ENGLISH | TELUGU  

'ఆర్డీఎక్స్ లవ్'తో పాయల్ నంబర్ వన్ హీరోయిన్ అయిపోతుందేమో?!

on Oct 11, 2019

 

"ఈ మూవీ నా కెరీర్‌లో మైలురాయి అవుతుందని కచ్చితంగా చెప్పగలను. ఏ యాక్టర్ కెరీర్‌లోనైనా ఇలాంటి స్క్రిప్ట్స్ అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా.".. ఇవి 'ఆర్డీఎక్స్ లవ్' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ నోటి నుంచి వచ్చిన మాటలు. ఆమె మాటల్ని బట్టి 'ఆర్డీఎక్స్ లవ్' ఎంత గొప్పగా ఉంటుందో అనే అభిప్రాయం, కచ్చితంగా సినిమా చాలా బాగుంటుందనే నమ్మకం చాలామందిలో కలుగుతుంది. 

నిజానికి కొన్ని రోజుల క్రితం ఈ మూవీ టీజర్, తర్వాత ట్రైలర్ రిలీజైనప్పుడు.. వాటిలో పాయల్ కనిపించిన తీరుచూసి, సోషల్ మీడియాలో చాలామంది ఆమెను ట్రోల్ చేశారు. "ఇలాంటి కేరెక్టర్ చెయ్యడం అవసరమా?" అని ప్రశ్నించారు. అంత బోల్డ్‌గా తన అందాలు, వంపుసొంపులు ప్రదర్శిస్తూ వాటిలో కనిపించింది పాయల్. స్క్రిప్ట్ ప్రకారం అలా కనిపించానే కానీ, నిజానికి ఇది గొప్ప స్క్రిప్ట్ అనీ, ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విషయాలు, వార్నింగ్ ఇచ్చే విషయాలు ఉంటాయని, అందుకే ఈ సినిమా చేశాననీ విమర్శకులకు సమాధానం చెప్పింది పాయల్.

ఇప్పుడు సినిమా మనముందుకు వచ్చింది. నిజమే. పాయల్ చెప్పినట్లు 'ఆర్డీఎక్స్ లవ్'లో కొన్ని మంచి విషయాలున్నాయి. 'సేఫ్ సెక్స్', మద్యపానాన్ని విడనాడి భార్యల్ని సుఖపెట్టడం, గుట్కాలను త్యజించడం వంటి వాటిని కథలో భాగం చేశాడు డైరెక్టర్ శంకర్ భాను. అంతే కాదు.. తమ ఊరు, తమ చుట్టుపక్కల ఉన్న నలభై ఊళ్ల ప్రజల కోసం నాలుగు కిలోమీటర్ల వంతెన తీసుకురావడానికి అలివేలు అనే యువతి తన శీలాన్ని సైతం పణంగా పెట్టిందనే విషయాన్నీ ఈ సినిమాలో హైలైట్ చేశారు. ఆ అలివేలు ఎవరో కాదు.. పాయల్ రాజ్‌పుత్. ఇంతకీ ఆమె తన శీలాన్ని పణంగా పెట్టింది, అర్పించింది ఎవరికో తెలుసా.. తన ప్రియుడికి!

'సేఫ్ సెక్స్' గురించి ప్రచారం చేసే అమ్మాయి.. ప్రియుడితో గడిపి, తన శీలాన్ని పణంగా పెట్టానంటూ విలన్‌కు చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉందో! ఆ విలన్ ఎవరో కాదు.. ఆమె ప్రియుడి తండ్రే! ఇక సీఎం బాపినీడు అపాయింట్‌మెంట్ సాధించడానికి తన నలుగురు స్నేహితురాళ్లతో కలిసి ఆమె చేసే 'సేఫ్ సెక్స్' ప్రచారం చూస్తుంటే.. సినిమాని చూస్తున్నట్లు కాకుండా ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఒక నడివయసు వ్యక్తి పెళ్లిచేసుకోకుండా రోజుకో స్త్రీతో సేఫ్ సెక్స్ చేస్తున్నానని చెప్తే, అతడు చేస్తున్నది తప్పుపని అని మూతిపళ్లు రాలకొట్టాల్సిందిపోయి, తమ 'సేఫ్ సెక్స్' ప్రచారానికి అతను బ్రాండ్ అంబాసిడర్ లాంటివాడని తెగపొగిడేసి, అతడితో సెల్ఫీ దిగే హీరోయిన్ అలివేలును ఏమనుకోవాలి! అలివేలు చేసే ప్రచారం, ఆమె చేష్టలు చూస్తే.. సేఫ్ సెక్స్ చేసేవాడు ఎన్ని లైంగిక సంబంధాలైనా పెట్టుకోవచ్చు.. అనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఇందులో ఏమాత్రం నైతికత లేదని ఏకొంచెం జ్ఞానం ఉన్నవాడైనా ఈజీగా చెప్పేస్తాడు.

