో ఐదేళ్లను పూర్తి చేసుకుంది. 2015లో ఇదే రోజు రిలీజైన ఆ సినిమా తెలుగు సినిమా దశనూ, దిశనూ సమూలంగా మార్చేసింది. దేశవ్యాప్తంగా సినీ ప్రియులంతా తెలుగు సినిమావైపు తేరిపారచూసేలా చేసింది. అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది. యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పటివరకూ ఆయన కెరీర్లోనూ, ప్రభాస్ కెరీర్లోనూ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ ఎదగడానికి నాంది పలికింది.
అలాంటి 'బాహుబలి' విడుదలై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభాస్ స్పందించాడు. గుర్రంపై విన్యాసం చేస్తున్న బాహుబలి ఫొటోను, రాజమౌళి కుమారుడు కార్తికేయ ఎడిట్ చేసిన ప్రత్యేకమైన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు. ఫొటోకు "Here’s to the team that created magic! Celebrating #5YearsOfBaahubali The Beginning" అని రాసిన అతను వీడియోకు "Baahubali: The Beginning... Feeling nostalgic" అని క్యాప్షన్ పెట్టాడు.
అత్యంత క్రూరమైన విలన్‌గా అద్భుతంగా రాణించిన రానా సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసి, "5 Years of Baahubali!Killer edit @kyarlagadda17.. Loved it!!" అని రాశాడు. అలాగే అవంతికగా అలరించిన తమన్నా సైతం ఇదే వీడియోను తన సోషల్ మీడియా పేజి ద్వారా షేర్ చేసి, తన ఆనందాన్ని పంచుకుంది.
Also Read