ట్రాప్‌లో యూత్.. అంతా బూతు కంటెంట్!
on Jun 30, 2020
1980, 90 దశకాల్లో, 21వ శతాబ్దం తొలినాళ్లలో అడల్డ్స్ ఓన్లీ పేరుతో బూతు సినిమాలు విచ్చలవిడిగా థియేటర్లను ముంచెత్తాయి. ప్రధానంగా మలయాళం నుంచి తెలుగులోకి డబ్బయి వచ్చే ఆ సినిమాలు మెయిన్ స్ట్రీమ్ సినిమాల కలెక్షన్లను కూడా ప్రభావితం చేసేవి. ఆ తరహా సినిమాల్లో షకీలా స్టార్‌గా వెలిగిపోయింది. ఆమె దెబ్బకు మలయాళ సూపర్స్టార్లయిన మమ్ముట్టి, మోహన్‌లాల్ సినిమాల కలెక్షన్లు కూడా పడిపోతుండటంతో, అంతా కలిసి ఆ తరహా సినిమాలపై ధ్వజమెత్తారు. మొత్తానికి వాటిని బ్యాన్ చేయించడంలో వాళ్లు విజయం సాధించారు.
ఆ రోజులు గతించిపోయాయనుకుంటే.. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ పేరుతో స్ట్రీమింగ్ సైట్లు వచ్చాయి. వాటిలో స్ట్రీమ్ అయ్యే కంటెంట్‌పై సెన్సారింగ్ లేకపోవడంతో.. విశృంఖల సెక్స్, వయొలెన్స్, బూతు డైలాగ్స్‌తో వెబ్ సిరీస్, మూవీస్‌తో అవి నిండిపోతున్నాయి. ఏ స్ట్రీమింగ్ సైట్ చూసినా ఇదే స్థితి. వాటిని ఇండివిడ్యువల్సే ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి, వాళ్లని టార్గెట్ చేసుకొనే ఆ సైట్లు నడుస్తున్నాయి. నిజానికి ఇదో ట్రాప్! ఆ ట్రాప్‌లో చిక్కుకున్నవాళ్లు బూతు, హింస ప్రధానంగా తయారవుతున్న కంటెంట్‌ను చూస్తూ.. ఎలాంటి మానసిక స్థితిలోకి జారుకుంటారో ఊహించుకోవాల్సిందే.
ఇప్పుడు 'ఓటీటీ'కి అదనంగా 'ఏటీటీ' అనేదొకటి వచ్చింది. అంటే 'ఎనీ టైమ్ థియేటర్' అన్నమాట. ఓటీటీలో స్ట్రీమింగ్ సైట్ల తరహాలోనే ఏటీటీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే, ఆ యాప్‌లో కొత్తగా అప్లోడ్ అయ్యే సినిమాను డబ్బు పెట్టి చూడొచ్చన్న మాట. ఓటీటీలో మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకొని, మనకు కావాల్సిన ఏ సినిమానైనా, సిరీస్‌నైనా, ఎన్నిటినైనా ఎప్పుడైనా చూడొచ్చు. కానీ ఏటీటీలో ఒక సినిమా చూడాలంటే దానికి డబ్బు చెల్లించాలి. మరో సినిమా చూడాలంటే దానికి అదనంగా డబ్బు పెట్టాలి.
ఉదాహరణకు రామ్‌గోపాల్ వర్మ లేటెస్ట్గా తీసిన 'నేక్డ్' అనే సాఫ్ట్ పోర్న్ షార్ట్ ఫిలిమ్నే తీసుకోండి. కేవలం 22 నిమిషాల నిడివి ఉన్న ఆ ఫిల్మ్‌ను 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' లేదా 'శ్రేయాస్ ఈటీ' అనే ఏటీటీ ప్లాట్ఫామ్లో చూడాలంటే 200 రూపాయలు చెల్లించాలి. వర్మ మరో సినిమా 'క్లైమాక్స్' చూడాలంటే దాని ధర అదనంగా చెల్లించాల్సిందే. 199 రూపాయలతో ఇవాళ నెట్‌ఫ్లిక్స్ మొబైల్ యాప్‌లో మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకొని, ఓపికున్నన్ని సినిమాలు, సిరీస్ చూసుకోవచ్చు. అంటే ఓటీటీతో పోలిస్తే ఏటీటీ మన గూబ గుయ్యిమనిపిస్తుంది. కానీ 'నేక్డ్' ఫిల్మ్‌తో, దానికి ముందు 'క్లైమాక్స్' ఫిల్మ్‌తో ఆర్జీవీ చేసిన పబ్లిసిటీ స్టంట్తో, బూతు సన్నివేశాలు, దృశ్యాలున్న ట్రైలర్లు, స్టిల్స్‌తో యూత్‌ను అట్రాక్ట్ చేసి, ఆయా సినిమాల్ని చూసే ట్రాప్‌లోకి దించుతున్నాడు.
ఉడుకురక్తం ఉండే యువత అలాంటి సినిమాల్ని చూసి, మానసికంగా ఎలాంటి ఉద్రేకాలకు గురవుతారో అనేకమంది మానసిక నిపుణులు ఎన్నోసార్లు హెచ్చరించారు. యూత్ అలాంటి ట్రాప్‌లో పడకుండా ఉండాలంటే, ఆ కంటెంట్‌పైనా సెన్సారింగ్ ఉండాల్సిందేనని వాళ్లు చెబుతున్నారు. కానీ ఓటీటీ లేదా ఏటీటీలో అసంఖ్యాకంగా వస్తున్న మూవీస్నీ, సిరీస్‌నీ సెన్సారింగ్ చెయ్యాలంటే అషామాషీ విషయం కాదు. కొన్ని గైడ్‌లైన్స్ విధించి, వాటికి అనుగుణంగా తీసిన సినిమాలనే స్ట్రీమింగ్ సైట్లలో అప్లోడ్ చెయ్యాలనే నిబంధనలు విధిస్తే కొంతలో కొంతయినా ప్రయోజనం ఉంటుంది. లేదంటే ఈ భయంకర సెక్స్ అండ్ వయొలెన్స్ సినిమాల విష వలయంలో చిక్కుకొని నవతరం ఏమైపోతుందోనని ఊహించుకోవడానికే ఆందోళన కలుగుతుందనేది నిజం.