అలివేలు చేసే ఘనకార్యాలు అంతటితో ఆగవు. ఒక ఊళ్లో స్త్రీలకు కడుపు పండటంలేదనీ, మరణాల రేటు పెరుగుతోంది కానీ, జననాల రేటు ఏమాత్రం కనిపించడంలేదని తెలిసి, తన బృందంతో అక్కడకు వెళ్తుంది. తమ మొగుళ్లు ఫూటుగా తాగేసివచ్చి, తొంగుంటున్నారనీ, తమతో శృంగారం చెయ్యడానికి ఆసక్తి చూపించడం లేదనీ, ఇక తమ కడుపులు ఎలా పండుతాయనీ ఆ ఊరి స్త్రీలంతా అలివేలుకు మొరపెట్టుకుంటారు. తలనిండా మల్లెపూలు పెట్టుకొని సింగారించుకుంటే, ఆ వాసనకి మత్తెక్కి ఆ మొగుళ్లు శృంగారంలోకి దిగుతారని సలహా ఇస్తుంది అలివేలు. కానీ అది ఏమాత్రం ఫలితాన్నివ్వదు. మల్లెపూల వాసన కంటే, మందు వాసనే బాగుంటుందంటూ ఆ మొగుళ్లు తమ పెళ్లాల్ని తోసేస్తారు. 

దాంతో అలివేలును పిచ్చిగా ప్రేమిస్తూ, ఆమె వెంటే ఉంటూ వస్తున్న సిద్ధు ఒక సలహా ఇస్తాడు. మొగ్గుళ్లు మీ దగ్గరకు రాకపోతే, మీరే వాళ్ల దగ్గరకు వెళ్లమంటాడు. దానికంటే ముందు 'వాత్సాయన కామసూత్రాలు' తెలుసుకోమంటాడు. అతడిచ్చిన 'వాత్సాయన కామసూత్రాలు' పుస్తకం నిరక్షరాస్యులైన అక్కడి స్త్రీలకు చదివి వినిపిస్తుంది అలివేలు. దాంతో ఆ స్త్రీలు వేడెక్కిపోయి, కామంతో దహించుకుపోతూ, తమ మొగుళ్లమీద పడి, వాళ్లకు శృంగార రసాన్ని రుచి చూపిస్తారు. అంతే! ఇక ఆ మొగుళ్లు మందు మాట మర్చిపోయి పెళ్లాల కొంగును వదిలితే ఒట్టు! ఈ ఆలోచనేదో సూపర్‌గా ఉంది కదూ! తమను నిర్లక్ష్యం చేసే మొగుళ్లను తమ కొంగున ముడేసుకోవాలంటే స్త్రీలకు పనికొచ్చే గొప్ప ఆయుధం 'వాత్సాయన కామసూత్రాలు' అన్నమాట. అది చదివితే, స్త్రీల కాపురాలన్నీ చక్కబడతాయనే డైరెక్టర్ థాట్‌కు హ్యాట్సాఫ్ చెప్పుదామా?

