'బట్టల సత్తి'ని మెచ్చిన నటసార్వభౌముడు!
on Apr 19, 2021
మల్లికార్జునరావు అంటే వెంటనే గుర్తురాకపోవచ్చు కానీ, బట్టల సత్తి లేదా బట్టల సత్యం అంటే వెంటనే గుర్తుకు వస్తుంది. అంతలా పాత్ర పేరుతో పాపులర్ అయ్యారు మల్లికార్జునరావు. ఏ క్షణాన 'లేడీస్ టైలర్'లో బట్టల సత్తి అనే క్యారెక్టర్ డైరెక్టర్ వంశీకి స్ఫురించిందో కానీ, ఆ పాత్రకు బ్రహ్మాండంగా న్యాయం చేశారు మల్లికార్జునరావు. ఆ సినిమా నుంచి ఆయనను ప్రేక్షకులు చాలా కాలం పాటు బట్టల సత్తిగానే గుర్తుంచుకున్నారు. ప్రేక్షకులకేమిటి.. ఇండస్ట్రీలోని చాలామందికే ఆయన అసలు పేరు కంటే ఈ పేరే ఎక్కువ తెలుసు. బాపు లాంటి దర్శకుడు సైతం అందుకు మినహాయింపు కాదు. అంతే కాదు, బట్టల సత్తి అనే పాత్రతో పాపులర్ అవడం అనేది ఎన్ని బిరుదులిచ్చినా దానికి సరితూగదని విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు అంతటివారే కొనియాడారంటే.. అది చిన్న విషయమా!
అవును. ఈ విషయాన్ని మల్లికార్జునరావు ఉరఫ్ బట్టల సత్యం స్వయంగా తెలియజేశారు. పదకొండేళ్ల క్రిత తెలుగువన్‌కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ఆయన దీనికి సంబంధించిన ఉదంతాన్ని వివరించారు.
"ఒకసారి రామారావుగారు 'శ్రీనాథ కవిసార్వభౌమ'లో వేషం గురించి నన్ను చూపించి బాపు గారిని అడిగారు.. "వీరు మీకు తెలుసా.. అవార్డులేవో చాలా వచ్చాయంట వీరికి." అని. "వీరు మాకు తెలియకపోవడం ఏమిటండీ.. బట్టల సత్యం కదండీ" అన్నారు బాపుగారు. "వీరి పేరు వేరే ఉంది కదా" అని రామారావు గారు అన్నారు. "కాదండీ..ఈయన చేత 'లేడీస్ టైలర్' అనే సినిమాలో డైరెక్టర్ వంశీ బట్టల సత్యం అనే క్యారెక్టర్ చేయించారు. అది జనంలోకి బాగా దూసుకుపోవడంతో ఇండస్ట్రీలోనూ, బయటా ఈయనను బట్టల సత్యం అంటే ఈజీగా తెలుస్తుంది." అని చెప్పారు బాపు. అప్పుడు మహానుభావుడు ఎన్టీఆర్ గారు ఓ గొప్పమాటన్నారు.. "వెరీ గుడ్ బ్రదర్.. ఇది పద్మశ్రీల కంటే గొప్ప బిరుదు మీకు. ప్రజలు, పరిశ్రమ మెచ్చి ఇచ్చిన పేరు ఇది. బాపు లాంటి గ్రేట్ డైరెక్టర్ మీ పేరు బదులు ఈ క్యారెక్టర్ నేమ్‌తో పిలిచారంటే అంతకంటే గొప్ప అవార్డు ఏముంటుంది!" అని భుజం మీద తట్టి, "గాడ్ బ్లెస్ యూ" అన్నారు." అని చెప్పుకొచ్చారు మల్లికార్జునరావు.
ఆ తర్వాత తనకు 'శ్రీనాథ కవిసార్వభౌమ'లో క్యారెక్టర్ కూడా ఎన్టీఆర్ చెప్పారనీ, కానీ తనకు అదే టైమ్‌లో వంశీ సినిమా 'జోకర్' క్లైమాక్స్ జరుగుతుండటంతో ఆ సినిమా చేయడానికి వీలుపడలేదనీ మల్లికార్జునరావు చెప్పారు. తన కెరీర్లో కామెడీ పాత్రలతో ప్రేక్షకులను అమితంగా నవ్వించిన ఆయన 'హలో బ్రదర్'లో చేసిన క్యారెక్టర్‌తో ఏడ్పించారు కూడా. బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో పాడుతూ 2008 జూన్ 24న ఆయన కన్నుమూశారు.
Also Read