English | Telugu

బాలయ్య-బోయపాటి సినిమాకు ఓవర్ బడ్జెట్!?

on Dec 13, 2019

 

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న, ఇంకా పేరుపెట్టని సినిమా బడ్జెట్ ఇప్పుడు ఫిలింనగర్‌లో డిస్కషన్ పాయింట్‌గా మారింది. జనరల్‌గా బోయపాటి మూవీ అంటేనే భారీ బడ్జెట్ ఉంటుంది. గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' సినిమాలు కూడా భారీ బడ్జెట్‌లో తయారయ్యాయి. వాటిలో 'సింహా' సినిమాకు మంచి లాభాలే రాగా, 'లెజెండ్' సినిమా వ్యయం విపరీతం కావడం వల్లే ఆశించిన రీతిలో నిర్మాతలకు లాభాలు అందలేదనేది ట్రేడ్ విశ్లేషకుల మాట. ఇప్పుడు బాలకృష్ణ కెరీర్ డౌన్‌ట్రెండ్‌లో ఉంది. క్రిష్ డైరెక్ట్ చేసిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకు మంచి పేరైతే వచ్చింది కానీ, లాభాలు రాలేదు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'పైసా వసూల్' మూవీ పైసలను వసూలు చేయలేక చతికిలపడితే, కె.ఎస్. రవికుమార్ రూపొందించిన 'జై సింహా' సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నడిచింది. ఇక క్రిష్ దర్శకత్వం వహించగా ఈ ఏడాది మొదట్లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్‌లోని రెండు భాగాలు - 'కథానాయకుడు', 'మహానాయకుడు' సినిమాలు రెండూ - ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి. వాటిని నమ్ముకున్న బయ్యర్లు దారుణంగా నష్టపోయారు.

ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న 'రూలర్' మూవీ రిలీజవుతోంది. కె.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు బయ్యర్ల నుంచి ఆశించిన రీతిలో స్పందన లేకపోవడం గమనార్హం. కలెక్షన్ల మీద ఆధారపడే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్‌లో 'రూలర్'పై అసలు బజ్ లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఓవర్సీస్ నుంచి నిర్మాత సి. కల్యాణ్ కనీసం 4 కోట్ల రూపాయలు ఆశించగా, ఆ మేరకు ఏ డిస్ట్రిబ్యూటర్ నుంచి కూడా స్పందన రాలేదని సమాచారం. దాంతో ప్రైడ్ సినిమా అనే డిస్ట్రిబ్యూటర్‌కు దీని రిలీజ్ బాధ్యతలు అప్పగించారు. ఆ డిస్ట్రిబ్యూటర్ కమిషన్ బేసిస్ మీద ఈ సినిమాని అక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఏదేమైనా ఖర్చుపెట్టిన వ్యయంతో పోలిస్తే ఎక్కువ నష్టానికే 'రూలర్'ను 20న విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసే సినిమాకు 60 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం సరైనదేనా? అనే చర్చ ఫిలింనగర్ వర్గాల్లో నడుస్తోంది. ఈ మూవీని మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి డైరెక్ట్ చేసిన 'జయ జానకి నాయక' సినిమాను నిర్మించింది ఆయనే. దాన్ని కూడా బెల్లంకొండ మార్కెట్ పరిధితో పోలిస్తే, చాలా ఎక్కువ బడ్జెట్‌తో నిర్మించారు. దాంతో ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్‌తో ఆయన గట్టెక్కారు. అయినప్పటికీ బాలయ్య, బోయపాటి కాంబో మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి రవీందర్‌రెడ్డి ఏమాత్రం సంకోచించడం లేదు. కారణం.. ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' సినిమాలు హిట్టవడమే. పైగా కెరీర్‌లో డౌన్ స్టేజిలో ఉన్నప్పుడు వచ్చిన ఆ సినిమాలతోనే బాలయ్య మళ్లీ పుంజుకోగలిగారు. దీంతో ఆ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్‌ను సాధిస్తుందనే అపార నమ్మకంతో 60 కోట్ల బడెజ్ట్ పెట్టడానికి రవీందర్‌రెడ్డి రెడీ అవుతున్నారు. రాంచరణ్‌తో బోయపాటి తీసిన మునుపటి మూవీ 'వినయ విధేయ రామ' ఫ్లాప్ కూడా ఆయనను వెనకడుగు వెయ్యనివ్వడం లేదు.

యాక్షన్ డ్రామాగా తయారయ్యే ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమచారం. ఆ ఇద్దరి మునుపటి సినిమాల్లోనూ బాలయ్య డబుల్ రోల్ చెయ్యడం గమనార్హం. పైగా తాజా మూవీలో బాలయ్య చేస్తున్న పాత్రల్లో ఒకటి పోలీసాఫీసర్ అని తెలుస్తోంది. 'రూలర్'లోనూ ఆయన పోలీసాఫీసర్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇలా వరుసగా రెండు సినిమాల్లో పోలీస్ పాత్రలు చేస్తుండటం విశేషం. బోయపాటి బలమల్లా ఎమోషనల్ సీన్లు చిత్రీకరించడంలోనే ఉంది కాబట్టి, ఈ మూవీలో అలాంటి సీన్లు మరిన్ని ఉంటాయని సమాచారం. ఆ తరహాలో రైటర్ ఎం. రత్నం రాసిన కథకు బాలయ్య ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో 60 కోట్ల భారీ బడ్జెట్ రికవర్ ఎలా అవుతుందని బాలయ్య ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.


Cinema GalleriesLatest News


Video-Gossips