అలివేలు లీలలు ఇంకా ఉన్నాయండోయ్! ఆమె ఆపరేషన్‌లో ఇంకో ఘట్టం.. గుట్కాలు మాన్పించడం. విజయవాడలో ఒక పాతబస్తీ తరహా ఏరియా ఉందన్నట్లు చూపించిన డైరెక్టర్.. గుట్కాకు బానిసలైన ఆ బస్తీవాసుల చేత.. ఆ అలవాటు మాన్పించే పనిని అలివేలుకు అప్పగించాడు. ఆమె ఆ బస్తీకి దాదా అయిన ఉస్మాన్ చేతే ఎంత సునాయాసంగా గుట్కా మాన్పిస్తుందో చూస్తే.. గుట్కా వీరులందరికీ స్పెషల్ షో ద్వారా 'ఆర్డీఎక్స్ లవ్' సినిమా చూపించెయ్యాలనిపిస్తుంది. ఉస్మాన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు కానీ, ఆమె అతడ్ని దూరంగా పెట్టేస్తుంది. కారణం.. అతడిని ముద్దుపెట్టుకోవాలంటే, అతడి నోరు గుట్కా వాసన వేస్తున్నదని! నమ్మబుద్ధి కావట్లేదా? 

నిజమండీ బాబూ.. ఈ విషయం ఉస్మాన్ దగ్గర అలివేలే బయటపెడుతుంది. అప్పుడు కానీ తన ప్రేయసి తనను ఎందుకు దూరంగా పెడుతుందనే విషయం.. పాపం.. ఉస్మాన్‌కు తెలీదు. నిజం తెలిసిన ఉస్మాన్, తన నోటిని బాగా రుద్ది రుద్ది కడుక్కొని, తన నోరు గుట్కా వాసన వెయ్యట్లేదని రూఢి చేసుకొంటాడు. అప్పుడు అతడి దగ్గరకు అతని ప్రేయసి వచ్చి, గుట్కా వాసన వెయ్యని అతడి నోటిని తన నోటితో మూసేస్తుంది. వారెవ్వా! గుట్కా సమస్యకు ఎంత చక్కటి పరిష్కారం!! గుట్కా వీరులారా.. అర్జెంటుగా 'ఆర్డీఎక్స్ లవ్' చూడండి.. జీవితంలో మీరెంత ప్రేమను కోల్పోతున్నారో తెలుసుకోండి. మీ జీవితాల్ని ఆనందమయం చేసుకోండి.

ఇన్ని లీలలు చేసిన అలివేలు.. తన ఊరికి అన్యాయం చేసిన టీవీ 59 యజమాని గిరిప్రకాశ్‌కు ఎలా చుక్కలు చూపిస్తుందో కూడా తెలుసుకోవాలి కదా! ఈ గిరిప్రకాశ్ పేరు, అతడ్ని చూపించిన విధానం గమనిస్తే, కొంతకాలంగా వార్తల్లో కనిపిస్తున్న ఒక ప్రముఖ చానల్ మాజీ సీఈవో ఉదంతం స్ఫురించకుండా ఉండదు. ఆ గిరిప్రకాశ్‌కు తెలీకుండా, తనను పిచ్చిగా ప్రేమించిన అతడి కొడుకు సిద్ధును తనతో తీసుకుపోయి, అతడు తనతో చేసే శృంగార చేష్టల్ని వీడియో తీసి, ఆ క్లిప్స్‌ని గిరిప్రకాశ్‌కు షేర్ చేస్తుంది. సిద్ధుకు తన శరీరాన్ని అర్పించి, ఊరికోసం తన శీలాన్ని సైతం పణంగా పెట్టానంటూ ఫోన్‌లో గిరిప్రకాశ్‌కు సందేశాన్నిస్తుంది అలివేలు. 

ఇదండీ.. 'ఆర్డీఎక్స్ లవ్'లో మనకు కనిపించే అలివేలు కథ. నిజమే.. ఇన్ని ఫీట్లు చేసిన, ఇన్ని ఘనకార్యాలు చేసిన అలివేలు గొప్ప కేరెక్టరే! ఒక నటికి ఇలాంటి కేరెక్టర్లు అరుదుగా దొరుకుతాయనీ, ఈ కేరెక్టర్ తాను కాక ఇంకెవరు చేస్తారంటూ ప్రశ్నించిన పాయల్ రాజ్‌పుత్ కష్టాన్ని మన ప్రేక్షకులు గుర్తించి, 'ఆర్డీఎక్స్ లవ్'కు ఘన విజయం చేకూరుస్తారా? సౌత్ ఇండియా టాప్ 10 హీరోయిన్స్‌లో ఒకదాన్నంటూ స్టేట్‌మెంట్ ఇచ్చిన ఆమెను ఇప్పుడు నంబర్ వన్ స్టార్‌ను చేస్తారా? 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.